భారత సాంకేతిక దశాబ్దం ఇది!

Digital India nation slogan of strength, will make this decade techade - Sakshi

డిజిటల్‌ ఇండియా లబ్ధిదారులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

సాక్షి, న్యూఢిల్లీ: భారత దేశంలో డేటా, శ్రామిక శక్తి లభ్యతలో పెరుగుదల సమ్మేళనానికి.. టెక్నాలజీ రంగంలో ఇప్పటికే నిరూపితమైన శక్తి సామర్థ్యాలు తోడై మరిన్ని అవకాశాలు అందనున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ దశాబ్దం భారత సాంకేతిక దశాబ్దం(టెకేడ్‌)గా మారుతుందని అభివర్ణించారు. డిజిటల్‌ ఇండియా కార్యక్రమం ఆరేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా గురువారం  ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా డిజిటల్‌ ఇండియా లబ్ధిదారులతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. డేటా పవర్‌హౌజ్‌గా భారతదేశానికి తన బాధ్యతలు తెలుసని చెబుతూ డేటా రక్షణకు సంబంధించిన కార్యక్రమం పురోగతిలో ఉందని వివరించారు.

‘డేటా, శ్రామిక శక్తి లభ్యతలో పెరుగుదల భారతదేశానికి భారీ అవకాశాన్ని ఇస్తోంది. ఈ రెండింటి సమ్మేళనంతో ఈ దశాబ్దం ‘భారత టెకేడ్‌’గా మారడంలో విజయవంతమవుతుంది’ అని పేర్కొన్నారు. రాబోయే సంవత్సరాల్లో దేశంలోని డజన్లకొద్దీ టెక్‌ కంపెనీలు యూనికార్న్‌ క్లబ్‌( 1 బిలియన్‌ డాలర్ల విలువతో కూడినవి)లో ప్రవేశిస్తాయని అంచనాలు సూచిస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా డిజిటల్‌ ఇండియా కార్యక్రమాలైన దీక్ష, ఇ-నామ్, ఈ సంజీవని, ప్రధాన మంత్రి స్వనిధి తదితర పథకాల లబ్ధిదారులతో ఆయన మాట్లాడారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో.. విద్య కొనసాగింపులో, ఆరోగ్య సంరక్షణలో, ఇతర పౌర సేవలు అందించడంలో టెక్నాలజీ కీలకపాత్ర పోషించిందని వివరించారు.

ఈ సమయంలో మన దేశం ఆవిష్కరించిన డిజిటల్‌ సేవలకు ప్రపంచవ్యాప్తంగా ఆమోదం లభించిందన్నారు. ‘కరోనా సమయంలో భారతదేశం చూపిన పరిష్కారాలు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందాయి. ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్‌ ట్రేసింగ్‌ యాప్‌లలో ఒకటైన ఆరోగ్య సేతు యాప్‌ కోవిడ్‌ కట్టడిలో కీలకపాత్ర పోషించింది’ అని పేర్కొన్నారు. కోవిన్‌ యాప్‌పై చాలా దేశాలు ఆసక్తి కనబరిచాయని, ఇలాంటి సాధనాలు భారతదేశ సాంకేతిక నైపుణ్యానికి సాక్ష్యాలని పేర్కొన్నారు.

దేశంలో ఆవిష్కరణల పట్ల ఉన్న అభిరుచిని, ఆ ఆవిష్కరణలను వేగంగా కార్యరూపంలో అందించాలని ఉన్న ఉత్సాహాన్ని మోదీ ప్రశంసించారు. డిజిటల్‌ ఇండియా కార్యక్రమం దేశ స్వావలంబన సంకల్పాన్ని చాటిచెబుతోందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా విద్యార్థులకు అందుబాటు ధరల్లో ఎలక్ట్రానిక్‌ టాబ్లెట్లు, డిజిటల్‌ పరికరాలు అందుతున్నాయని, ఇందుకోసం ఆయా కంపెనీలకు ఉత్పత్తి అనుసంధానిత రాయితీలు ఇస్తున్నామని వివరించారు. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని బలరాంపూర్‌కు చెందిన ఐదో తరగతి విద్యార్థిని సుహానీ సాహు ‘దీక్ష యాప్‌’ గురించి తన అనుభవాలను ప్రధాన మంత్రితో పంచుకున్నారు. తాను చదువు కొనసాగించేందుకు ఈ యాప్‌ ఎలా తోడ్పడిందో వివరించారు.  

అవినీతిపై దాడి ఇది
జూలై 1, 2015 న ప్రారంభించిన డిజిటల్‌ ఇండియా కార్యక్రమం కనీస ప్రభుత్వం, గరిష్ట పాలన అనే భావనపై నిర్మితమైందని, ‘అందరికీ అవకాశాలు, అందరికీ సౌకర్యం, అందరి భాగస్వామ్యం’ లక్ష్యంగా రూపొందిందని ప్రధాన మంత్రి వివరించారు. ఇది ప్రభుత్వ వ్యవస్థల్లోకి ప్రజలకు ప్రవేశం కల్పించిందని, సేవల్లో పారదర్శకతకు దారి తీసిందన్నారు. ‘డిజిటల్‌ ఇండియా’ కార్యక్రమం అవినీతిపై నేరుగా దాడి చేసిందని వివరించారు.

అది వైద్యుల ఘనతే..!
కరోనాను భారత్‌ సమర్థ్దంగా ఎదుర్కోవడంపై మోదీ ప్రశంస
కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో వైద్యులు ప్రాణాలను పణంగా పెట్టి సేవలందిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. దేశంలో ఆరోగ్య రంగంలో మౌలిక వసతుల కల్పన కోసం తమ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందన్నారు. ఒక్క ప్రాణాన్ని కోల్పోవడమైనా బాధాకరమే.. అయినా, కోవిడ్‌ నుంచి ప్రాణాలను కాపాడే విషయంలో భారత్‌ అనేక అభివృద్ధి చెందిన దేశాల కన్నా సమర్థ్దవంతంగా పనిచేసిందని ప్రధాని పేర్కొన్నారు.  నేషనల్‌ డాక్టర్స్‌ డే సందర్భంగా గురువారం ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌(ఐఎంఏ) ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు.   కాగా, కరోనా సమయంలో ప్రాణాలొడ్డి సేవలందిస్తున్న వైద్యులను రాష్ట్రపతి  కోవింద్‌ స్వార్థం లేని దేవుళ్లని, వారి సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. వైద్యుల దినోత్సవం సందర్భంగా ఆయన ఈ మేరకు ట్వీట్‌ చేశారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top