
న్యూఢిల్లీ: ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ సంస్థ మారికో వచ్చే ఐదేళ్లలో ఆదాయాన్ని రెట్టింపు చేసుకోనుంది. 2030 నాటికి రూ.20,000 కోట్లకు చేరుకోవాలన్నది తమ లక్ష్యమని మారికో చైర్మన్ హర్ష్ మరివాలా ప్రకటించారు. సఫోలా, పారాచ్యూట్, లివాన్ తదితర ప్రముఖ బ్రాండ్లను కలిగిన మారికో ఆదాయం 2024–25లో రూ.10,000 కోట్లుగా ఉండడం గమనార్హం.
మారికో బ్రాండ్లు, ఆవిష్కరణల బలానికి ఇది నిద్శనమంటూ కంపెనీ వార్షిక నివేదికలో పేర్కొన్నారు. కంపెనీ తదుపరి మార్పు దశలో ఉందన్నారు. భిన్న ప్రాంతాల ప్రజల మారుతున్న అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తులను తీసుకురానున్నట్టు కంపెనీ ఎండీ, సీఈవో సౌగత్ గుప్తా తెలిపారు.
అంతర్జాతీయంగా విశ్వసనీయమైన డిజిటల్ ఎఫ్‌ఎంసీజీ బ్రాండ్‌గా అవతరించడమే తమ లక్ష్యమన్నారు. మధ్య కాలాలానికి 25 శాతానికి పైనే వృద్ధిని నమోదు చేస్తామన్న విశ్వాసంతో ఉన్నట్టు చెప్పారు. 2019–20 అమ్మకాల నుంచి ఎనిమిది రెట్ల వృద్ధికి చేరుకుంటామన్నారు. తమ పోర్ట్‌ఫోలియోని దూకుడుగా విస్తరిస్తామని ప్రకటించారు.