
ఇన్వెస్కో మ్యూచువల్ ఫండ్.. ఇన్వెస్కో ఇండియా ఇన్‌కమ్ ప్లస్ ఆర్బిట్రేజ్ యాక్టివ్ ఫండ్ ఆఫ్ ఫండ్‌ను కొత్తగా తీసుకొచ్చింది. ఈ నూతన ఫండ్ ఆఫర్ 2న ప్రారంభం కాగా.. 16వ తేదీ వరకు పెట్టుబడులకు అందుబాటులో ఉంటుంది. యాక్టివ్‌గా నిర్వహించే డెట్ ఫండ్స్, ఈక్విటీ ఆర్బిట్రేజ్ ఫండ్స్‌లో ఈ పథకం పెట్టుబడులు పెడుతుంటుంది.
సంప్రదాయ డెట్ పథకాలకు ప్రత్యామ్నాయంగా ఈ పథకాన్ని రూపొందించి తీసుకొచ్చినట్టు ఇన్వెస్కో మ్యూచువల్ ఫండ్ తెలిపింది. తక్కువ రిస్క్‌తో కూడిన రాబడి, పన్ను పరంగా మెరుగైన ప్రయోజనం కోరుకునే దీర్ఘకాల పెట్టుబడులకు ఈ పథకం అనుకూలంగా ఉంటుందని పేర్కొంది. మొత్తం పెట్టుబడుల్లో 60–65 శాతాన్ని ఇన్వెస్కో ఇండియా కార్పొరేట్ బాండ్ ఫండ్‌లో పెడుతుంది. 35–40 శాతం మధ్య ఇన్వెస్కో ఇండియా ఆర్బిట్రేజ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తుంది.
యాక్సిస్ సర్వీసెస్ ఆపర్చూనిటీస్ ఫండ్
యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ కొత్తగా సర్వీసెస్ ఆపర్చూనిటీస్ ఫండ్ పేరిట ఓపెన్ ఎండెడ్ స్కీమును ప్రకటించింది. ఇది జూలై 18 వరకు అందుబాటులో ఉంటుంది. బ్యాంకింగ్ నుంచి మొదలుకుని ఈ–కామర్స్, ఫిన్‌టెక్, హెల్త్‌కేర్ వరకు వివిధ రంగాల్లో అత్యుత్తమంగా రాణిస్తున్న సంస్థల్లో ఈ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తుంది.
భారీ స్థాయిలో వృద్ధి చెందగలిగి, పెట్టుబడులను సమర్థంగా వినియోగించుకుంటూ, పోటీ సంస్థలతో పోలిస్తే మెరుగ్గా ఉన్న కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా దీర్ఘకాలంలో పెట్టుబడుల వృద్ధి ప్రయోజనాలను కల్పించడం ఈ ఫండ్ ప్రధాన లక్ష్యం. సేవల రంగానికి అనుకూల పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో దేశ ఆర్థిక ప్రగతికి ఇది కీలకంగా ఉంటుందని యాక్సిస్ ఏఎంసీ ఎండీ బి. గోపకుమార్ తెలిపారు.