
భారత్‌లో తయారయ్యే ఐఫోన్లపై అమెరికా 25 శాతం సుంకం విధించినా ఆ దేశంలో తయారీతో పోలిస్తే మొత్తం ఉత్పత్తి వ్యయం ఇండియాలో చాలా తక్కువగా ఉంటుందని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (జీటీఆర్ఐ) నివేదిక తెలిపింది. యాపిల్ ఉత్పత్తులను ఇండియాలో తయారు చేయాలని నిర్ణయించుకుంటే ఐఫోన్లపై 25 శాతం సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన నేపథ్యంలో ఈ మేరకు జీటీఆర్‌ఐ వివరాలు వెల్లడించింది.
ఇండియాలో ఎందుకంత చౌక..?
అమెరికాతో పోలిస్తే భారత్‌లో ఐఫోన్ తయారీ వ్యయాలు గణనీయంగా తక్కువగా ఉన్నాయని, ప్రధానంగా కార్మికులకు అయ్యే ఖర్చుల వ్యత్యాసాలు భారీగా ఉండడమే ఇందుకు కారణమని నివేదిక పేర్కొంది. భారతదేశంలో ఐఫోన్లను అసెంబ్లింగ్ చేసే కార్మికులకు నెలకు సుమారు 230 అమెరికన్ డాలర్లు(సుమారు రూ.20,000) ఖర్చు అవుతుంది. అయితే కాలిఫోర్నియా వంటి యూఎస్ రాష్ట్రాల్లో కార్మికుల ఖర్చులు నెలకు 2,900 అమెరికన్ డాలర్లు(రూ.2,44,760)కు పెరుగుతాయి. భారత్‌తో పోలిస్తే ఇది 13 రెట్లు అధికంగా ఉండడం గమనార్హం.
ప్రస్తుతం సుమారు 1,000 డాలర్ల(రూ.85,000)గా ఉన్న ఐఫోన్ తయారీలో యాపిల్ తన బ్రాండ్, సాఫ్ట్‌వేర్ ద్వారా అధికంగా 450 డాలర్ల వాటాను సమకూరుస్తుంది. మిగతాది ఇతర దేశాల నుంచి సమీకరిస్తున్న ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్‌కు వెచ్చిస్తుంది.
యూఎస్ కాంపోనెంట్ మేకర్స్ (క్వాల్‌కామ్, బ్రాడ్‌కామ్): 80 డాలర్లు
తైవాన్ (చిప్ తయారీ): 150 డాలర్లు
దక్షిణ కొరియా (ఓఎల్ఈడీ స్క్రీన్లు, మెమొరీ చిప్స్): 90 డాలర్లు
జపాన్ (కెమెరా): 85 డాలర్లు
జర్మనీ, వియత్నాం, మలేషియా (ఇతర భాగాలు): 45 డాలర్లు
చైనా, ఇండియా (అసెంబ్లింగ్): 30 డాలర్లు
ఇదీ చదవండి: యూనియన్ బ్యాంక్‌తోపాటు మరో సంస్థపై ఆర్‌బీఐ జరిమానా
ఐఫోన్ అసెంబ్లింగ్‌లో కీలకంగా వ్యవహరిస్తున్న భారతదేశం, చైనా మొత్తం రిటైల్ ధరలో 3% కంటే తక్కువే సంపాదిస్తుండడం గమనార్హం. భారత్‌లో ఐఫోన్లు తయారు చేస్తే అమెరికా 25 శాతం టారిఫ్ విధించినప్పటికీ దేశంలో ఐఫోన్ల తయారీ ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుందని నివేదిక తెలుపుతుంది. ప్రభుత్వం నుంచి యాపిల్ భారత్‌లో ఐఫోన్ తయారీపై ప్రొడక్షన్-లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్‌ఐ) ప్రయోజనాన్ని సైతం పొందుతుంది.