
ముంబైలోని ఖరీదైన అపార్ట్‌మెంట్‌లు బాలీవుడ్ నటులకు భారీ లాభాలు తెచ్చిపెట్టాయి. బాలీవుడ్ నటి మలైకా అరోరా ముంబైలోని అంధేరీ వెస్ట్ లో ఉన్న తన విలాసవంతమైన అపార్ట్ మెంట్ ను రూ.5.30 కోట్లకు అమ్మేసింది. ఆన్‌లైన్ రియల్ ఎస్టేట్ ప్లాట్‌ఫామ్ స్క్వేర్ యార్డ్స్ ప్రకారం.. ఈ లావాదేవీ 2025 ఆగస్టులో ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ (ఐజీఆర్) వద్ద నమోదైంది. అంధేరి వెస్ట్ లోని లోఖండ్ వాలాలో ఉన్న రన్వాల్ ఎలిగంటే అనే హై ఎండ్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో ఈ ప్రాపర్టీ ఉంది.
రూ.2.04 కోట్ల లాభం
మలైకా ఈ అపార్ట్‌మెంట్‌ను 2018 మార్చిలో రూ.3.26 కోట్లకు కొనుగోలు చేశారు. అంటే ఆమె దీనిపై 62 శాతం రూ.2.04 కోట్ల లాభాన్ని ఆర్జించారు. ఈ అపార్ట్మెంట్ కార్పెట్ ఏరియా 1,369 చదరపు అడుగులు, బిల్టప్ ఏరియా 152.68 చదరపు మీటర్లు. ఈ సేల్ లో ఒక కారు పార్కింగ్ స్పేస్ కూడా ఉంది. స్టాంప్ డ్యూటీ కింద రూ.31.08 లక్షలు, రిజిస్ట్రేషన్ చార్జీల కింద రూ.30 వేలు చెల్లించారు.
స్క్వేర్ యార్డ్స్ డేటా ప్రకారం.. 2024 సెప్టెంబర్ నుంచి 2025 ఆగస్టు మధ్య రన్వాల్ ఎలిగెంట్ ప్రాజెక్టులో మొత్తం రూ.109 కోట్ల విలువైన 22 రిజిస్టర్డ్ ప్రాపర్టీ లావాదేవీలు జరిగాయి. ప్రస్తుతం ఈ ప్రాజెక్టులో సగటు ప్రాపర్టీ ధర చదరపు అడుగుకు రూ.33,150గా ఉంది. అంధేరి వెస్ట్ ముంబైలో అత్యంత డిమాండ్ ఉన్న నివాస ప్రాంతాలలో ఒకటి. లగ్జరీ అపార్ట్‌మెంట్లు, ఎంటర్టైన్మెంట్ హబ్‌లకు ఇది ప్రసిద్ధిగాంచిది.
టైగర్ ష్రాఫ్‌కు రూ.3.98 కోట్ల లాభం
మరో బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ ముంబైలోని ఖర్ లో ఉన్న తన విలాసవంతమైన అపార్ట్ మెంట్ ను విక్రయించాడు. (Tiger Shroff sells Mumbai apartment) 2025 సెప్టెంబర్లో రిజిస్ట్రేషన్ పూర్తయింది. ఈ అపార్ట్ మెంట్ అత్యాధునిక రుస్తుంజీ పారామౌంట్ ప్రాజెక్టులో భాగం. దీని కార్పెట్ ఏరియా 1,989.72 చదరపు మీటర్లు, బిల్టప్ ఏరియా 2,189 చదరపు మీటర్లు. ఈ ఫ్లాట్ లో మూడు కార్ పార్కింగ్ స్థలాలు ఉండటం గమనార్హం.
2018లో టైగర్ ఈ ప్రాపర్టీని రూ.11.62 కోట్లకు కొనుగోలు చేశాడు. 2025లో రూ.15.60 కోట్లకు విక్రయించి రూ.3.98 కోట్ల లాభం, పెట్టుబడిపై 34.25 శాతం రాబడి వచ్చింది. ఈ లావాదేవీకి రూ.93.60 లక్షల స్టాంప్ డ్యూటీ, రూ.30 వేల రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించారు. ఈ అపార్ట్‌మెంట్ వెస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ హైవే, రాబోయే మెట్రో మార్గాలతో బాగా అనుసంధానమై ఉంది. బాంద్రా కుర్లా కాంప్లెక్స్, లోయర్ పరేల్, ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం వంటి కీలక ప్రదేశాలకు ఇది దగ్గరగా ఉంది.
ఇదీ చదవండి: ఓయో కంపెనీ పేరు మారింది.. ఐపీఓ ముంగిట కీలక మార్పు