
టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ (Elon Musk).. దాదాపు అర ట్రిలియన్ డాలర్ల నికర విలువను సాధించిన మొదటి వ్యక్తిగా నిలిచారు. ఫోర్బ్స్ రియల్-టైమ్ బిలియనీర్స్ ట్రాకర్ ప్రకారం.. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన వ్యక్తి.. ఇప్పుడు 500.1 బిలియన్ డాలర్ల సంపద కలిగి ఉన్నారు. ఈయన నికర విలువ ఒరాకిల్ కో ఫౌండర్ లారీ ఎల్లిసన్ కంటే 150 బిలియన్ డాలర్లు ఎక్కువ.
దక్షిణాఫ్రికాలో జన్మించిన బిలియనీర్ ఎలాన్ మస్క్.. సంపద అతని ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లా (Tesla)తో ముడిపడి ఉంది. సెప్టెంబర్ 15 నాటికి అతను 12.4 శాతానికి పైగా వాటాను కలిగి ఉన్నారు. బుధవారం మధ్యాహ్నం 3:30 గంటల నాటికి టెస్లా షేర్లు దాదాపు 4 శాతం పెరిగాయి. దీంతో మస్క్ సంపదకు 9.3 బిలియన్ డాలర్లు యాడ్ అయ్యాయి. ఇలా కంపెనీ స్టాక్ వాల్యూ ఎప్పటికప్పుడూ పెరుగుతూ ఉండటం వల్ల.. మస్క్ సంపద కూడా పెరుగుతూనే ఉంది.
డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత.. మస్క్ టెస్లా షేర్స్ భారీగా పెరిగాయి. కాగా కంపెనీ ఇప్పుడు ఏఐ స్టార్టప్ ఎక్స్ఏఐ, స్పేస్‌ఎక్స్ కంపెనీలను కూడా విస్తరించడానికి సన్నద్ధమవుతోంది. ఇది కూడా మస్క్ సంపదను మరింత పెంచే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: ఆ పాస్‌పోర్ట్‌తో అమెరికాలో సమస్యలు!: కెనడా హెచ్చరిక
పిచ్‌బుక్ డేటా ప్రకారం, ఎక్స్ఏఐ జూలై నాటికి 75 బిలియన్ డాలర్ల విలువను కలిగి ఉంది. అదే సమయంలో స్పేస్‌ఎక్స్ విలువ 400 బిలియన్ డాలర్లు (బ్లూమ్‌బెర్గ్ ప్రకారం). మస్క్ సంపద ఇదే వృద్ధి రేటుతో కొనసాగితే.. 2023 మార్చి నాటికి ఆయన ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్ కాగలరని ఫోర్బ్స్ నివేదిక వెల్లడించింది.