
ఎల్రక్టానిక్స్ విడిభాగాల తయారీ స్కీమ్ (ఈసీఎంఎస్) కింద రూ. 16,000 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు కేంద్రానికి అందినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అనుమతుల ప్రక్రియ ఇప్పటికే మొదలైందని, షార్ట్‌లిస్ట్ చేసిన ప్రాజెక్టుల పేర్లను సెప్టెంబర్‌లో ప్రకటించే అవకాశం ఉందని పేర్కొన్నాయి. దేశ, విదేశ కంపెనీల నుంచి ఈ స్కీముకు మంచి స్పందన లభించినట్లు వివరించాయి.
రూ. 22,805 కోట్ల ఈసీఎంఎస్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం మే 1న దరఖాస్తులు ఆహ్వానించింది. ఎలక్ట్రానిక్ విడిభాగాల డిమాండ్‌కు తగ్గట్లుగా దేశీయంగా సరఫరాను పెంచేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని రూపొందించింది. టాటా ఎల్రక్టానిక్స్, డిక్సన్ టెక్నాలజీస్, ఫాక్స్‌కాన్‌లాంటి సంస్థలు దీనిపై ఆసక్తి కనపర్చినట్లు సమాచారం.
విడిభాగాల సెగ్మెంట్లో 2030 నాటికి ఎల్రక్టానిక్స్ ఉత్పత్తి 500 బిలియన్ డాలర్లకు చేరనుండగా, డిమాండ్–సరఫరా మధ్య వ్యత్యాసం 248 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 21 లక్షల కోట్లు) చేరుతుందని ఎల్రక్టానిక్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అంచనా వేస్తోంది. దేశీయంగా ఉత్పత్తిని పెంచేందుకు తగు చర్యలు తీసుకోకపోతే ఈ కొరతను అధిగమించేందుకు దిగుమతులపై ఆధారపడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది.