
సంపాదనలో విరాళం చేయాలంటే, అది మంచి కార్యం అయితే రూ.వందలు, రూ.వేలు మహా అయితే రూ.లక్షలు ఇచ్చేందుకు సిద్ధపడుతుంటారు. అలాంటిది సంపాదించిన మొత్తంలో 99 శాతం విరాళంగా ఇస్తానని ఓ వ్యక్తి ప్రకటించారు. సంపాదనలో 99 శాతం విరాళంగా ఇస్తానని చెప్పి అమెరికాలో పేరు మోసిన కంపెనీకి సీఈఓగా ఉన్న జూడీ ఫాల్కనర్(82) వార్తల్లో నిలిచారు. యూఎస్‌లో హెల్త్ కేర్ సంస్థల్లో ఒకటైన ఎపిక్ సిస్టమ్స్ కంపెనీని స్థాపించి ఆమె బిలియనీర్‌గా ఎదిగారు. తన 7.8 బిలియన్ డాలర్ల సంపదలో 99 శాతం విరాళంగా ఇస్తానని ప్రకటించారు. ‘ఆరోగ్య సంరక్షణలో అత్యంత శక్తివంతమైన మహిళ’గా పిలువబడే ఫాల్కనర్ వ్యాపారాన్ని, దాతృత్వాన్ని విస్తరిస్తున్నారు.
1979లో కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఫాల్కనర్ ఎపిక్ సిస్టమ్స్‌ను స్థాపించారు. సాంకేతికత ద్వారా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను మెరుగుపరచాలనే లక్ష్యంతో కంపెనీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా 325 మిలియన్లకు పైగా రోగులకు ఈ సంస్థ సర్వీసులు అందిస్తోంది. ఫాల్కనర్ తాను ఎప్పుడూ టెక్ మొఘల్ అవ్వాలని అనుకోలేదని గతంలో పలుమార్లు చెప్పారు. ఫాల్కనర్ తనను తాను ‘యాక్సిడెంటల్ సీఈఓ’గా అభివర్ణించుకున్నారు. తాను ప్రొఫెషనల్ ఎంబీఏ చదవలేదని చెప్పుకొచ్చారు.
ఇదీ చదవండి: భారత ఉత్పత్తులకు స్వాగతం.. ఆందోళన అనవసరం
దాతృత్వ కార్యక్రమాలు..
బిల్ గేట్స్, మెలిండా ఫ్రెంచ్ గేట్స్, వారెన్ బఫెట్ ప్రారంభించిన గివింగ్ ప్లెడ్జ్ దాతృత్య కార్యక్రమంలో చేరి తన 7.8 బిలియన్ డాలర్ల సంపదలో 99% విరాళంగా ఇస్తానని చెప్పారు. ఫాల్కనర్ తన నాన్-ఓటింగ్ ఎపిక్ షేర్లను తిరిగి కంపెనీకి విక్రయిస్తున్నారు. దాని ద్వారా సమకూరుతున్న మొత్తాన్ని తన దాతృత్వ సంస్థ ‘రూట్స్ అండ్ వింగ్స్’కు మళ్లిస్తున్నారు. ఇది అల్ప ఆదాయ కుటుంబాలకు ఆరోగ్యం, విద్యపై దృష్టి సారించిన లాభాపేక్షలేని ఇతర సంస్థలకు మద్దతు ఇస్తుంది. 2020లో ఈ ఫౌండేషన్ 115 సంస్థలకు 15 మిలియన్ డాలర్లు ఇచ్చింది. 2023 నాటికి ఇది 305 గ్రూపులతో 67 మిలియన్ డాలర్లకు పెరిగింది. 2027 నాటికి ఏటా 100 మిలియన్ డాలర్ల లక్ష్యాన్ని నిర్దేశించుకుంది.