వ్యాక్సిన్‌ షాక్‌- పసిడి ధరల పతనం

Gold, Silver prices tumble on Covid-19 vaccine news - Sakshi

రెండు వారాల గరిష్టం నుంచి వెనకడుగు

ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ. 49,714కు

ఎంసీఎక్స్‌లో వెండి కేజీ రూ. 64,302 వద్ద ట్రేడింగ్‌

కామెక్స్‌లో 1,864 డాలర్ల వద్ద కదులుతున్న పసిడి

24.49 డాలర్ల వద్ద ట్రేడవుతున్న ఔన్స్‌ వెండి 

న్యూయార్క్/ ముంబై: కోవిడ్‌-19 కట్టడికి పలు వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్న వార్తలు బంగారం ధరలను దెబ్బతీశాయి. దీంతో న్యూయార్క్‌ కామెక్స్‌లో ఔన్స్‌ పసిడి 10 డాలర్లు పతనంకాగా.. వెండి సైతం 1 శాతం క్షీణించింది. ఇక దేశీయంగా ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల బంగారం రూ. 50,000 దిగువకు చేరింది. ఈ బాటలో వెండి కేజీ రూ. 65,000 మార్క్‌ను కోల్పోయింది. కొద్ది రోజుల కన్సాలిడేషన్‌ తదుపరి మంగళవారం బంగారం, వెండి ధరలు రెండు వారాల గరిష్టానికి చేరిన సంగతి తెలిసిందే. కాగా.. యూఎస్‌లోనూ ఫైజర్‌ వ్యాక్సిన్‌కు అనుమతులు లభించనున్న వార్తలతో ట్రేడర్లు పసిడి, వెండి ఫ్యూచర్స్‌లో అమ్మకాలకు దిగినట్లు బులియన్‌ వర్గాలు పేర్కొన్నాయి. ఫైజర్‌ వ్యాక్సిన్‌ క్లినికల్‌ పరీక్షల డేటాను పరిశీలించిన యూఎస్‌ ఔషధ నియంత్రణ సంస్థ ఎలాంటి లోపాలూ కనిపించలేదని పేర్కొన్నట్లు తెలుస్తోంది. దీంతో యూఎస్‌లోనూ ఫైజర్‌ వ్యాక్సిన్‌ పంపిణీ ప్రారంభంకానున్నట్లు ఫార్మా వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే యూకేలో ఫైజర్‌ వ్యాక్సిన్‌ను అత్యవసర ప్రాతిపదికన వినియోగిస్తున్న విషయం విదితమే. దేశ, విదేశీ మార్కెట్లో నేటి ట్రేడింగ్‌ వివరాలు ఇలా..  చదవండి: (బ్యాంకింగ్‌: డిజిటల్‌ సేవల్లో సవాళ్లేంటి?)

నేలచూపుతో..
ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ. 395 క్షీణించి రూ. 49,714 వద్ద ట్రేడవుతోంది. ఇది ఫిబ్రవరి ఫ్యూచర్స్‌ ధర కాగా.. తొలుత రూ. 49,850 వద్ద నీరసంగా ప్రారంభమైంది. ఆపై రూ. 49,634 వద్ద కనిష్టానికి చేరింది. ఇక వెండి కేజీ మార్చి ఫ్యూచర్స్‌ మరింత అధికంగా రూ. 890 పతనమై రూ. 64,302 వద్ద కదులుతోంది. ముందురోజుతో పోలిస్తే రూ. 64,542 వద్ద నష్టాలతో ప్రారంభమైన వెండి తదుపరి రూ. 64,163 వరకూ వెనకడుగు వేసింది. ముందురోజు పసిడి రూ. 50,109 వద్ద, వెండి రూ. 65,192 వద్ద ముగిశాయి. 

వెనకడుగులో..
న్యూయార్క్‌ కామెక్స్‌లో వరుసగా రెండు రోజులపాటు బలపడిన బంగారం, వెండి ధరలు తాజాగా డీలా పడ్డాయి. ప్రస్తుతం పసిడి ఔన్స్‌(31.1 గ్రాములు) 0.55 శాతం క్షీణించి 1,864 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్‌ మార్కెట్లోనూ 0.6 శాతం నష్టంతో 1,860 డాలర్లకు చేరింది. వెండి సైతం 1 శాతం వెనకడుగుతో ఔన్స్ 24.49 డాలర్ల వద్ద కదులుతోంది. పసిడి ఫిబ్రవరి కాంట్రాక్ట్‌కాగా.. వెండి మార్చి ఫ్యూచర్స్‌ ధరలు. మంగళవారం పసిడి 1875 డాలర్ల వద్ద, వెండి 24.74 డాలర్ల వద్ద ముగిశాయి. మంగళవారం పసిడి 1875 డాలర్ల వద్ద, వెండి 24.74 డాలర్ల వద్ద ముగిశాయి. కాగా.. పసిడికి 1884-1900 డాలర్ల వద్ద రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని పృథ్వీ ఫిన్‌మార్ట్‌ డైరెక్టర్ మనోజ్‌ జైన్‌ అంచనా వేశారు. ఇదేవిధంగా సమీప భవిష్యత్‌లో 1858-1840 డాలర్ల వద్ద సపోర్ట్స్‌ కనిపించవచ్చని అభిప్రాయపడ్డారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top