స్టీల్‌ అవుట్‌లుక్‌.. సూపర్‌ | Sakshi
Sakshi News home page

స్టీల్‌ అవుట్‌లుక్‌ బాగుబాగు

Published Sat, May 7 2022 4:29 PM

India Ratings and Research Observations About Steel Out Look in Country - Sakshi

కోల్‌కతా: ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాల నుండి బలమైన దేశీయ డిమాండ్‌ నేపథ్యంలో భారతీయ ఉక్కు రంగ అవుట్‌లుక్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్థిరంగా ఉండనుందని ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రిసెర్చ్‌ (ఇండ్‌–రా) తన తాజా నివేదికలో పేర్కొంది. గ్లోబల్‌ డిమాండ్‌ అనిశ్చితి ఆందోళనల నేపథ్యంలోనూ దేశీయ పరిశ్రమ  దృఢంగా ఉంటుందన్న భరోసాను వెలిబుచ్చింది. నివేదికలోని అంశాలు, ఇందుకు సంబంధించి పూర్వాపరాలను పరిశీలిస్తే.. 

- 2022–23 ఆర్థిక సంవత్సరంలో దేశీయ స్టీల్‌ పరిశ్రమకు ‘‘తటస్థ అవుట్‌లుక్‌’’ను కొనసాగిస్తున్నాం. అధిక ద్రవ్యోల్బణం, దీనివల్ల అంతంత మాత్రంగా కొనసాగుతున్న మార్జిన్ల అంచనాలు దీనికి కారణం.  
- ప్రభుత్వం చేసే మౌలిక సదుపాయాల వ్యయం దేశీయంగా స్టీల్‌ స్థిరమైన వినియోగానికి తోడ్పడుతుంది. ప్రభుత్వం నేషనల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ పైప్‌లైన్‌ (ఎన్‌ఐపీ) కోసం వచ్చే ఐదేళ్లలో వ్యయాలకు రూ. 1,11,000 కోట్లను కేటాయించింది, అయితే ప్రైవేట్‌ రంగ మూలధన వ్యయం, హౌసింగ్,  కన్సూ్యమర్‌ డ్యూరబుల్స్‌ ఎండ్‌–యూజర్‌ సెగ్మెంట్‌ (వినియోగదారులు), ధరల పెరుగుదల వల్ల డిమాండ్‌లో మందగమనంలోనే ఉండడం కొంత ప్రతికూలాంశం. 
- ఇండ్‌–రా పరిశోధన ప్రకారం, స్టీల్‌ ఉత్పత్తిదారులకు ద్రవ్యోల్బణం సవాళ్లు పూర్తిగా అధిగమించడం కొంత సవాలు కావచ్చు. పరిశ్రమ స్థూల లాభాలు అంతంతమాత్రంగా ఉండడానికి  ద్రవ్యోల్బణం సవాళ్లు దారితీయవచ్చు. అయితే స్థూల ఆదాయాలు మాత్రం కరోనా ముందస్తు సంవత్సరం 2019కంటే అధికంగానే ఉండే వీలుంది.  
- చైనా ఉత్పత్తి, ఎగుమతులు తక్కువగా ఉండటం యురోపియన్‌ మార్కెట్లకు ఎగుమతుల కోటా పరిమితి పెరుగుదల, కొనసాగుతున్న ఉక్రెయిన్‌–రష్యా యుద్ధం కారణంగా భారతీయ స్టీల్‌ కంపెనీలు లాభపడే అవకాశం ఉంది. ఆయా అంశాలు ఎగుమతుల విక్రయాల్లో లాభాలు అధికంగా ఉండే వీలుంది. ఇది ఈ రంగం మొత్తంగా లాభాల బాటన నిలబడ్డానికి దోహదపడుతుంది. 

ఆర్సెలర్‌ మిట్టల్‌ అంచనాలు నిరుత్సాహం 
ప్రపంచంలోని రెండవ అతిపెద్ద ఉక్కు ఉత్పత్తిదారు ఆర్సెలర్‌ మిట్టల్‌ గ్లోబల్‌ స్టీల్‌ డిమాండ్‌లో క్షీణతను అంచనా వేస్తుండడం గమనార్హం. భౌగోళిక రాజకీయ అంతరాయాలు, సప్లై సవాళ్లు, ద్రవ్యోల్బణం,  చైనా కోవిడ్‌ –19 లాక్‌డౌన్‌లు, దీనివల్ల ఆర్థిక కార్యకలాపాలను మందగించడం వంటి అంశాల వల్ల ప్రపంచ ఉక్కు వినియోగం 2022లో ఒక శాతం క్షీణించవచ్చని ఉక్కు ఉత్పత్తి దిగ్గజంఆర్సెలార్‌ మిట్టల్‌ తన తాజా అంచనాల్లో పేర్కొంటోంది. యూరోప్‌లో ఉక్కు వినియోగం (కంపెనీ ప్రధాన యూనిట్లు ఉన్న ప్రాంతాల పరిధిలో) 2022లో 2 నుంచి 4 శాతం క్షీణించవచ్చని అంచనా వేస్తోంది. క్రితం అంచనాలు 0.2 శాతం వృద్ధి కంటే ఇది పూర్తి భిన్నమైన అంచనా కావడం గమనార్హం.  

టాటా స్టీల్‌ పరిస్థితి ఇదీ..
2022 మార్చి త్రైమాసికంలో, యూరప్‌ వ్యాపార కార్యకలాపాలకు సంబంధించి టాటా స్టీల్‌ విక్రయాల పరిమాణం వార్షిక ప్రాతిపదికన 2.8 శాతం క్షీణించింది. కానీ ధరలు పెరగడంతో సీక్వెన్షియల్‌ ప్రాతిపదికన నికర ఆదాయాలు టన్నుకు 53 యూరోలు అధికంగా ఉన్నాయి. చైనా ఇకపై ఏటా తన సామర్థ్యానికి 50–60 మిలియన్‌ టన్నులను అదనంగా జోడించే పరిస్థితి లేనందున డిమాండ్, ధరలు పటిష్టంగా ఉంటాయని టాటా స్టీల్‌ అంచనా వేస్తోంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉక్కు ధరలు తగ్గకుండా చూసే క్రమంలో చైనా స్టీల్‌ ఎగుమతులను భారీగా చేయకపోవచ్చని కూడా టాటా స్టీల్‌ వర్గాలు భావిస్తున్నాయి.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) మొదటి త్రైమాసికంలో తమ స్థూల ఆదాయ మార్జిన్‌న్లు పటిష్టంగా ఉండేలా వ్యూహాలు రూపొందించాలని టాటా స్టీల్‌ భావిస్తోంది. దేశంలో కోకింగ్‌ బొగ్గు ధర కూడా టన్నుకు  100 డాలర్లు పెరుగుతుందని,  అయితే సగటు అమ్మకపు ధరలో టన్నుకు రూ. 8,000–8,500 పెంపు ద్వారా  ఈ సవాళ్లను అధిగమించవచ్చని కంపెనీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. బలమైన డిమాండ్‌ కొనసాగుతుందన్న అంచనాలతో ఈ దేశీయ  స్టీల్‌ దిగ్గజ సంస్థ రాబోయే కొన్ని సంవత్సరాలలో దేశంలో తన ఉత్పత్తి సామర్థ్యం పెంపునకు ప్రణాళికలు రూపొందిస్తోంది. 2030 నాటికి తర సామర్థ్యాన్ని 40 మిలియన్‌ టన్నులకు రెట్టింపు చేయాలని సంకల్పించింది. కాగా, ప్రస్తుత స్టీల్‌ ధరల వద్ద స్టీల్‌ డిమాండ్‌పై కొంత సందేహాలు ఉన్నాయని బ్రోకరేజ్‌ సంస్థ మోతీలాల్‌ ఓశ్వాల్‌ పేర్కొంటోంది. ఈ నేపథ్యలో టాటా స్టీల్‌పై తటస్థ వైఖరి అవలంభిస్తున్నట్లు తెలిపింది.   
 

చదవండి: సాగర్‌మాల.. 1,537 ప్రాజెక్టులు.. రూ.6.5 లక్షల కోట్ల పెట్టుబడులు

Advertisement
 
Advertisement
 
Advertisement