
ముంబై: భారత్ విదేశీ రుణ భారం (ఎక్స్‌టర్నల్ డెట్) 2025 జూన్ నాటికి 747.2 బిలియన్ డాలర్లకు చేరింది. 2025 మార్చి నుంచి 11.2 బిలియన్ డాలర్లు పెరిగింది. జీడీపీలో విదేశీ రుణ భారం నిష్పత్తి మాత్రం 2025 మార్చి నాటికి ఉన్న 19.1 శాతం నుంచి 18.9 శాతానికి తగ్గినట్టు ఆర్‌బీఐ విడుదల చేసిన డేటా తెలియజేస్తోంది.
డాలర్‌తో రూపాయి మారకం విలువ క్షీణించడం విదేశీ రుణ భారం అధికంగా పెరగడానికి దారితీసింది. ఈ ఏడాది మార్చి చివరి నుంచి జూన్ చివరికి రూపాయి మారకం విలువ ప్రభావాన్ని మినహాయించి చూస్తే నికరంగా పెరిగిన విదేశీ రుణ భారం 6.2 బిలియన్ డాలర్లుగానే ఉంది.
మొత్తం విదేశీ రుణ భారంలో స్వల్పకాల రుణం 18.3 శాతం నుంచి 18.1 శాతానికి తగ్గింది. మొత్తం విదేశీ రుణ భారంలో డాలర్ రూపంలో తీసుకున్నది 53.8 శాతంగా ఉంది. రూపాయి మారకంలో రుణ భారం 30.6 శాతం, యెన్ రూపంలో 6.6 శాతం, సింగపూర్ డాలర్ రూపంలో 4.6 శాతం, యూరో మారకం రూపంలో 3.5 శాతం చొప్పున ఉంది.