
కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్
న్యూఢిల్లీ: బీమా సవరణ బిల్లును వచ్చే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. బీమా రంగంలో 74 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్‌డీఐ) ప్రస్తుత నిబంధనల కింద అనుమతి ఉంది. దీన్ని నూరు శాతానికి పెంచనున్నట్టు 2025–26 బడ్జెట్ సందర్భంగా మంత్రి సీతారామన్ ప్రకటించారు.
100 శాతం ఎఫ్‌డీఐ అనుమతి అన్నది భారత్‌లో ఆర్జించిన ప్రీమియంను ఇక్కడే ఇన్వెస్ట్ చేసే కంపెనీలకు అమలు చేయనున్నట్టు చెప్పారు. అలాగే, నిబంధనలు, షరతుల్లోనూ మార్పులు చేయనున్నట్టు ఆమె పేర్కొన్నారు. బీమా రంగం ఇప్పటి వరకు రూ.82,000 కోట్ల ఎఫ్‌డీఐని ఆకర్షించడం గమనార్హం. కాంపోజిట్ లైసెన్స్ (జీవిత, సాధారణ బీమా సేవలకు)తోపాటు చెల్లించిన మూలధనం తగ్గింపు కూడా ప్రభుత్వ ప్రతిపాదనల్లో భాగంగా ఉన్నాయి. మొదటిసారి 2015లో బీమా రంగంలో ఎఫ్‌డీఐ పరిమితిని 26 శాతం నుంచి 49 శాతానికి కేంద్ర ప్రభుత్వం పెంచింది. తిరిగి 2021లో ఈ పరిమితిని 74 శాతం చేసింది.