
రోడ్ ట్యాక్స్ చెల్లించకుండా బెంగళూరు వీధుల్లో తిరుగుతున్న ఫెరారీ లగ్జరీ సూపర్ కారును ప్రాంతీయ రవాణా కార్యాలయ అధికారులు పట్టుకున్నారు. ట్యాక్స్ కడతావా.. సీజ్ చేయమంటావా అని అధికారులు పట్టుబట్టడంతో కారు యజమాని రూ.1.42 కోట్లు చెల్లించాల్సి వచ్చింది.
రూ.7.5 కోట్ల విలువైన బ్రైట్ రెడ్ ఫెరారీ ఎస్ఎఫ్ 90 స్ట్రాడేల్ కారు కొన్ని నెలలుగా బెంగళూరు వీధుల్లో షికారు చేస్తోంది. ఈ లగ్జరీ కారు మహారాష్ట్రలో రిజిస్టర్ అయిందని, అలాంటి వాహనాలపై అక్కడ లైఫ్‌టైమ్ ట్యాక్స్ రూ.20 లక్షలు ఉంటుందని టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం తెలిపింది. ‘మహారాష్ట్రలో ఇలాంటి కార్లపై పన్ను రూ.20 లక్షలు కాగా, కర్ణాటకలో ఇది దాదాపు రూ.1.5 కోట్లు. ఈ వాహనం రెండేళ్ల క్రితం మహారాష్ట్రలో రిజిస్టర్ అయింది’ అని రవాణా అధికారిని ఉటంకిస్తూ పేర్కొంది.
జయనగర్ ప్రాంతీయ రవాణా కార్యాలయం (ఆర్టీవో) అధికారులు నగరంలో తరచూ కనిపిస్తున్న ఫెరారీ కారుపై నిఘా పెట్టి పట్టుకున్నారు. డాక్యుమెంట్లు ఇంట్లో ఉన్నాయని డ్రైవర్ తొలుత చెప్పాడు. కారు రిజిస్ట్రేషన్‌ను పరిశీలించిన అధికారులు కర్ణాటక పన్ను చెల్లించకుండా 18 నెలలకు పైగా బెంగళూరులో ఈ వాహనం తిరుగుతున్నట్లు గుర్తించారు. ఏం చేయాలని అధికారులు తమ ఉన్నతాధికారులను సంప్రదించగా బకాయిలు చెల్లించకపోతే వాహనాన్ని సీజ్ చేయాలని ఆదేశించారు. దీంతో ఫెరారీ కారు యజమాని అదే రోజు పన్నులు, జరిమానాల రూపంలో రూ.1.4 కోట్లు చెల్లించాడు.
కాగా ఈ ఖరీదైన ఫెరారీ కారు యజమాని ఓ బడా వ్యాపారవేత్త. దేశంలోని 55 నగరాల్లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ వ్యాపారవేత్త తక్కువ పన్ను రేటు కారణంగా మహారాష్ట్రలో తన ఫెరారీ కారును రిజిస్టర్ చేయించుకుని బెంగళూరులో తిప్పుతున్నన్నట్లు అధికారులు తెలిపారు. అయితే, కర్ణాటక నిబంధనల ప్రకారం ఆ రాష్ట్రంలో ఏడాదికి పైగా బయటి రాష్ట్రాల వాహనాలను ఉపయోగించే వారు ఇక్కడ లైఫ్‌టైమ్ రోడ్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది.
పన్ను ఎగవేతకు పాల్పడిన లగ్జరీ కార్ల యజమానులపై బెంగళూరు ఆర్టీవో అధికారులు చర్యలు తీసుకోవడం ఇదే తొలిసారి కాదు. గత మార్చిలో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ లో కర్ణాటక వెలుపల రిజిస్టర్ అయిన హై ఎండ్ వాహనాల నుంచి రూ.40 కోట్ల బకాయిలు వసూలు చేశారు.