భవిష్యత్‌ భారత్‌దే..! | India poised to lead global manufacturing in coming decades | Sakshi
Sakshi News home page

భవిష్యత్‌ భారత్‌దే..!

Sep 13 2025 1:57 AM | Updated on Sep 13 2025 1:57 AM

India poised to lead global manufacturing in coming decades

స్థిరమైన విధానాలతో తయారీ హబ్‌గా ఎదగొచ్చు 

పరిశ్రమకు బాసటగా ప్రభుత్వం 

మారుతీ సుజుకీ ఎండీ తకేయూచి 

న్యూఢిల్లీ: బలమైన ఆర్థిక శక్తిగా భవిష్యత్తంతా భారత్‌దేనని ఆటోమొబైల్‌ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా ఎండీ, సీఈవో హిసాషి తకెయూచి తెలిపారు. రాబోయే అనేక దశాబ్దాల పాటు భారత్‌ హవా నడుస్తుందన్నారు. దేశం ఆకాంక్షిస్తున్నట్లుగా ప్రపంచ తయారీ కేంద్రంగా ఎదగాలంటే విధానాలపరంగా స్థిరత్వం అవసరమని చెప్పారు. ఆటోమోటివ్‌ విడిభాగాల తయారీ సంస్థల సంఘం ఏసీఎంఏ వార్షిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా తకెయూచి ఈ విషయాలు తెలిపారు. 

అంతర్జాతీయంగా భౌగోళికరాజకీయ, ఆర్థిక సంక్షోభ పరిస్థితులు నెలకొన్న తరుణంలో విశ్వసనీయమైన తయారీ హబ్‌గా తన స్థానాన్ని పటిష్టం చేసుకునేందుకు భారత్‌ ముందు చక్కని అవకాశం ఉందని చెప్పారు. ‘చరిత్రను చూస్తే ప్రతి కొన్ని దశాబ్దాలకు ఓ కొత్త దేశం ఆర్థిక శక్తిగా ఆవిర్భవించడం కనిపిస్తుంది. అమెరికా, జపాన్, హాంకాంగ్‌ మొదలైన వాటిని చూశాం. గత మూడు దశాబ్దాల కాలం చైనాకి చెందింది. ఆ దేశం ప్రపంచానికే ఫ్యాక్టరీగా ఎదిగింది. 

ఇకపై వచ్చే అనేక దశాబ్దాల పాటు భారత్‌ హవా ఉంటుంది’ అని ఆయన తెలిపారు. ఉద్యోగం చేయగలిగే వయస్సున్న జనాభా అత్యధికంగా ఉండటం, వేగంగా వృద్ధి చెందుతున్న నాలుగు లక్షల కోట్ల డాలర్ల ఎకానమీ, క్రియాశీలకమైన ప్రభుత్వ మద్దతు, కొత్త ఆవిష్కరణలు చేయడంపై ప్రజల్లో అమితాసక్తి తదితర అంశాలు భారత్‌కి సానుకూలమైనవని తకెయూచి చెప్పారు. 

జపాన్‌ తరహాలోనే ఇక్కడ కూడా.. 
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు జపాన్‌ ఏ విధంగానైతే పరిశ్రమలకు బాసటగా నిల్చిందో భారత్‌లోను అదే తరహా పరిస్థితి కనిపిస్తోందని తకెయూచి చెప్పారు. 

‘ప్రభుత్వం కార్పొరేట్‌ ట్యాక్స్‌ను తగ్గించింది, పీఎల్‌ఐ (ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం), మేకిన్‌ ఇండియా లాంటి సాహసోపేత కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఇటీవల ప్రత్యక్ష పరోక్ష పన్నులను తగ్గించడంతో పాటు దేశీయంగా డిమాండ్‌కి ఊతమిచ్చేందుకు వడ్డీ రేట్లను తగ్గించడం లాంటి చర్యలన్నీ కూడా అంతిమంగా తయారీ రంగ వృద్ధికి దోహదపడతాయి’ అని ఆయన పేర్కొన్నారు. ఇవన్నీ కూడా పరిశ్రమ పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను సూచిస్తాయని చెప్పారు.  

టారిఫ్‌లు పెద్ద సవాలే.. 
భారత ఎగుమతులపై అమెరికా భారీ టారిఫ్‌లు విధించడమనేది ఆటో విడిభాగాల పరిశ్రమకు పెద్ద సవాలేనని తకెయూచి అభిప్రాయపడ్డారు. అయితే, దీన్ని అధిగమించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నందున సానుకూల ఫలితాలు రాగలవని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఇరు దేశాలు కొన్ని సానుకూల ప్రకటనలు చేసినట్లు తెలిపారు. భారత ఆర్థిక వృద్ధితో పాటు దేశ ఆటో పరిశ్రమ భవిష్యత్తు కూడా మరింత ఆశావహంగా కనిపిస్తోందన్నారు. 

2024–25లో 523 బిలియన్‌ డాలర్ల మార్కును దాటిన ఆటో విడిభాగాల ఎగుమతులు 2030 నాటికి రెట్టింపు కాగలవని తకెయూచి చెప్పారు. ‘అంతర్జాతీయ తయారీ హబ్‌గా భారత్‌ ఎదుగుతున్న విషయాన్ని ప్రపంచం గమనిస్తోంది. అందుకే తమ తొలి గ్లోబల్‌ ఎలక్ట్రిక్‌ వాహనం ఈ–విటారా తయారీ కోసం సుజుకీ మోటార్‌ కార్పొరేషన్‌ ఈ దేశాన్ని ఎంచుకుంది. ఈ వాహనం 100 దేశాలకు ఎగుమతి అవుతుంది’ అని పేర్కొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement