
ఆగస్టు 11 నాటికి రూ.6.64 లక్షల కోట్లు
10 శాతం పెరిగిన రిఫండ్‌లు
ప్రత్యక్ష పన్నుల రూపంలో ఆదాయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు (ఏప్రిల్1 నుంచి ఆగస్ట్ 11 వరకు) రూ.6.64 లక్షల కోట్లు వసూలైంది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో రూ.6.91 లక్షల కోట్లుగా ఉండడం గమనార్హం. 3.95 శాతం మేర తగ్గినట్లు ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి విడుదల చేసిన గణాంకాలతో స్పష్టమవుతోంది. రిఫండ్‌లు పెరగడం ఇందుకు కారణం. వ్యక్తులు, కంపెనీలు, వ్యాపార సంస్థలు చెల్లించే పన్నులు ప్రత్యక్ష పన్నుల కిందకు వస్తాయి.
ఇదీ చదవండి: సమగ్ర భూ సంస్కరణలు చేపట్టాల్సిందే..
కార్పొరేట్ సంస్థల నుంచి నికర పన్నుల ఆదాయం క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 3 శాతం పెరిగి రూ.2.29 లక్షల కోట్లుగా నమోదైంది. వ్యక్తులు, హెచ్‌యూఎఫ్‌లు, సంస్థల నుంచి వచ్చిన ఆదాయం 7 శాతానికి పైగా పెరిగి రూ.4.12 లక్షల కోట్లుగా ఉంది. రూ.22,362 కోట్లు సెక్యూరిటీల లావాదేవీల పన్ను (ఎస్‌టీటీ) రూపంలో వసూలైంది. ఇదే కాలంలో రిఫండ్‌లు 10 శాతం పెరిగి రూ.1.35 లక్షల కోట్లకు చేరాయి. రిఫండ్‌లకు ముందు స్థూల పన్ను వసూళ్లు రూ.7.99 లక్షల కోట్లుగా ఉన్నాయి.