ఎంసీఎక్స్‌లో 10% పైగా డౌన్‌ | Gold Prices Crash MCX April Futures Plunge drastic down | Sakshi
Sakshi News home page

ఎంసీఎక్స్‌లో 10% పైగా డౌన్‌

Mar 24 2026 7:58 AM | Updated on Mar 24 2026 8:10 AM

Gold Prices Crash MCX April Futures Plunge drastic down

10 గ్రాములు రూ.1,29,595కు పతనం

వెండి ఇంట్రాడేలో రూ.27,248 క్షీణత; రూ.2,04,500 స్థాయికి..

ఇరాన్‌పై దాడులకు ట్రంప్‌ బ్రేక్‌

నిన్నమొన్నటిదాకా ఆకాశమే హద్దుగా ఎగబాకి కొనుగోలుదారులకు చుక్కలు చూపించిన బంగారం.. ఇప్పుడు భారీ పతనంతో ఇన్వెస్టర్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్‌ యుద్ధం తర్వాత కాస్త పుంజుకున్నట్లు కనిపించిన పసిడి ధర మళ్లీ నేలచూపులు చూస్తోంది. సోమవారం ఎంసీఎక్స్‌ కమోడిటీ మార్కెట్లో ఏప్రిల్‌ ఫ్యూచర్స్‌ కాంట్రాక్టు 10 గ్రాముల రేటు ఏకంగా 10.3 (రూ.14,897) పతనమై.. రూ.1,29,595కు పడిపోయింది.

ఈ ఏడాది జనవరి 29న నమోదైన రూ.1,93,096 ఆల్‌టైమ్‌ గరిష్టం నుంచి చూస్తే 33 శాతం (రూ.63,501) క్షీణించడం గమనార్హం. మరోపక్క, వెండి కూడా వెలవెలబోతోంది. ఏప్రిల్‌ కాంట్రాక్టు కేజీ ధర సోమవారం ఒకానొకదశలో రూ.27,248 దిగజారి రూ.,2,04,500 తాకింది. కాగా, ఢిల్లీ బులియన్‌ మార్కెట్లో 10 గ్రాములు మేలిమి బంగారం ధర రూ.9,050 పడిపోయి రూ.1,43,600కు చేరింది. వెండి కేజీ రూ.10,500 నష్టంతో రూ.2,30,000కు తగ్గింది.

అంతర్జాతీయంగా తీవ్ర హెచ్చుతగ్గులు..

క్రూడ్‌ సెగలు, యుద్ధ ప్రకంపనలతో అంతర్జాతీయంగానూ బంగారం క్రాష్‌ అయింది. నైమెక్స్‌ ఏప్రిల్‌ ఫ్యూ చర్స్‌ ఔన్స్‌ ధర ఒక దశలో 10.4 శాతం (474.9 డాలర్లు) కుప్పకూలి 4,100 డాలర్ల కనిష్టాన్ని తాకింది. అలాగే వెండి ఔన్స్‌ రేటు సైతం 12 శాతం పైగా నష్టపోయి 61.23 డాలర్లకు దిగొచ్చింది. కాగా, ఇరాన్‌ విద్యుత్‌ ప్లాంట్లు, ఇంధన కేంద్రాలపై దాడులకు అయిదు రోజుల పాటు విరామం ఇస్తున్నట్లు ట్రంప్‌ ప్రకటించడంతో పసిడి, వెండి ధరలు భారీగా కోలుకున్నాయి. పసిడి ఔన్స్‌ సోమవారం రాత్రి 8 గంటల సమయంలో 2 శాతం నష్టంతో 4,550 డాలర్ల వద్ద, వెండి 1 శాతం లాభంతో 70.1 డాలర్ల వద్ద కదలాడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో రికవరీతో ఎంఎసీఎక్స్‌లోనూ బంగారం ధర  రూ.1,41,388కి (నష్టం 2 శాతం) పుంజుకుంది. వెండి మళ్లీ లాభాల్లోకి వచ్చింది. అర శాతం పెరిగి రూ.2,34,155కు చేరింది.

ఎందుకీ పతనం..

పశ్చిమాసియాలో యుద్ధం దెబ్బకు క్రూడ్‌ భగభగలు... ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను తీవ్రంగా దెబ్బతీస్తోంది. బ్రెంట్‌ చమురు బ్యారెల్‌ ధర తాజాగా 119 డాలర్లను తాకడం, హార్మూజ్‌ జలసంధిని దాదాపు మూసివేయడంతో ఇంధన సరఫరాలకు తీవ్ర ఆటంకాలు తలెత్తుతున్నాయి. ఈ దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణ భయాలతో ఆర్థిక అనిశ్చితి నెలకొంది. యూఎస్‌ ఫెడ్‌తో సహా పలు దేశాల కేంద్ర బ్యాంకులు ద్రవ్యోల్బణం అంచనాలను పెంచడంతో వడ్డీరేట్ల పెంపు భయాలు మార్కెట్లను వెంటాడుతున్నాయి. 

వెరసి డాలరు విలువ పుంజుకోవడంతో బాండ్‌ ఈల్డ్‌లు ఎగబాకుతున్నాయి. ఈ అంశాలన్నీ బంగారం ధర వెలవెలబోయేలా చేస్తున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. ‘తీవ్ర అనిశ్చితి నేపథ్యంలో బడా సంస్థాగత ఇన్వెస్టర్లు, ముఖ్యంగా అరబ్‌ గల్ఫ్‌ ప్రాంతానికి చెందిన ఇన్వెస్టర్లు బంగారం, ఇతరత్రా లిక్విడ్‌ అసెట్లను అమ్మేసుకుని, నగదు జమ చేసుకుంటున్నారు’ అని ఆగ్మాంట్‌ రీసెర్చ్‌ హెడ్‌ రెనిషా చైనాని విశ్లేషించారు.

వార్‌ బ్రేక్‌.. క్రూడ్‌ కూల్‌..

ఇరాన్‌ విద్యుత్‌ ప్లాంట్లు, ఇంధన కేంద్రాలపై దాడులకు తాత్కాలికంగా విరామం ఇస్తున్నట్లు ట్రంప్‌ ప్రకటించడంతో క్రూడ్‌ రేట్లు చప్పున చల్లారాయి. నైమెక్స్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర ఏకంగా 10 శాతం మేర దిగజారి 88 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. బ్రెంట్‌ రేటు సైతం 10 శాతం పడి 96 డాలర్లకు చేరింది. ఇంట్రాడేలో నైమెక్స్‌ 101 డాలర్లను, బ్రెంట్‌ 109 డాలర్లను తాకింది. ఇరాన్‌తో చర్చల్లో కాస్త పురోగతి నెలకొందని, అందుకే దాడులకు బ్రేక్‌ ఇస్తున్నామంటూ ట్రంప్‌ తాజా ప్రకటనతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టే సంకేతాలు నెలకొన్నాయని, దీంతో క్రూడ్‌ ధరలు శాంతించాయని విశ్లేషకులు చెబుతున్నారు.

ఇదీ చదవండి: తికమకపెట్టే ప్రశ్నలకు ఏఐ స్కోర్‌ ఎంతంటే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement