ఆర్బిట్రేజ్‌ ఫండ్స్‌  ఎంత వరకు సురక్షితం?

How Safe Are Arbitrage Funds Should These Be In The Investor's Portfolio - Sakshi

ఆర్బిట్రేజ్‌ ఫండ్స్‌ ఎంత వరకు సురక్షితం? ఇన్వెస్టర్‌ పోర్ట్‌ఫోలియోలో ఇవి ఉండాలా?
ఈక్విటీలో నగదు, ఫ్యూచర్స్‌ మార్కెట్లో ధరల పరంగా ఉండే వ్యత్యాసాలను అవకాశాలుగా తీసుకుని ఇన్వెస్ట్‌ చేసే ఫండ్స్‌ ఇవి. ఈ రూపంలోనే ఇవి రాబడులను ఆర్జిస్తుంటాయి. ఉదాహరణకు ‘ఎస్‌’ అనే స్టాక్‌ ఈక్విటీ మార్కెట్లో రూ.100 వద్ద ట్రేడవుతుందనుకుందాం. ఇదే స్టాక్‌ ఫ్యూచర్‌ మార్కెట్లో రూ.101 వద్ద ట్రేడవుతుందనుకుంటే.. ఈ సందర్భంలో ఆర్బిట్రేజ్‌ ఫండ్‌ ‘ఎస్‌’ స్టాక్‌ను ఈక్విటీలో రూ.100కు కొనుగోలు చేసి.. ఫ్యూచర్‌ మార్కెట్లో రూ.101కు విక్రయిస్తుంది. దీంతో ఒక రూపాయి లాభాన్ని సొంతం చేసుకుంటుంది. సెటిల్‌మెంట్‌ తేదీనాడు (అంటే నెల చివర్లో కాంట్రాక్టుల ముగింపు) ధర నగదు, ఫ్యూచర్‌ మార్కెట్లో ఒక్కటిగా మారుతుంది. దాంతో ఆర్బిట్రేజ్‌ ఫండ్‌ అదే స్టాక్‌కు సంబంధించి మళ్లీ లావాదేవీలను పునరావృతం చేస్తుంది.

ఈ సారి నగదు మార్కెట్లో విక్రయించి ఫ్యూచర్‌ మార్కెట్లో కొనుగోలు చేస్తుంది. దీంతో ఆయా లావాదేవీలు సమం అవుతాయి. ఒక్క విడత ఇలా చేసినట్టయితే ముందు గడించిన రూపాయి లాభం ఖాయమైనట్టే. అంతేకానీ, సెటిల్‌మెంట్‌ తేదీనాటికి ఆయా స్టాక్‌ ధర పెరిగిందా, తరిగిందా అన్నదానితో సంబంధం ఉండదు. ఆర్బిట్రేజ్‌ ఫండ్స్‌ ఇదే మాదిరి లావాదేవీలు నిర్వహిస్తూ ఇన్వెస్టర్లకు లాభాలను తెచ్చిపెడుతుంటాయి. ఆర్బిట్రేజ్‌ అవకాశాల్లేని సమయాల్లో ఇన్వెస్టర్ల పెట్టుబడులను ట్రెజరీ బిల్లులు, స్వల్పకాల డెట్‌ సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేస్తుంటాయి. రిస్క్‌ను పరిశీలించినట్టయితే.. చాలా తక్కువ రిస్క్‌లోనే ఇవి ఉంటాయి. కాకపోతే స్వల్ప కాలంలో మాత్రం అస్థిరతలతో ఉంటుంటాయి. కనీసం మూడు నెలలు అంతకంటే ఎక్కువ కాలం కోసం అయితే నష్టాలకు అవకాశాలు చాలా తక్కువ. అదే సమయంలో ఆర్బిట్రేజ్‌ ఫండ్స్‌ నుంచి ఎక్కువ రాబడులను ఆశించరాదు. లిక్విడ్‌ ఫండ్స్‌ స్థాయిలో రాబడులను అంచనా వేసుకోవచ్చు.

అంటే రాబడులు బ్యాంకు ఖాతాల కంటే మెరుగ్గా ఉంటాయని అర్థం చేసుకోవాలి. దీర్ఘకాలంలో మంచి రాబడులు, సంపద కోసం ఆర్బిట్రేజ్‌ ఫండ్స్‌ అనుకూలం కావు. కొన్ని నెలల నుంచి ఏడాది వరకు తమ నిధులను ఒక్కచోట ఇన్వెస్ట్‌ చేసుకోవాలని భావించే వారికి అనుకూలం. ముఖ్యంగా అధిక పన్ను రేటులో (30 శాతం) ఉన్న వారికి ఆర్బిట్రేజ్‌ ఫండ్స్‌ లాభదాయకం. ఎందుకంటే ఇందులో రాబడులను ఈక్విటీ రాబడులుగానే ఆదాయపన్ను చట్టం పరిగణిస్తోంది. అధిక పన్ను రేటులో లేని వారు, చాలా స్వల్పకాలం కోసం ఇన్వెస్ట్‌ చేసుకునేట్టు అయితే లిక్విడ్‌ ఫండ్స్‌ సరిపోతాయి.

ఇప్పటికైతే డివిడెండ్‌ ఇచ్చే మంచి మ్యూచువల్‌ ఫండ్‌ ఏదైనా ఉందా?.. అలాగే కనీసం ఎంత ఇన్వెస్ట్‌ చేయాల్సి ఉంటుంది? 
– రత్నాకర్‌
డివిడెండ్‌ కోసం మ్యూచువల్‌ ఫండ్‌ను ఎంపిక చేసుకోవడం అన్నది సరైన మార్గం కాదు. ఎందుకంటే దీనివల్ల పెద్దగా రాబడి ఉండదు. ఒక షేరును కొనుగోలు చేస్తే అది మీకు డివిడెండ్‌ ఇస్తుంది. అది స్టాక్‌ ధరలో సర్దుబాటు కాదు. అదే మ్యూచువల్‌ ఫండ్‌లో అయితే డివిడెండ్‌ చెల్లింపు ప్రభావం ఫండ్‌ యూనిట్‌ ఎన్‌ఏవీ (నికర యూనిట్‌ విలువ)లో ప్రతిఫలిస్తుంది. ఉదాహరణకు మీరు ఒక పథకంలో రూ.10 ఎన్‌ఏవీపై రూ.10,000ను ఇన్వెస్ట్‌ చేశారనుకుందాం. తర్వాత కాలంలో అది వృద్ధి చెంది ఎన్‌ఏవీ కాస్తా రూ.15కు చేరితే.. మీ పెట్టుబడి విలువ రూ.15,000 అవుతుంది. ఫండ్‌ సంస్థ రూ.2,000ను డివిడెండ్‌ కింద చెల్లించాలని నిర్ణయించినట్టయితే ఆ మొత్తం మీ బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. డివిడెండ్‌ చెల్లింపు ముగిసిన తర్వాత ఆ పథకంలో మీ పెట్టుబడి విలువ వెంటనే రూ.13,000కు తగ్గిపోతుంది. అంటే మీ పెట్టుబడుల నుంచి మీకు చెల్లింపులు చేయడం. ఫండ్స్‌లో డివిడెండ్‌ చెల్లింపుల విధానం ఇదే మాదిరిగా ఉంటుంది. కానీ, చాలా మంది ఫండ్స్‌ నుంచి వస్తున్న డివిడెండ్‌ పనితీరు కు నిదర్శనంగా పొరపడుతుంటారు. కానీ, స్టాక్‌లో అలా కాదు. లాభాల నుంచి డివిడెండ్‌ చెల్లింపులు చేయడం ఉంటుంది. ఫండ్‌ను డివిడెండ్‌ కోణం నుంచి ఎంపిక చేసుకోవడం సరికాదు.


ధీరేంద్ర కుమార్‌
సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్‌

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top