'ఏం కొనేటట్టు లేదు.. తినేటట్టు లేదు'

Inflation Continued To Hit Hard Fmcg Industry Gcpl Report - Sakshi

న్యూఢిల్లీ: కొబ్బరినూనె, బిస్కెట్లు, సబ్బులు, కాస్మోటిక్స్‌ వంటి ఫాస్ట్‌ మూవింగ్‌ కన్జూమర్‌ గూడ్స్‌ (ఎఫ్‌ఎంసీజీ) పరిశ్రమలో ఏప్రిల్, మే, జూన్‌ త్రైమాసికంలో డిమాండ్‌ మందగమనంలో సాగింది. ప్రధాన కంపెనీలు డాబర్, మారికో, గోద్రెజ్‌ కన్జ్యూమర్‌ ప్రొడక్ట్స్‌ లిమిటెడ్‌ (జీసీపీఎల్‌) త్రైమాసిక నివేదికలు స్వయంగా ఈ విషయాన్ని తెలియజేశాయి. 

ద్రవ్యోల్బణం తీవ్రత ఆదాయాలపై ప్రభావం చూపుతున్నందున, వినియోగదారులు ప్రధాన వస్తువులపై ఖర్చు చేయడానికి వెనుకాడారని సంస్థలు వెల్లడించాయి. దేశీయ ఎఫ్‌ఎంసీజీ పరిశ్రమ ద్రవ్యోల్బణం తీవ్ర స్థాయిల కారణంగా భారీగా దెబ్బతిందని పేర్కొన్నాయి. అమ్మకాలపై ప్రతికూల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని వెల్లడించాయి. వంట నూనెలు, తేనె, ఇతర వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులకు సంబంధించి సంస్థల స్థూల మార్జిన్లు ప్రభావితం అయ్యే స్థాయిలో వినియోగం పడిపోయిందని ఎఫ్‌ఎంసీజీ దిగ్గజాలు తెలిపాయి. 

అంతేకాకుండా, పట్టణ మార్కెట్లతో పోలిస్తే గ్రామీణ మార్కెట్ల వృద్ధి జూన్‌ త్రైమాసికంలో నెమ్మదించిందని వెల్లడించాయి. గోద్రెజ్‌ కన్జ్యూమర్‌ ప్రొడక్ట్స్, మారికోలు తమ భారతీయ వ్యాపార పరిమాణం క్షీణ దిశలో ఉందని కూడా ఆందోళన చెందుతుండడం గమనార్హం. పెరుగుతున్న ద్రవ్యోల్బణం డిమాండ్‌ను తగ్గిస్తుండడం దీనికి కారణం. ఇప్పటివరకూ అందిన సమాచారాన్ని బట్టి ఎఫ్‌ఎంసీజీ దిగ్గజాలు డిమాండ్‌ ధోరణులు, సంస్థల పనితీరు గురించి తొలి అంచనాలను తమ అప్‌డేటెడ్‌ నివేదికల్లో పేర్కొన్నాయి. జూన్‌ 30తో ముగిసిన త్రైమాసికానికి సంబంధించి వాటి సంబంధిత బోర్డులు సంస్థల ఆర్థిక ఫలితాలను ఆమోదించిన తర్వాత వివరణాత్మక ఆర్థిక ఫలితాలు వెల్లడవుతాయి.  మూడు సంస్థలు ఈ మేరకు తమ జూన్‌ త్రైమాసిక అప్‌డేటెడ్‌ తొలి నివేదికలను వెల్లడించాయి. 

అంతర్జాతీయ వ్యాపారం ఓకే... 
ప్రపంచ అనిశ్చితి, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు ఉన్నప్పటికీ జూన్‌ త్రైమాసికంలో అంతర్జాతీయ వ్యాపారం నుండి వృద్ధిని నమోదుచేసుకున్నట్లు ఎఫ్‌ఎంసీజీ దిగ్గజాలు తెలిపాయి. వార్షిక ప్రాతిపదిక చూస్తే, కన్సాలిటేడెడ్‌ ఆదాయాలు పెరిగినట్లు మారికో పేర్కొంది. డాబర్‌ ఇదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, బలమైన వృద్ధిని నమోదుచేసుకుంటామన్న ధీమాను వ్యక్తం చేసింది. దాదాపు అన్ని విభాగాల్లో తమ మార్కెట్‌ వాటా వృద్ధిని నమోదుచేసుకుంటోందని తెలిపింది. కాగా గోద్రెజ్‌ మాత్రం తమన కంపెనీకి భారత్‌ తరువాత అతిపెద్ద మార్కెట్‌ అయిన ఇండోనేయాలో వినియోగం, మార్జిన్లు దెబ్బతింటున్నట్లు తెలిపింది. ఆఫ్రికా, అమెరికా, పశ్చిమాసియాల్లో మాత్రం వృద్ధి రెండంకెల్లో నమోదవుతుందన్న భరోసాను వ్యక్తం చేసింది.  

వినియోగమంటే భయం 
ప్రస్తుత పోకడల ప్రకారం చూస్తుంటే,  వినియోగదారులు కొన్ని అనవసరమైన వస్తువుల కొనుగోళ్లను మానేశారు. అవసరమైన వస్తువుల కొనుగోలు విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. తక్కువ ధర బ్రాండ్‌వైపు మళ్లడం, చిన్న ప్యాక్‌లకు మారడం వంటి ధోరణులను అవలంభిస్తున్నారు. కొన్ని ఉత్పత్తుల అమ్మకాలు క్షీణతలోకి కూడా జారిపోయాయి. సఫోలా ఆయిల్స్‌ను ఇక్కడ ప్రస్తావించుకోవాలి.  సఫోలా నూనెలను మినహాయించి, భారతదేశ వ్యాపారం స్వల్ప పరిమాణంలో వృద్ధిని నమోదు చేసింది. పారాచూట్‌ కొబ్బరి నూనె స్వల్ప పరిమాణంలో క్షీణతను నమోదు చేసింది. – మారికో  

ఆదాయాలు పరిమితం 
2021–22 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 35.4 శాతం ఆదాయ వృద్ధి నమోదయ్యింది. అయితే తాజాగా ముగిసిన జూన్‌ త్రైమాసికంలో ఈ రేటు ఒకంకెకు పరమితం అవుతుంని అంచనావేస్తున్నాం. అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల పరిణామాలు అమ్మకాలపై ప్రభావం చూపుతున్నాయి. అయితే తాజా పరిస్థితుల ప్రతికూల ప్రభావాలను భారత్‌ క్రమంగా అధిగమిస్తుందని విశ్వసిస్తున్నాం. తగిన వర్షపాతం, ద్రవ్యోల్బణం తగ్గుదల ఇందుకు దోహదపడతాయని అంచనా. – డాబర్‌

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top