కరోనా కాలంలో ఆర్థికంగా ఆరోగ్యంగా ఉండాలంటే..

During this coronavirus pandemic How to stay financially sound  - Sakshi

కరోనా మహమ్మారి సంక్షోభం

ఆర్థికవృద్ధి ఆరోగ్యానికి అయిదు టీకాలు 

కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే బయట పడుతున్నాము. ఏడాది పాటు ఎంతో జాగ్రత్తలు తీసుకున్నాము. ఇప్పుడు రెండు టీకాలు తీసుకుంటే ‘‘కరోనా’’ నుంచి మనకు పూర్తి రక్షణ ఏర్పడినట్టే. ఇది ఆరోగ్యానికి సంబంధించింది. కానీ, ఇదే జాగ్రత్త వ్యక్తిగత ఆర్థిక అంశాల్లోనూ తీసుకోవాలి. ఇక్కడ పేర్కొన్న అయిదు సూత్రాలను సకాలంలో పాటించడం ద్వారా (వీటిని టీకాలు అనుకొండి) మీ వ్యక్తిగత ఆర్థిక స్థితిని పటిష్టం చేసుకోవచ్చు. ప్రణాళిక ప్రకారం సాగితే పొదుపు... మదుపు... ఎటువంటి కుదుపులు లేకుండా సజావుగా వెళ్లిపోతుంది.

►త్వరలో ముగుస్తున్న ఆర్థిక సంవత్సరంలోని వ్యవహారాలను సమీక్షించండి. జీతం తగ్గిపోయి ఉండొచ్చు. రావల్సిన అద్దె రాకపోయి ఉండొచ్చు. లాభాలు అంచనాలను అందుకోలేపోయి ఉండొచ్చు. కరోనాతో ఆదాయానికి గండి పడింది. ఖర్చులు మాత్రం ఏమీ తగ్గలేదు. దీంతో దాచుకున్న నిల్వలు తరిగిపోయి ఉండొచ్చు. కరోనా మహమ్మారి ఖర్చులు తగ్గించుకోవాలన్న సంకేతాన్ని ఇచ్చింది. అనవస రపు ఖర్చులను ఎంత తగ్గించామో  సమీక్షించుకోండి.   (జియోకు షాకిస్తున్న ఎయిర్‌టెల్)

► రాబోయే ఆర్థిక సంవత్సరానికి తగిన ప్రణాళికలు వేయండి. వ్యాపారస్తులు కరోనా చేదు అనుభవాల నుంచి తేరుకొని ఏం చేయాలో ఆలోచించండి. వేతన జీవులు కూడా ఆర్థిక ప్రణాళికలు వేసుకోవాలి. ఆదాయపు పన్ను భారం తగ్గలేదు. పెరగలేదు. పిల్లల చదువులు, పెళ్లిళ్లు, స్థిరాస్థి క్రయ విక్రయాలు గురించి ఆలోచించండి. పెద్ద పెద్ద కమిట్స్‌మెంట్‌ ఏవీ పెట్టుకోకండి. 

► ఆర్థిక ఆలోచనలను మీరు ఒక్కరికే పరిమితం చేయకుండా కుటుంబ సభ్యులతో పంచుకోండి. కరోనా తెచ్చిన కొత్త అవకాశాలను ఎలా అందిపుచ్చుకోవాలో వ్యాపారస్తులు ఆలోచించండి. తక్కువ పెట్టుబడితో వ్యాపారాన్ని ప్రారంభిస్తే మంచింది. హంగులు, ఆర్భాటాల జోలికెళ్లకండి. అద్దె ఇళ్లలో ఉంటూ వ్యాపారం చేసే బదులు సొంత ఇళ్లలో వ్యాపారం చేయడం ఉత్తమం.

► జరిగేవన్నీ మంచికే అనే వేదాంత ధోరణి కాకుండా ముందు జాగ్రత్తగా.. ఆదాయపు వనరులు, ఖర్చుల గురించి వార్షిక ప్రణాళికలు వేసుకోండి. ప్రణాళికలు పక్కాగా ఉంటే పొర పాట్లు జరగవు. అనుకోని ఆర్థిక విపత్తులు ఎదురైనా ముందస్తు ఆలోచనల ద్వారా బయటపడొచ్చు.  

► సంపాదించిన ఆదాయాన్ని సరిగ్గా వినియోగించుకోండి. నగదు వ్యవహారాలకు స్వస్తి పలకండి. స్థిరాస్తి క్రయ విక్రయాల్లో లావాదేవీల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. స్థిరాస్తి లావాదేవీల సమగ్ర సమాచారం అధికారుల వద్ద ఉంది. లెక్కలు సక్రమంగా చూపించండి. పొదుపు చేయండి. చేతనైతే విరాళాలు ఇవ్వండి. పన్ను భారం అడ్వాన్సు టాక్స్‌ రూల్స్‌ ప్రకారం చెల్లించండి. ఒకేసారి పెద్ద మొత్తం చెల్లించే బదులు వాయిదాల ప్రకారం చెల్లించండి. ఏ ఆందోళనా ఉండదు. ఇలా ప్రణాళిక బద్ధంగా వెళితే మీ ఆరోగ్యంతో పాటు మీ ఆర్థిక పరిస్థితి కూడా ఆరోగ్యంగా, నిలకడగానూ ఉంటుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top