
పెరిగిన పాల ఉత్పత్తుల వినియోగం
సర్వే నివేదికలో వెల్లడి
న్యూఢిల్లీ: ప్రజల ఆహార అలవాట్లలో గణనీయంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. 2023–24లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల వారు రోజువారీ తీసుకునే ఆహారంలో తృణధాన్యాలు, పప్పు ధాన్యాల వాటా తగ్గిపోయింది. అదే సమయంలో పాలు, పాల ఉత్పత్తుల వినియోగం పెరిగింది. కుటుంబాల వినియోగ వ్యయాలపై నిర్వహించిన సర్వే నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 2022 ఆగస్టు – 2023 జూలై, 2023 ఆగస్టు – 2024 జూలై మధ్య కాలంలో ఈ సర్వే నిర్వహించారు.
దీని ప్రకారం, పట్టణ ప్రాంతాల్లో గుడ్లు, చేపలు, మాంసం వినియోగంలో పెద్దగా మార్పు లేనప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం పెరిగింది. 2022–23లో పట్టణ ప్రాంతాల్లో ఆహారంలో తృణ ధాన్యాల వాటా 38.8 శాతంగా ఉండగా 2023–24లో 38.7 శాతానికి స్వల్పంగా తగ్గింది. గ్రామీణ భారతంలో ఇది 46.9 శాతం నుంచి 45.9 శాతానికి క్షీణించింది. అలాగే పప్పు ధాన్యాల విషయానికొస్తే పట్టణ ప్రాంతాల్లో వినియోగం 9.6 శాతం నుంచి 9.1 శాతానికి, గ్రామీణ ప్రాంతాల్లో 8.8 శాతం నుంచి 8.7 శాతానికి నెమ్మదించింది.
→ మరోవైపు, పట్టణ ప్రాంతాల ప్రజల ఆహారంలో పాలు, పాల ఉత్పత్తుల వినియోగం 12.8 శాతం నుంచి 12.9 శాతానికి, గ్రామీణ ప్రాంతాల్లో 10.6 శాతం నుంచి 11 శాతానికి పెరిగింది.
→ డైట్‌లో గుడ్లు, చేపలు, మాంసం వాటా గ్రామీణ ప్రాంతాల్లో 12.3 శాతం నుంచి 12.4 శాతానికి పెరగ్గా, పట్టణ ప్రాంతాల్లో ఎలాంటి మార్పు లేకుండా 14.1 శాతం స్థాయిలోనే ఉంది.
→ గ్రామీణ ప్రాంతాల్లో ‘ఇతర ఆహార’ పదార్థాల వాటా 21.4 శాతం నుంచి 22 శాతానికి, పట్టణ ప్రాంతాల్లో 24.8 శాతం నుంచి 25.3 శాతానికి పెరిగింది.
→ గ్రామాల్లో రోజుకు తలసరి కేలరీల సగటు వినియోగం, సర్వే నిర్వహించిన రెండేళ్లలో వరుసగా 2233 కిలోకేలరీలుగా, 2212 కిలోకేలరీలుగా ఉంది. పట్టణ ప్రాంతాల్లో ఇది 2250 కిలోకేలరీలు, 2240 కిలోకేలరీలుగా నమోదైంది.
→ నెలవారీగా తలసరి వినియోగ వ్యయం (ఎంపీసీఈ) పెరిగే కొద్దీ ప్రాంతాలకతీతంగా సగటు కేలరీల వినియోగం కూడా పెరిగింది.