
స్టాక్‌మార్కెట్ ఇన్వెస్టర్లలో దీపావళి అంటేనే ప్రత్యేక సందడి నెలకొంటుంది. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని అక్టోబర్ 21న లక్ష్మీ పూజ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో రేపు మార్కెట్లకు సెలవు. అయినా మధ్యాహ్నం సమయంలో మదుపుదారులు, ట్రేడర్లకు వీలుగా గంటసేపు స్టాక్ ఎక్స్ఛేంజీలు ముహూరత్ ట్రేడింగ్‌ను నిర్వహిస్తాయని గుర్తుంచుకోవాలి. ప్రపంచంలో ఇలాంటి ప్రత్యేక ట్రేడింగ్ సెషన్ నిర్వహించే ఏకైక దేశం మనదే. ఈ ముహూరత్ ట్రేడింగ్ రోజును ఇన్వెస్టర్లు, వ్యాపారులు శుభదినంగా భావిస్తారు.
ముహూరత్ ట్రేడింగ్
ఈ ముహూరత్ ట్రేడింగ్ అనవాయితీ ఏళ్లనాటిదే. 1957లో బీఎస్‌ఈ ముహూరత్ ట్రేడింగ్ సంప్రదాయాన్ని ప్రారంభించింది. 1992లో ఎన్‌ఎస్‌ఈ దీన్ని అందిపుచ్చుకుంది. మార్కెట్ పెట్టుబడిదారులకు అదృష్టాన్ని తెచ్చే విధంగా అన్ని గ్రహాలు, నక్షత్రాలను గమనించి నిర్వహించే శుభ ముహూర్తంగా దీన్ని పరిగణిస్తారు. ఈ సందర్భంగా వ్యాపారులు పెట్టుబడికి అనుకూలమైనదిగా భావిస్తారు. ఈక్విటీ సెగ్మెంట్, ఈక్విటీ డెరివేటివ్ సెగ్మెంట్, ఎస్‌ఎల్‌బీ సెగ్మెంట్ విభాగాల్లో ట్రేడింగ్ నిర్వహిస్తారు.
ఈ ఏడాది క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ 21న ఈ ముహూరత్ ట్రేడింగ్ జరుగనుంది. సాధారణంగా దేశంలోని వ్యాపార సంఘాలు కొత్త ఖాతాలను తెరవడంతోపాటు ఈ రోజున మునుపటి బ్యాలెన్స్ షీట్‌ను క్లోజ్ చేస్తారు. అంటే ఈ రోజును వ్యాపారులు కొత్త వ్యాపార సంవత్సరంగా పరిగణిస్తారు. అలాగే ట్రేడ్ ఎక్స్‌పర్ట్‌లు, ఎనలిస్టులు, బ్రోకరేజ్ సంస్థలు పలు స్టాక్స్‌ను ట్రేడర్లకు రికమెండ్ చేస్తారు. దీపావళి బలిప్రతిపద సందర్భంగా అక్టోబర్ 22న ఎక్స్ఛేంజీలు పనిచేయవు.
ఇదీ చదవండి: నా సోదరుడి ఆత్మహత్యకు ఓలా సీఈఓ కారణం
ముహూరత్ ట్రేడింగ్ సెషన్ సమయాలు
అక్టోబర్ 21 మధ్యాహ్నం 1:45కు మార్కెట్ ఓపెన్ అవుతుంది.
మధ్యాహ్నం 2:45కు ముగుస్తుంది.
అక్టోబర్ 22న బలిప్రతిపద సందర్భంగా స్టాక్ మార్కెట్ సెలవు.