
దేశంలో విస్తీర్ణం పరంగా మహానగరం మనదే
గ్రేటర్ విస్తీర్ణం 7,257 చదరపు కిలోమీటర్లు
ఇందులో పట్టణ ప్రాంతం 519 చ.కి.మీ.
మన తర్వాతే ఢిల్లీ 5,825, ముంబై 4,251 చ.కి.మీ. విస్తీర్ణం
మూడు దశాబ్దాలలో 95 శాతం పెరిగిన పట్టణీకరణ
ఐటీ, ఫార్మా, ఏరోస్పేస్ రంగాలే పట్టణీకరణకు కారణం
నిజాం కాలంలో 1591లో పురుడు పోసుకున్న హైదరాబాద్ నగరం అభివృద్ధి ప్రస్థానం నేడు శరవేగంగా సాగుతోంది. తాజాగా ఫ్యూచర్ సిటీ దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. 1998లో ఐటీ రాకతో హైదరాబాద్ వేగం మరింత పుంజుకుంది. అప్పటివరకు హైదరాబాద్, సికింద్రాబాద్‌లకే పరిమితమైన అభివృద్ధి సైబరాబాద్‌కు విస్తరించింది. అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగ్‌రోడ్డు, మెట్రోల ఏర్పాటుతో నగర రూపురేఖలే మారిపోయాయి. అంతర్జాతీయ మౌలిక వసతులు, నైపుణ్య కారి్మకుల లభ్యత, తక్కువ జీవన వ్యయం, కాస్మోపాలిటన్ కల్చర్, ప్రోత్సాహకర ప్రభుత్వ విధానాలతో ప్రపంచ దిగ్గజసంస్థలు నగరంలో కొలువుదీరాయి. అయితే గ్రేటర్‌పై ఒత్తిడి పెరగడంతో దానికి అనుబంధంగా నాలుగో నగరం అనివార్యమైపోయింది. ప్రధాన నగరంలో రద్దీని తగ్గించడంతోపాటు భవిష్యత్తు అవసరాల కోసం ఫ్యూచర్ సిటీ ఏర్పాటు తప్పనిసరైంది. –సాక్షి, సిటీబ్యూరో
ప్రపంచంలో కోటి జనాభా ఉన్న 37 మెగా నగరాల్లో ఆరు ఇండియాలోనే ఉన్నాయి. ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కోల్‌కతా నగరాలు కేవలం జనాభా సెంటర్లు మాత్రమే కాదు. ప్రధాన ఆరి్థక, ఉద్యోగ కేంద్రాలు కూడా. 146 కోట్ల జనాభా ఉన్న మనదేశంలో దాదాపు 37 శాతం మంది పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. 2050 నాటికి ఇది 53 శాతానికి, 87.6 కోట్ల జనాభాకు చేరుతుందని అంచనా. మన మెట్రో నగరాలు ప్రపంచ నగరాలతో పోటీ పడుతున్నాయి. విధానపరమైన మార్పులు, స్థిరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రపంచీకరణ, శ్రామిక జనాభా పెరుగుదల వంటివి నగరాల అభివృద్ధి, విస్తరణకు ప్రధాన కారణాలు.
మహానగరం మనదే..
ప్రపంచవ్యాప్తంగా నగరాలు ఆర్థిక వృద్ధికి ఇంజిన్లు అని చెప్పవచ్చు. ప్రపంచ జీడీపీలో 80 శాతం కంటే ఎక్కువ వాటా నగరాలదే. ఉత్పాదకత, ఆవిష్కరణ, ఆర్థిక, సాంస్కృతిక, సామాజిక అభివృద్ధిని సాధించడంలో నగరాలు ముఖ్యపాత్ర పోషిస్తున్నాయి. దేశంలోని 8 ప్రధాన నగరాలు 4,308 చ.కి.మీ. మేర విస్తరించి ఉన్నాయి. 1995 నుంచి 2025 మధ్య కాలంలో ఈ నగరాలు ఏకంగా 2,136 చ.కి.మీ. విస్తరించాయి. గత మూడు దశాబ్దాల్లో విస్తీర్ణాలు 98 శాతం పెరిగాయి. ఇందులో అత్యధిక విస్తీర్ణం హైదరాబాద్‌దే. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ 7,257 చదరపు కిలోమీటర్లు మేర విస్తరించి ఉంది.
వృద్ధి ఎక్కడ్నుంచి ఎక్కడికి..
1990 చివర్లో హైదరాబాద్‌లో ఫార్మాతోపాటు ఐటీ, ఐటీఈఎస్ రంగం జోరందుకుంది. దీంతో 2000 సంవత్సరాంతంలో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ అప్‌గ్రేడ్ అయ్యాయి. 2008లో అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో ప్రపంచ ప్రయాణికులు, కార్గో సేవలతో వృద్ధి రెండింతలైంది. అదే సమయంలో ఔటర్ రింగ్ రోడ్డు ప్రతిపాదనతో నగరం పశి్చమ ప్రాంతంలో అభివృద్ధి చెందుతున్న ఐటీ కారిడార్‌ను విమానాశ్రయానికి అనుసంధానించింది. దీంతో హైదరాబాద్ ముఖచిత్రమే మారిపోయింది. జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, నైపుణ్య కారి్మకులకు నగరం వేదికైంది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అమలు చేసిన వ్యాపార అనుకూల విధానాలతో ఆరి్థక, సాంకేతిక కేంద్రంగా హైదరాబాద్ స్థానం మరింత బలోపేతమైంది. ఔటర్, మెట్రోలు అందుబాటులోకి రావడంతో నగరంలో కనెక్టివిటీ మరింత పెరిగింది. దీంతో నగరాభివృద్ధి పశి్చమం వైపు నుంచి దక్షిణం దిశగా విస్తరించింది.
గ్రేటరే..
7,257 చ.కి.మీ. మేర విస్తరించి ఉన్న గ్రేటర్ హైదరాబాద్‌లో పట్టణ ప్రాంతం 519 చ.కి.మీ. 1995లో 267 చ.కి.మీ.లుగా ఉన్న నగర అర్బన్ ఏరియా 2005లో 319 చ.కి.మీ. 2015లో 407 చ.కి.మీ.లకు విస్తరించింది. గత మూడు దశాబ్దాల్లో గ్రేటర్ పట్టణ ప్రాంతం 252 చ.కి.మీ. పెరిగింది. 95 శాతం మేర వృద్ధి చెందింది. 1995లో 49 లక్షలుగా ఉన్న గ్రేటర్ జనాభా 2015 నాటికి 87 లక్షలు, ఇప్పుడు 1.13 కోట్లకు చేరింది. గత 30 ఏళ్లలో జనాభా 131 శాతం పెరిగింది. ఐటీ, ఐటీఈఎస్, ఫార్మాసూటికల్స్, బయో టెక్నాలజీ, టూరిజం ఇదే నగరాభివృద్ధికి చోదకాలు.
హెచ్‌ఎంఆర్ దిశగా..
దేశానికే తలమానికంగా నిలిచేలా తెలంగాణలో ఒక ప్రధాన పట్టణ అభివృద్ధికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా హైదరాబాద్, యాదాద్రి–భువనగిరి, మేడ్చల్–మల్కాజ్‌గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలను కలుపుతూ హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్(హెచ్‌ఎంఆర్)ను ప్రతిపాదించింది. 10,472.723 చ.కి.మీ. మేర విస్తరించి ఉండే హెచ్‌ఎంఆర్.. రీజినల్ రింగ్ రోడ్డుతో అనుసంధానమై ఉంటుంది. దీంతో హైదరాబాద్‌తోపాటు పొరుగు జిల్లాల అభివృద్ధి శరవేగంగా జరుగుతోంది.


మాస్టర్ ప్లాన్ తప్పనిసరి
ఏ నగరానికైనా ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి అవసరం. మౌలిక వసతుల కల్పనతోపాటు పర్యావరణానికి ప్రాధాన్యం ఇచ్చే మాస్టర్‌ప్లాన్ ప్రకారమే అభివృద్ధి జరగాలి. సిటికీ వలసలు పెరుగుతుండటంతో పట్టణ ప్రాంతం విస్తరిస్తుంది.
– కె.విద్యాధర్, డైరెక్టర్, హెచ్‌ఎండీఏ
ఉద్యోగ అవకాశాల గని
ఉద్యోగ, ఉపాధి అవకాశాల పుష్కలంగా ఉండటమే హైదరాబాద్ అభివృద్ధికి కారణం. పటిష్టమైన
లా అండ్ ఆర్డర్, నైపుణ్య కార్మికుల లభ్యత, కాస్మోపాలిటన్ కల్చర్ వంటి వాటితో నగరంలోకి జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులు వస్తున్నాయి.
–కె.ఇంద్రసేనారెడ్డి, ప్రెసిడెంట్, క్రెడాయ్ తెలంగాణ