పశ్చిమాసియాలో ముదురుతున్న ఉద్రిక్తతలు భారత ఇంధన దిగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. ముఖ్యంగా దేశీయంగా ఎల్‌పీజీ ఉత్పత్తిని గణనీయంగా పెంచడం ద్వారా సామాన్యుడిపై భారం పడకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
పెరిగిన స్వదేశీ ఉత్పత్తి
ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు ప్రారంభం కాకముందు వరకు భారతదేశ అవసరాల్లో స్వదేశీ ఎల్‌పీజీ ఉత్పత్తి వాటా 40% మాత్రమే ఉండేది. అయితే, ప్రస్తుత అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో దీన్ని 50-60%కి పెంచినట్లు పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ వెల్లడించారు.
గత కొద్ది రోజులుగా గ్యాస్ కొరత ఏర్పడుతుందన్న భయంతో వినియోగదారులు అవసరం ఉన్నా, లేకపోయినా బుకింగ్స్ చేశారు. అయితే, ప్రస్తుతం డిస్ట్రిబ్యూటర్ల వద్ద స్టాక్ నిలకడగా ఉందని, ఎక్కడా సరఫరా నిలిచిపోలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో బుకింగ్స్ కూడా సాధారణ స్థితికి చేరుకున్నాయి. ‘మేము నిరంతరం సరఫరాను పర్యవేక్షిస్తున్నాం. దేశవ్యాప్తంగా సిలిండర్ల డెలివరీ సాధారణంగానే సాగుతోంది. వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’ అని సుజాత శర్మ చెప్పారు.
ఇదీ చదవండి: ఢమాల్.. నేలకరిచిన పసిడి ధరలు


