చిన్న నగరాల్లో స్మార్ట్‌ఫోన్స్‌ హవా! | Smartphone sales stagnate in rural India | Sakshi
Sakshi News home page

చిన్న నగరాల్లో స్మార్ట్‌ఫోన్స్‌ హవా!

May 15 2025 4:06 AM | Updated on May 15 2025 4:10 AM

Smartphone sales stagnate in rural India

మెట్రోలు, బడా నగరాల్లో డిమాండ్‌ మందగమనం 

కంపెనీలకు రూరల్‌ సేల్స్‌ దన్ను

చౌక, ప్రీమియం 5జీ ఫోన్లకూ మంచి గిరాకీ...

మెట్రోలు, బడా నగరాల వంటి అర్బన్‌ మార్కెట్లో స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాలు పతాక స్థాయికి చేరుకోవడంతో డిమాండ్‌ మందకొడిగా మారింది. అయితే, హ్యాండ్‌సెట్‌ తయారీ సంస్థలకు ద్వితీయ శ్రేణి నగరాలు, గ్రామీణ ప్రాంతాలు ఇప్పుడు ఈ లోటును భర్తీ చేస్తున్నాయి. 

చౌక ఫోన్లే కాదు.. ప్రీమియం 5జీ ఫోన్ల కొనుగోళ్లకూ కస్టమర్లు తగ్గేదేలే అంటున్నారు. పెద్ద నగరాలను మించి విక్రయాలు నమోదవుతుండటంతో సేల్స్‌ పెంచుకోవడానికి కంపెనీలు రూరల్‌ రూట్‌ ఎంచుకుంటున్నాయి. అంతేకాదు, ఫైనాన్సింగ్‌ ఆప్షన్ల దన్నుతో సెకండ్‌ హ్యాండ్‌ 4జీ ఫోన్లు కూడా హాట్‌ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. 

ఒకప్పుడు కీప్యాడ్‌ ఫీచర్‌ ఫోన్స్‌ వాడకానికి బాగా అలవాటు పడ్డ గ్రామీణ, చిన్న పట్టణాల ప్రజలు ‘స్మార్ట్‌’గా అప్‌గ్రేడ్‌ అవుతున్నారు. దీంతో చిన్న నగరాలు, పట్టణాలతో పాటు పల్లెల్లోనూ స్మార్ట్‌ఫోన్లకు డిమాండ్‌ దూసుకెళ్తోంది. పెద్ద నగరాల్లో స్తబ్దుగా మారిన సేల్స్‌ను కంపెనీలు అక్కడ పూడ్చుకుంటున్నాయి. దీంతో మొత్తంమీద స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాలు పడిపోకుండా, వృద్ధి సిగ్నల్స్‌కు వీలవుతోందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. 

‘4జీతో పాటు 5జీ మోడల్స్‌ కూడా అందుబాటు ధరల్లో లభ్యమవుతుండటంతో ద్వితీయ శ్రేణి నగరాల్లో ఈ ఏడాది అమ్మకాల వృద్ధి భారీగా నమోదుకానుందని టెక్‌ఆర్క్‌ అడ్వయిజర్‌ అజయ్‌ శర్మ చెప్పారు. ‘2023, 2024 సేల్స్‌ ట్రెండ్‌ను పరిశీలిస్తే, పెద్ద నగరాలకు మించి టియర్‌–2 నగరాల్లో అమ్మకాలు పుంజుకున్నాయి. ప్రీమియం ఫోన్ల పట్ట ఆసక్తి ఈ నగరాలకూ పాకింది. మరోపక్క, చౌక 5జీ ఫోన్ల దన్నుతో కొన్ని బ్రాండ్‌లు మిగతా కంపెనీల కంటే వేగంగా వృద్ధి చెందుతున్నాయి’ అని పేర్కొన్నారు.

ఆఫ్‌లైన్‌ స్టోర్స్‌ ద్వారా... చిన్న నగరాలు, పట్టణాల్లో కూడా ప్రజల ఆదాయాలు పెరుగుతుండటంతో పాటు డిజిటల్‌ టెక్నాలజీ పట్ల అవగాహన, రిటైల్‌ నెట్‌వర్క్‌లను విస్తరిస్తుండటం వల్ల కస్టమర్లు హై–ఎండ్‌ డివైజ్‌లకు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారని కౌంటర్‌పాయింట్‌ రీసెర్చ్‌ ఎనలిస్ట్‌ సుభమ్‌ సింగ్‌ తెలిపారు. ‘ప్రధాన హ్యాండ్‌సెట్‌ బ్రాండ్‌లన్నీ ఆఫ్‌లైన్‌ (రిటైల్‌ స్టోర్స్‌) ద్వారా చిన్న నగరాల్లోకి చొచ్చుకుపోతున్నాయి. 
 


ఇంటర్నేషనల్‌ డేటా కార్పొరేషన్‌ (ఐడీసీ) గణాంకాల ప్రకారం 2024లో 15.1 కోట్ల స్మార్ట్‌ఫోన్‌లు అమ్ముడయ్యాయి. 4 శాతం వృద్ధి నమోదైంది. 
 
స్టోర్‌లో నేరుగా ఫోన్‌ను చూసి, అనుభూతి చెందే అవకాశం, అలాగే ఈజీ ఫైనాన్సింగ్‌ ఆప్షన్లతో ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌ కొనుగోళ్లకు వెనకాడటం లేదు’ అని సింగ్‌ వివరించారు. 30 నగరాల్లో నిర్వహించిన మార్కెట్‌ అధ్యయనం ప్రకారం, బడా నగరాల్లో (టియర్‌–1) వార్షిక అమ్మకాల వృద్ధి సింగిల్‌ డిజిట్‌కు పరిమితం కాగా, టియర్‌–2, అంతకంటే చిన్న నగరాల్లో రెండంకెల వృద్ధి నమోదవుతున్నట్లు చెప్పారు. ఫీచర్‌ ఫోన్స్‌ కస్టమర్లు అప్‌గ్రేడ్‌ అవుతుండటం, అనువైన రుణ సదుపాయాల వల్ల తృతీయ శ్రేణి (టియర్‌–3) ప్రాంతాల్లో తమ అమ్మకాలు 19–20 శాతం పెరిగాయని హ్యాండ్‌సెట్‌ బ్రాండ్‌ టెక్నో సీఈఓ అరిజిత్‌ తలపాత్ర పేర్కొన్నారు.

అమ్మకాలు ఫ్లాట్‌.. ఆదాయాలు జూమ్‌ 
కోవిడ్‌ ముందు నాటి స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాల వృద్ధితో పోలిస్తే ప్రస్తుతం దేశంలో సేల్స్‌ మందగమనం స్పష్టంగా కనబడుతోందని  విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం ఏటా విక్రయాలు 15 కోట్ల స్థాయికి పరిమితం అవుతున్నాయి. ఈ ఏడాది (2025) అమ్మకాలు  ఫ్లాట్‌గా ఉంటాయని అంచనా వేస్తున్నారు. టాప్‌లేపుతున్న వివో, శాంసంగ్, షావోమి, ఒప్పో, రియల్‌మీ వంటి బ్రాండ్‌లకు ఇది ప్రతికూల సిగ్నల్స్‌ పంపుతోంది. అయితే, 2024లో దేశీ స్మార్ట్‌ఫోన్‌ పరిశ్రమ మొత్తం ఆదాయం ఆల్‌టైమ్‌ గరిష్ఠానికి (9% వార్షిక వృద్ధి) దూసుకెళ్లడం విశేషం. ప్రధానంగా 5జీ, జెనరేటివ్‌ ఏఐ వంటి ఫీచర్లు గల ఖరీదైన స్మార్ట్‌ఫోన్స్‌పై కస్టమర్లు భారీగా ఖర్చు చేయడమే దీనికి కారణమని 
కౌంటర్‌పాయింట్‌ వెల్లడించింది.

సగం ఫోన్‌ సేల్స్‌ అక్కడి నుంచే... 
‘ప్రీమియం స్మార్ట్‌ఫోన్ల వాడకం ట్రెండ్‌ మెట్రోలు, పెద్ద నగరాలకే పరిమితం కావడం లేదు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో కూడా రూ.8,500–17,000 స్థాయికి మించి ఖరీదైన ఫోన్లకు కస్టమర్లు సై అంటున్నారు. ముఖ్యంగా ఔత్సాహిక మధ్య తరగతి కొనుగోలుదారులు వేగంగా ప్రీమియం ఫోన్లకు అప్‌గ్రేడ్‌ అవుతున్నారు’ అని సీసీఎస్‌ ఇన్‌సైట్‌ సీనియర్‌ ఎనలిస్ట్‌ ఏక్తా మిట్టల్‌ చెప్పారు. 

స్మార్ట్‌ఫోన్‌ పరిశ్రమలో భవిష్యత్తు వృద్ధికి చిన్న నగరాలే చోదకంగా నిలుస్తాయంటున్నారు. ప్రస్తుతం సగానికి పైగా స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాలు చిన్న నగరాలు, పట్టణాల్లోనే నమోదవుతున్నాయని కూడా సీసీఎస్‌ ఇన్‌సైట్‌ తెలిపింది. మరోపక్క, జియో, ఎయిర్‌టెల్‌ తమ 5జీ నెట్‌వర్క్‌ను గ్రామీణ, సబర్బన్‌ ప్రాంతాలకు వేగంగా విస్తరిస్తుండటం, క్వాల్‌కామ్, మీడియాటెక్‌ వంటి చిప్‌ తయారీ దిగ్గజాలు రూ.12,000 కంటే తక్కువ స్థాయిలో 5జీ ఫోన్లు లభించేలా చౌక 5జీ ప్రాసెసర్లను అందుబాటులోకి తేవడం కూడా పరిశ్రమకు దన్నుగా నిలుస్తోందనేది నిపుణుల  మాట!

–సాక్షి, బిజినెస్‌ డెస్క్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement