26 ఏళ్ల వయసులో కోట్ల డబ్బు: ఖర్చు చేసిన స్టైల్.. నెట్టింట వైరల్! | Million Dollar Founder Aman Goel Startup Exit Story | Sakshi
Sakshi News home page

26 ఏళ్ల వయసులో కోట్ల డబ్బు: ఖర్చు చేసిన స్టైల్.. నెట్టింట వైరల్!

Mar 23 2026 7:33 PM | Updated on Mar 23 2026 7:50 PM

Million Dollar Founder Aman Goel Startup Exit Story

ఓ 26 ఏళ్ల యువకుని చేతిలో మిలియన్ డాలర్ల డబ్బు ఉంటే.. ఏం చేస్తాడు. లగ్జరీ కారు కొంటాడు, విలువైన వస్తువులు కొనుగోలు చేస్తాడు. ఇంకా అయితే దుబారా ఖర్చు కూడా చేసే అవకాశం ఉంది. కానీ 'అమన్ గోయల్' మాత్రం వీటన్నింటికీ పూర్తిగా విరుద్ధం. తనకు వచ్చిన డబ్బును ఎలా ఖర్చు చేశాడనే విషయాన్ని అతడు వివరంగా వెల్లడించారు. దీనికి సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

2021 నవంబర్‌లో, నేను నా స్టార్టప్‌ను ఒక పెద్ద కంపెనీకి మిలియన్ డాలర్లకు అమ్మాను. ఇది జరిగినప్పుడు నా వయసు 26 సంవత్సరాలు. ఆ వయసులో చాలా మంది ఆడంబరమైన కార్లు, వాచీలు లేదా ఇతరులను ఆకట్టుకునే జీవనశైలి కోసం విపరీతంగా ఖర్చుపెట్టేవారు. నేను మాత్రం వేరే మార్గాన్ని ఎంచుకున్నాను. సౌకర్యం, సంతోషం, దీర్ఘకాలిక ఆర్థిక స్వేచ్ఛను సమతుల్యం చేసుకుంటూ, ఉద్దేశపూర్వకంగా నా జీవితాన్ని ఉన్నతీకరించుకోవాలని నిర్ణయించుకున్నానని అమన్ గోయల్ పేర్కొన్నారు.

కుటుంబానికి మొదటి ప్రాధాన్యత
స్టార్టప్‌ను అమ్మిన తరువాత.. అదే సంవత్సరం, నేను నా తల్లిదండ్రులను ముంబైలో నాతో పాటు నివసించడానికి తీసుకువచ్చాను. మన సంపదను మనకు అత్యంత ముఖ్యమైనవారితో పంచుకోకపోతే.. దానికి అర్థం లేదని అన్నారు. వారు ఇప్పటికీ నాతోనే నివసిస్తున్నారు, నిజం చెప్పాలంటే, నేను తీసుకున్న ఉత్తమ నిర్ణయం అదే.

ఆరోగ్యం
డబ్బు వచ్చింది కదా అని ఊరికే ఉంటే సరిపోదు. కాబట్టి ఆరోగ్యంపై శ్రద్ద వహించాను. నేను 15 కేజీలకు పైగా బరువు తగ్గాను. దీనికోసం ఒక ఫిట్‌నెస్ కోచ్‌ను నియమించుకున్నాను. నేను, నా భార్య కూడా సంవత్సరానికి రెండుసార్లు ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటాము. మీరు కూడా ఆరోగ్యంపై శ్రద్ద తీసుకోకపోతే.. రానున్న రోజుల్లో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని అన్నారు.

ఆహారం
నేను బయటి ఆహారం, షుగర్, వేయించిన పదార్థాలను చాలా వరకు తగ్గించాను. ఆరోగ్యం వంటగదిలో మొదలవుతుంది, జిమ్‌లో కాదు అని అమన్ పేర్కొన్నారు.

ఇల్లు
నేను 2022లో మొత్తం డబ్బు చెల్లించి ఒక ఇల్లు కొన్నాను. ఎలాంటి లోన్స్ తీసుకోలేదు. ఆర్థిక ఇబ్బందులు లేవు. అద్దెకు ఉండటమే తెలివైన పని అని చాలా మంది అంటారు. ఒకరకంగా అది నిజమే కావచ్చు.. కానీ నా తల్లిదండ్రులు స్థిరపడి, సంతోషంగా ఉండటానికి సొంత ఇల్లు అవసరం.

అప్‌గ్రేడ్‌లు అంటే విపరీతమైన ఖర్చు అని అర్థం కాదు. వాటి అర్థం శాంతి, ఆరోగ్యం. మీరు ప్రేమించే వారితో గడిపే సమయం. మీకు అనుకోకుండా అదృష్టం కలిసి వచ్చినప్పుడు మీరు కొనవలసిన నిజమైన విలాసాలు ఇవే అని అమన్ తన ట్వీట్ పూర్తి చేశారు. ఇది ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్లు అతని నిర్ణయాలకు ఫిదా అవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement