‘ఆర్‌ఈ’ పెట్టుబడుల్లో భారత్‌కు 3వ స్థానం

India ranks 3rd in RE investments - Sakshi

ఈవై నివేదిక

న్యూఢిల్లీ: పునరుత్పాదక విద్యుత్‌ (ఆర్‌ఈ) రంగంలో పెట్టుబడులకు ఆకర్షణీయమైన దేశాల సూచీలో (ఆర్‌ఈసీఏఐ) టాప్‌ 3 దేశాలు ఈసారి కూడా తమ స్థానాలను నిలబెట్టుకున్నాయి. అమెరికా అగ్రస్థానంలో ఉండగా, చైనా రెండో స్థానంలోనూ, భారత్‌ యథాప్రకారం 3వ స్థానంలోనూ కొనసాగుతున్నాయి. ఆర్‌ఈసీఏఐకి సంబంధించి కన్సల్టెన్సీ సంస్థ ఈవై విడుదల చేసిన 58వ ఎడిషన్‌ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.

ఆర్‌ఈ విభాగంలో పెట్టుబడి అవకాశాలకు ఆకర్షణీయంగా ఉన్న టాప్‌ 40 దేశాలతో ఈవై ఈ జాబితా రూపొందించింది. పర్యావరణ, సామాజిక, గవర్నెన్స్‌ అంశాలకు కంపెనీలు, ఇన్వెస్టర్లు పెద్దపీట వేస్తున్న నేపథ్యంలో పర్యావరణహిత విద్యుత్‌ విభాగానికి కార్పొరేట్‌ విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ), వృద్ధి చోదకాలుగా నిలుస్తున్నాయని సంస్థ పేర్కొంది.

ఈసారి పునరుత్పాదక విద్యుత్‌ కొనుగోళ్లలో ఆకర్షణీయతకు కొలమానంగా కొత్తగా పీపీఏ సూచీని కూడా ప్రవేశపెట్టినట్లు వివరించింది. దీనికి సంబంధించి టాప్‌ 30 పీపీఏ మార్కెట్లలో భారత్‌కు ఆరో ర్యాంక్‌ దక్కినట్లు పేర్కొంది. స్వావలంబన సాధించే లక్ష్యంతో విధానపరంగా సమగ్రమైన నిర్ణయాలు తీసుకోవడం, పునరుత్పాదక విద్యుత్‌ మార్కెట్‌లో సానుకూల పరిస్థితులు, పెట్టుబడులు.. టెక్నాలజీపరమైన పురోగతి తదితర అంశాలు, భారత్‌లో పర్యావరణహిత విద్యుత్‌ విభాగం కొత్త శిఖరాలకు చేరుకోవడానికి తోడ్పడుతున్నాయని ఈవై తెలిపింది. అయితే, వేగవంతమైన వృద్ధిని దెబ్బతీసే అవరోధాలను ఈ రంగం జాగ్రత్తగా అధిగమించాల్సి ఉంటుందని హెచ్చరించింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top