
పంటసాగులో రైతన్నకు కలుపు సవాలుగా మారుతున్న నేపథ్యంలో ఈ సమస్యను కట్టడి చేసేందుకు కొన్ని కంపెనీలు కలుపు మందులు తయారు చేస్తున్నాయి. పంటపోలాల్లో కలుపు తొలగించేందుకు కూలీల ఖర్చులు పెరుగుతున్న తరుణంలో గోద్రేజ్ కంపెనీ అశితాకా పేరుతో కలుపు మందును ఆవిష్కరించింది. ఇది మొక్కజొన్న సాగులో పంట నష్టం వాటిల్లకుండా కలుపు నివారణకు ఎంతో ఉపయోగపడుతుందని గోద్రేజ్ ఆగ్రోవెట్ సీఈఓ(క్రాప్ ప్రొటెక్షన్ బిజినెస్) ఎన్‌కే రాజావేలు తెలిపారు.
‘మొక్కజొన్న పంటలో గడ్డి, పెద్ద ఆకులతో ఉన్న కలుపు మొక్కలను నివారించేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా గడ్డి జాతి మొక్కలు 2-4 ఆకుల వచ్చిన దశలో ఉన్నప్పుడు మరింత సమర్థంగా పని చేస్తుంది. ఈ మందును నేరుగా పంటపై స్ప్రే చేసుకోవచ్చు. నిబంధనలకు తగినట్లు తగిన మోతాదులో దీన్ని ఉపయోగించి కలుపు నివారించుకోవచ్చు. స్ప్రే చేసే క్రమంలో గాలికి పంటపై మందు పడినా మొక్కజొన్నకు నష్టం జరగదు. ఎక్కువకాలం జీవించి, తిరిగి పెరిగే కలుపు జాతులపై ఇది ఎంతో ప్రభావం చూపుతుంది. 400 ఎంఎల్ సర్ఫక్టెంట్‌తోపాటు 50 ఎంఎల్ అశితాకా కలిపి ఎకరాకు పిచికారి చేసుకోవాలి’ అని రాజావేలు చెప్పారు.
వర్షాభావ ప్రాంతాల్లో హెచ్చుతగ్గులకు లోనయ్యే రైతుల ఆదాయాన్ని స్థిరంగా వృద్ధి చెందించేందుకు ఇది ఎంతో తోడ్పడుతుందని కంపెనీ జీఎం(మార్కెటింగ్) అనిల్ చౌబే తెలిపారు. దేశవ్యాప్తంగా మొక్కజొన్న అధికంగా పండించే తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ముందుగా ఈ ప్రొడక్ట్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు చెప్పారు. సమీప భవిష్యత్తులో దీన్ని ఇతర ప్రాంతాలకు విస్తరిస్తామని తెలిపారు.
ఇదీ చదవండి: టాప్ కంపెనీలో 2,800 ఉద్యోగాలు కట్