ప్రైవేట్ ఉద్యోగుల పంట పండింది!! భారీగా పెర‌గ‌నున్న జీతాలు!

Mercer Total Remuneration survey firm salary increase 9 percent - Sakshi

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారితో గత రెండు సంవత్సరాలుగా వేతనాల విషయంలో నిరాశను ఎదుర్కొంటున్న ఉద్యోగులకు ఈ ఏడాది పంట పండనుంది. వారి వేతనాలు 9 శాతం వరకు పెరగొచ్చని ‘మెర్సర్స్‌ టోటల్‌ రెమ్యునరేషన్‌ సర్వే’ తెలిపింది.

2020లో వేతన పెంపులు తగ్గడం తెలిసిందే. కానీ, ఈ ఏడాది కరోనా పూర్వపు స్థాయిలో వేతన పెంపులను కంపెనీలు చేపట్టొచ్చని ఈ సర్వే పేర్కొంది. 988 కంపెనీలు, 5,700 ఉద్యోగ విభాగాలకు సంబంధించి అభిప్రాయాలను ఈ సర్వే తెలుసుకుంది. కన్జ్యూమర్, లైఫ్‌ సైన్సెస్, టెక్నాలజీ రంగాలు 2022లో ఇతర రంగాల కంటే అధిక వేతన పెంపులను అమలు చేయనున్నట్టు ఈ సర్వే తెలిపింది.

‘‘సంస్థలు ఉద్యోగులకు ప్రోత్సాహకాలు ఇచ్చే విషయమై కరోనా పూర్వపు స్థాయిలో పెట్టుబడులకు సిద్ధంగా ఉండడం కీలకమైన సానుకూలత. 2022లో అన్ని రంగాల్లోనూ వేతన పెంపు 9 శాతంగా ఉండనుంది. 2020లో ఇది 7.7 శాతమే. సానుకూల ఆర్థిక, వ్యాపార సెంటిమెంట్‌ను ఇది తెలియజేస్తోంది’’ అని రివార్డ్స్‌ కన్సల్టింగ్‌ లీడర్‌ ఇండియా సీనియర్‌ ప్రిన్సిపల్‌ మన్సీ సింఘాల్‌ పేర్కొన్నారు.  

సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్, ఆర్‌అండ్‌డీ, విక్రయాలకు ముందు సేవలు, డేటా సైన్సెస్‌ విభాగాల్లో 12 శాతం మేర వేతనాలు పెరగనున్నాయి.  

టెక్నాలజీ సంబంధిత నైపుణ్యాలు కలిగిన వారికి ఈ ఏడాదే కాకుండా, రానున్న రోజుల్లోనూ ఎక్కువ వేతన ప్రయోజనాలు లభించనున్నాయి.  

ఆరంభ స్థాయి ఉద్యోగాల కోసం క్యాంపస్‌ నియామకాల రూపంలో ఫ్రెషర్లను తీసుకుంటున్నందున.. టెక్నో ఫంక్షనల్‌ బాధ్యతల్లోని వారికి ఎక్కువ ప్రయోజనాలు కల్పించాల్సిన అవసరం నెలకొంది.

 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top