
హైదరాబాద్ వంటి నగరాల్లో రెంటల్ అగ్రిమెంట్స్ తప్పనిసరి
అద్దెదారులు, యజమానుల భవిష్యత్ సంరక్షణకు కీలకం
‘మోడల్ టెనెన్సీ యాక్ట్ 2021’ నిబంధనలతో ఒప్పందాలు
11 నెలల్లోపు నోటరీ ఒప్పందాలతో భవిష్యత్‌లో తిరకాసే..
హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో అద్దె ఇల్లు అనేది నిత్యజీవితంలో చాలా సాధారణమైంది. ఉద్యోగావకాశాలు, విద్య, వైద్యం వంటి అంశాల కోసం లక్షలాది మంది నగరానికి తరలివచ్చి అద్దె ఇళ్లలో నివసిస్తున్నారు. ఈ నేపథ్యంలో రెంటల్ అగ్రిమెంట్ అనే విషయం ఎంతో కీలకమైంది. కానీ ఇప్పటికీ చాలామంది ఇంటి యజమానులు, అద్దెదారులు దీనిపై స్పష్టమైన అవగాహన లేకుండా నేరుగా మాటల కుదుర్చుకొని ముందుకు వెళ్లడం చూస్తుంటాం. రెంటల్ అగ్రిమెంట్ విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోతే అద్దెదారులు, గృహ యజమానులు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఈ వివాదాల్లో చిక్కుకోకుండా ఉండాలంటే న్యాయ నిపుణుల సూచనలకు అనుగుణంగా రెంటల్ అగ్రిమెంట్ చేసుకోవడం ఉభయులకు ఉపయుక్తంగా ఉంటుంది. – సాక్షి, సిటీబ్యూరో
ప్రస్తుత రియల్టీ మార్కెట్ గమనిస్తే, రెంటల్ అగ్రిమెంట్‌కు గల చట్టపరమైన ప్రాముఖ్యతను సమర్థంగా ఉపయోగించుకోవడం చాలా
అవసరం. అద్దెదారుడి హక్కులు, ఇంటి యజమానుడి బాధ్యతలు, ఒప్పంద కాలం, అడ్వాన్స్, పెనాల్టీలు, ఇంటి పరిస్థితి వంటి అంశాలను స్పష్టంగా పేర్కొనడం వల్ల భవిష్యత్తులో అనవసర గొడవల నుంచి తప్పించుకోవచ్చు. రెంటల్ అగ్రిమెంట్ అంటే కేవలం డాక్యుమెంట్ మాత్రమే కాదు, అది రెండు వ్యక్తుల మధ్య నమ్మకాన్ని, బాధ్యతను ప్రతిబింబించే ఒప్పందం. హైదరాబాద్ వంటి నగరాల్లో పెరుగుతున్న నగరీకరణ మధ్య ఇది ఒక అవసరం.
‘మోడల్ టెనెన్సీ యాక్ట్ 2021’..
భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన మోడల్ టెనెన్సీ యాక్ట్ 2021’ ప్రకారం అద్దె సంబంధిత అన్ని వ్యవహారాలను సరళంగా, పారదర్శకంగా చేయాలనే లక్ష్యంతో కొన్ని స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వబడ్డాయి.
➤ఇందులో భాగంగా ప్రతి అద్దె ఒప్పందం రిజిస్టర్ చేయించుకోవాలి.
➤అద్దెదారును అకస్మాత్తుగా ఇంటి నుంచి వెళ్లగొట్టడం తప్పు.
➤అడ్వాన్స్‌గా ఎక్కువ డబ్బు తీసుకునేలా నియంత్రణ తప్పనిసరి.
➤అద్దె ఇంటికి సెక్యూరిటీ డిపాజిట్ 2 నెలల అద్దె మాత్రమే తీసుకోవాలి.
➤వ్యాపారాల నిమిత్తం అద్దె తీసుకుంటే ముందస్తుగా 6 నెలల కిరాయి మాత్రమే డిపాజిట్ చేయాలి.
➤అద్దె పెంపు, భద్రత డిపాజిట్ వంటి వాటికి స్పష్టత ఉండాలి.
➤ఇవన్నీ ప్రస్తుతం హైదరాబాద్ వంటి నగరాల్లో అమలవుతున్నాయా అన్నది ప్రశ్నే. కానీ ఈ చట్టం నగరాల్లో ఇప్పుడిప్పుడే మెల్లగా పుంజుకుంటోంది.
11 నెలల రెంటల్ అగ్రిమెంట్
11 నెలల రెంటల్ అగ్రిమెంట్ అనేది చాలా ఆసక్తికరమైన అంశం. మెట్రోనగరాల్లో ఎక్కువగా రెంటల్ అగ్రిమెంట్స్ 11 నెలలకు మాత్రమే చేస్తుంటారు. ఎందుకంటే 1908 రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం 12 నెలలకు (ఏడాది) పైబడిన ఒప్పందాలు తప్పనిసరిగా రిజిస్టర్ చేయించాలి. (స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీలు పడతాయి). కానీ 11 నెలల ఒప్పందానికి నోటరైజ్ చేయడం సరిపోతుంది. చట్టబద్ధంగా తక్కువ బాధ్యతలు ఉండటం వల్ల, దీనిని ఇంటి యజమానులు, అద్దెదారులు అనుసరిస్తున్నారు. ఇది ఒక ‘కంఫర్ట్ జోన్’గా మారింది. కానీ దీని వలన కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు.. న్యాయ వివాదం తలెత్తినప్పుడు, నోటరైజ్డ్ ఒప్పందానికి పూర్తి చట్టపరమైన మద్దతు ఉండదు.
నగరంలో అద్దెలు..
హైదరాబాద్‌లోని ప్రధాన ప్రాంతాలైన హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కూకట్‌పల్లి, అమీర్‌పేట వంటి ప్రాంతాల్లో అద్దె ఇళ్లు ఎక్కువగా కార్పొరేట్ ఉద్యోగులు, విద్యార్థుల అవసరాలను తీర్చేలా ఉన్నాయి. కానీ చాలామంది యజమానులు సరైన ఒప్పందం లేకుండా రూమ్‌లు ఇచ్చేస్తున్నారు. ఆన్‌లైన్ రియల్టీ ప్లాట్‌ఫామ్స్ (99ఎకర్స్, నోబ్రోకర్, మ్యాజిక్ బ్రిక్స్ మొదలైన) ద్వారా ఒప్పందాలు అయితే వస్తున్నాయి. కానీ అవి కూడా చాలాసార్లు 11 నెలల్లోనే నిమిత్తమవుతున్నాయి. ప్రధానంగా పోలీస్ వెరిఫికేషన్, ఆధార్ ఆధారిత ఒప్పందం వంటి వాటిని చాలామంది పట్టించుకోట్లేదు.
భవిష్యత్తు దృష్టితో..
రియల్టీ, లైఫ్‌స్టైల్ పరంగా చూస్తే, అద్దె ఇల్లు అనేది తాత్కాలిక అవసరంగా కనిపించినా, జీవన శైలిని ప్రభావితం చేసే అంశం. చట్టపరమైన అవగాహన, పారదర్శక ఒప్పందాలు ఉండటం వల్ల అద్దెదారుడికి భద్రత ఉంటుంది. యజమానికి లీగల్ కవరేజీ ఉంటుంది. రెండు పక్షాల మధ్య విశ్వాసం పెరుగుతుంది.