
21 పైసలు పతనమై 86.91 వద్ద ముగింపు
డాలర్ మారకంలో రూపాయి విలువ 21 పైసలు క్షీణించి 4 నెలల కనిష్ట స్థాయి 86.91 వద్ద స్థిరపడింది. డాలర్ బలపడటం, క్రూడ్ ధరల అనూహ్య పెరుగుదల, నెలాఖరున ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, దిగుమతిదార్ల నుంచి డాలర్లకు డిమాండ్ పెరగడం దేశీయ కరెన్సీపై ఒత్తిడి పెంచాయి.
‘అమెరికా–భారత్‌ల మధ్య ఆగస్టు 1న వాణిజ్య ఒప్పంద చర్చలు విఫలమైనా, చర్చలు వాయిదా పడినా దేశీయ కరెన్సీపై అదనపు ఒత్తిడి పడుతుంది. ట్రేడ్ డీల్ కుదిరితే రూపాయి బలపడే వీలుంది. అప్పటిదాకా ఫారెక్స్ ట్రేడర్లు వేచిచూసే ధోరణి ప్రదర్శించవచ్చు’ అని మీరే అసెట్ షేర్‌ఖాన్ రీసెర్చ్ విశ్లేషకుడు అనుజ్ చౌదరీ తెలిపారు.
ఇదీ చదవండి: ‘ఏఐ మా ఉద్యోగులను ఏం చేయలేదు’
రూపాయి పతనానికి కారణాలు..
1. ఇండియన్ రూపాయితో పోలిస్తే అంతర్జాతీయ లావాదేవీల్లో అమెరికా డాలరుకు డిమాండ్ అధికం. భారత ‘కరెంట్ ఖాతా లోటు(సీఏడీ)’ పెరగడం, ఎగుమతి, దిగుమతుల్లో తీవ్ర అంతరం రూపాయి పతనానికి ప్రధాన కారణాలు.
2. ముడిచమురు ధర పెరుగుతోంది. ఇందువల్ల దిగుమతుల బిల్లూ ఎగబాకుతూ సీఏడీని పెంచుతోంది.
3. ఇటీవలి కాలంలో భారత ఆర్థిక వ్యవస్థలో వృద్ధిపై భిన్న అభిప్రాయాలు ఉంటుండడంతో విదేశీ పెట్టుబడులు దేశం నుంచి వెళ్లిపోతున్నాయి.
4. అమెరికా, ఇతర ఐరోపా దేశాల్లో అధిక ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ఇప్పటి వరకు వడ్డీరేట్లను పెంచిన సెంట్రల్ బ్యాంకులు ఇటీవల వాటిని తగ్గిస్తున్నాయి. జపాన్, చైనా మార్కెట్లు విదేశీ ఇన్వెస్టర్లకు ఆకర్షణగా తోస్తున్నాయి. దాంతో విదేశీ పెట్టుబడిదారులు భారత్‌లోని మదుపులను ఉపసంహరించి అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఫలితంగా భారత రూపాయి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది.