
వాహనాలపై నిర్ణయాలు వాయిదా వేస్తున్న కొనుగోలుదారులు
పండుగ సీజన్లో తంటాలు పడుతున్న వాహన డీలర్లు
కొత్త రేట్లు తక్షణం అమలు చేయాలంటూ కేంద్రానికి విజ్ఞప్తి
సాక్షి, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత సీజన్లో ఆఫర్లు బాగున్నాయని గోపాల్ కొత్తగా మారుతీ బలెనో కొనుక్కుందామని బుక్ చేశారు. అడ్వాన్స్ పేమెంట్ కూడా చేశారు. కానీ, అకస్మాత్తుగా కొనుక్కోవడాన్ని వాయిదా వేసుకున్నారు. అటు డీలరు రోజూ ఇంకాస్త కట్టేసి కారును తీసుకెళ్లండంటూ వెంటబడుతున్నప్పటికీ రేపు, మాపు అంటూ సాగదీస్తున్నారే తప్ప డీల్ పూర్తి చేయడం లేదు.
గోపాలే కాదు వాహనాల కొనుగోలు నిర్ణయాలను చాలా మంది ఇలాగే వాయిదా వేసుకుంటున్నారు. కొత్తగా ప్రతిపాదించిన జీఎస్టీ విధానంలో కార్లపై పన్నులు తగ్గి, మరింత ప్రయోజనం లభించనుండటమే ఇందుకు కారణం. ఇది కొనుగోలుదారులపరంగా చూస్తే బాగానే ఉన్నప్పటికీ వాహనాల డీలర్లు గగ్గోలు పెడుతున్నారు. దీనివల్ల పండుగ సీజన్ అంతా తుడిచిపెట్టుకుపోతుందని ఆందోళన చెందుతున్నారు.
నాలుగు శ్లాబులుగా ఉన్న జీఎస్‌టీ రేట్లను రెండింటికి తగ్గించేట్లుగా కేంద్ర ఆర్థిక శాఖ ప్రతిపాదనలు చేసిన సంగతి తెలిసిందే. దీపావళి కానుకగా దీన్ని అమల్లోకి తేవాలనేది ప్రభుత్వ ఉద్దేశం. అయితే, దీన్ని ఆ తర్వాతెప్పుడో అమలు చేస్తామంటూ, పండుగ సీజన్‌లో ముందుగా ప్రకటించడమే ప్రస్తుతం తంటా తెచి్చపెట్టింది. ప్రతిపాదనల ప్రకారం ప్రస్తుతం 5, 12, 18, 28గా ఉన్న శ్లాబుల స్థానంలో ఇకపై 5, 18 శ్లాబులు మాత్రమే ఉంటాయి.
నిర్దిష్ట ఉత్పత్తులకు మాత్రం 40% ఉంటుంది. వాహనాల విషయం తీసుకుంటే.. ప్రస్తుతం వాటిపై జీఎస్టీ 28 శాతంగా ఉండగా, రకాన్ని బట్టి 1 నుంచి 22 శాతం వరకు కాంపన్సేషన్ సెస్సు కూడా ఉంటోంది. ఫలితంగా చిన్న పెట్రోల్ కార్లపై 29 శాతం నుంచి మొదలుకుని ఎస్యూవీలకు 50 శాతం వరకు జీఎస్టీ వర్తిస్తోంది. కొత్తగా అమల్లోకి వచ్చే జీఎస్‌టీ విధానంతో వాహనాలపై జీఎస్‌టీ 28% నుంచి 18 శాతానికి తగ్గనుంది.
దీనిపై తుది నిర్ణయం తీసుకునేందుకు జీఎస్‌టీ కౌన్సిల్ సెప్టెంబర్ 3–4న సమావేశం కానుంది. ఎకాయెకిన 10% మేర పన్ను భారం తగ్గితే గణనీయంగా మిగులుతుంది కాబట్టి వాహన కొనుగోలుదారులు.. కొత్త జీఎస్‌టీ వచ్చాకే కొనుక్కుందాములే అని వాయిదా వేసుకుంటున్నారు. ఇది ఇప్పుడు డీలర్లకు సంకటంగా మారింది. సరిగ్గా పండుగ సీజన్‌లో ఇలా చేయడం వల్ల అమ్మకాలు తగ్గిపోతాయని భయపడుతున్నారు. పండుగ సీజన్‌పై ఆశలు పెట్టుకుని ఉత్పత్తిని భారీగా పెంచుకోగా, అమ్మకాలు నెమ్మదిస్తే, నిల్వలు పేరుకుపోతాయని కంపెనీలు కూడా ఆందోళన చెందుతున్నాయి.
కొత్త రేట్లను వెంటనే అమలు చేయాలి: ఎఫ్‌ఏడీఏ
కొత్త జీఎస్టీ రేట్లను సత్వరం అమల్లోకి తేవాలంటూ కేంద్రానికి ఆటోమొబైల్ డీలర్ల సమాఖ్య ఎఫ్‌ఏడీఏ విజ్ఞప్తి చేసింది. జీఎస్టీపై ప్రకటన వల్ల క్షేత్ర స్థాయిలో సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కి ఎఫ్‌ఏఐడీఏ లేఖ రాసింది. దీని ప్రకారం ఓనం (ఆగస్టు 26), వినాయక చవితి (ఆగస్టు 27), అక్టోబర్లో దసరా, దీపావళి పండుగల సందర్భంగా దేశవ్యాప్తంగా డీలర్లు గణనీయంగా వాహనాల నిల్వలను పెంచుకున్నారు. అయితే, జీఎస్టీ క్రమబదీ్ధకరణ ప్రకటనతో కస్టమర్లు కొనుగోళ్లను వాయిదా వేస్తుండటంతో పాటు, కొత్త రేట్ల వివరాల గురించి డీలర్లను అడుగుతున్నారు.
దీంతో పండుగ అమ్మకాలు మొత్తం తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఏర్పడింది. కొత్త రేట్లను ప్రకటించిన తర్వాత దీపావళి సందర్భంలో మాత్రమే అమ్మకాలు పుంజుకునే అవకాశం నెలకొంది. ‘కాబట్టి జీఎస్టీ మండలి ప్రధాన పండుగల కన్నా కాస్త ముందుగానే సమావేశమై, కొత్త రేట్లను ప్రకటించాలని అభ్యర్థిస్తున్నాం. దీనివల్ల దీపావళికే పరిమితం కాకుండా సీజన్ ఆసాంతం డిమాండ్ ఏర్పడుతుంది. ఇటు పరిశ్రమకు అటు కొనుగోలుదారులకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది‘ అని లేఖలో ఎఫ్‌ఏడీఏ తెలిపింది.
ఫైనాన్సింగ్ వ్యవధిని పెంచాలి..
మరోవైపు, నిల్వలను సమకూర్చుకునేందుకు తీసుకున్న స్వల్పకాలిక ఫైనాన్సింగ్ తిరిగి చెల్లింపు వ్యవధిని అదనంగా 30–45 రోజుల వరకు పొడిగించేలా బ్యాంకులు, నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలను (ఎన్బీఎఫ్సీ) ఆదేశించాలని ఎఫ్‌ఏడీఏ కోరింది. సాధారణంగా 45–60 రోజుల వరకు ఈ వ్యవధి ఉంటుంది. కానీ కొత్త జీఎస్టీ రేట్ల కోసం ఎదురుచూపులతో అమ్మకాలు మందగిస్తే, డీలర్లకు ఆర్థికంగా పెనుభారం పడుతుంది కాబట్టి ఈ మేరకు వెసులుబాటు కల్పించాలని ఎఫ్‌ఏడీఏ వివరించింది. ఎఫ్‌ఏడీఏలో దేశవ్యాప్తంగా దాదాపు 15,000 డీలర్ ప్రిన్సిపల్స్, సుమారు 30,000 డీలర్లకు సభ్యత్వం ఉంది.