
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO).. తొమ్మిది కోట్లకు పైగా లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చడానికి 'ఈపీఎఫ్ఓ 3.0' ప్రారంభించనుంది. ఈ కొత్త వెర్షన్ 2025 మే లేదా జూన్ నాటికి ప్రారంభమవుతుందని కేంద్ర కార్మిక & ఉపాధి మంత్రి 'మన్సుఖ్ మాండవియా' ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
ఈపీఎఫ్ఓ 3.0 ద్వారా చందాదారులు వేగంగా నిధులను ఉపసంహరించుకోవచ్చు. ఆటో క్లెయిమ్ సెటిల్‌మెంట్స్, డిజిటల్ కరెక్షన్స్, ఏటీఎం ద్వారా విత్‌డ్రా వంటివి కూడా అందుబాటులోకి రానున్నాయని మన్సుఖ్ మాండవియా వెల్లడించారు. ఈపీఎఫ్ఓ 3.0 తీసుకురావడానికి ప్రధాన కారణం.. చందాదారులకు మరింత మెరుగైన సేవలు అందించడమే అని ఆయన అన్నారు.
ఈపీఎఫ్ఓ 3.0 వెర్షన్ అమలులోకి వచ్చిన తరువాత.. ఫామ్ ఫిల్లింగ్ ప్రక్రియలు, క్లెయిమ్‌ల కోసం లేదా కరెక్షన్స్ కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. ఓటీపీ ద్వారానే ఏపీఎఫ్ఓ ఖాతాలను అప్డేట్ చేసుకోవచ్చు. క్లెయిమ్‌లను వేగంగా పరిష్కరించడం వల్ల, నిధులు చందాదారుల బ్యాంకు ఖాతాలో త్వరగా జమ అవుతాయని మన్సుఖ్ అన్నారు.
ఏఈఎఫ్ఓ మొత్తం 27 లక్షల కోట్ల విలువైన నగదు నిల్వలను కలిగి ఉంది. దీనికి ప్రభుత్వ హామీతో పాటు 8.25 శాతం వడ్డీ ఇస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఇప్పటికే అమలులో ఉన్న సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్ సిస్టమ్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ఏ బ్యాంకు ఖాతాలోనైనా పెన్షన్లు పొందేందుకు వీలు కల్పిస్తూ 78 లక్షలకు పైగా పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుస్తున్నామని ఆయన అన్నారు.
పెన్షన్ కవరేజీని క్రమబద్ధీకరించడానికి, బలోపేతం చేయడానికి అటల్ పెన్షన్ యోజన, ప్రధాన్ మంత్రి జీవన్ బీమా యోజన, శ్రామిక్ జన్ ధన్ యోజనతో సహా వివిధ సామాజిక భద్రతా పథకాలను ఏకీకృతం చేయడాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోందని మంత్రి మన్సుఖ్ మాండవియా చెప్పారు.
ఇదీ చదవండి: కోపైలట్ సలహాలు: తల్లిదండ్రులకు ఎన్నో ఉపయోగాలు!
కార్మికులకు ఆరోగ్య సంరక్షణను పెంచే ప్రయత్నంలో భాగంగా.. ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) కింద ఉన్న లబ్ధిదారులు త్వరలో ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఉన్న ఆసుపత్రులలో ఉచిత వైద్య చికిత్స పొందగలరని ఆయన చెప్పారు. అంతే కాకుండా.. సామాజిక భద్రతా కవరేజీని విస్తరించడానికి ఎంపిక చేసిన ఛారిటీలు నడిపే ప్రైవేట్ ఆసుపత్రులను కూడా దీని పరిధిలోకి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు.