
అంతర్జాతీయ అనిశ్చితుల నుంచి తట్టుకుని, బలమైన వృద్ధితో ముందుకెళ్లేందుకు దేశంలో ప్రైవేటు పెట్టుబడులు పెరగాల్సిన అవసరాన్ని ఆర్థిక శాఖ ప్రస్తావించింది. బలమైన, స్థిరమైన ఆర్థిక వ్యవస్థ వల్ల ప్రైవేటు రంగం ప్రయోజనం పొందాలని సూచించింది. తమ పెట్టుబడుల వ్యయాలు–వినియోగ డిమాండ్ మధ్య ఉండే సంబంధాన్ని పరిశ్రమ గుర్తించడం అవసరమని పేర్కొంది. ఈ మేరకు ఫిబ్రవరి నెల ఆర్థిక సమీక్షా నివేదికను కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసింది.
బడ్జెట్‌లో ఆదాయపన్ను పరంగా కల్పించిన ఉపశమనం, ఆర్‌బీఐ వడ్డీ రేట్ల తగ్గింపుతో వినియోగం పుంజుకుంటుందని అంచనా వేసింది. ఈ సంకేతాలను ప్రైవేటు రంగం గుర్తించి సామర్థ్య విస్తరణపై పెట్టుబడులతో ముందుకు రావాలని పిలుపునిచ్చింది. అప్పుడు 2025–26లో బలమైన ఆర్థిక వృద్ధి సాధ్యపడుతుందని అంచనా వేసింది. ‘వ్యక్తిగత ఆదాయపన్ను నిర్మాణంలో చేసిన మార్పులతో మధ్యతరగతి ప్రజల చేతుల్లో ఖర్చు చేసే ఆదాయం మిగులు పెరుగుతుంది. ఇది వినియోగాన్ని పెంచుతుంది. ఫిబ్రవరిలో ఆర్‌బీఐ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించడం, మెరుగైన లిక్విడిటీ పరిస్థితులు వృద్ధిని ఊతమిస్తాయి’ అని ఆర్థిక శాఖ తన అభిప్రాయాలను పేర్కొంది.
దీర్ఘకాల చర్యలు ఫలితమిస్తాయి..
దీర్ఘకాల అభివృద్ధికి సంబంధించి చేపట్టిన చర్యలు, సంస్కరణలు, వికసిత్ భారత్ ఆకాంక్ష.. అంతర్జాతీయ అనిశ్చితుల్లోనూ దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండడం విశ్వాసాన్ని పెంపొందిస్తాయని ఆర్థిక శాఖ నివేదిక పేర్కొంది. ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో ఏడు నెలల కనిష్టానికి తగ్గడాన్ని ప్రస్తావించింది. 2024–25లో రికార్డు స్థాయి పంటల దిగుబడి రానున్న నెలల్లో ద్రవ్యోల్బణం మోస్తరు స్థాయికి దిగొచ్చేందుకు సాయపడుతుందని అంచనా వేసింది. ప్రధాన వస్తు ఎగుమతులు 2024–25లో 8.2 శాతం పెరగడాన్ని గుర్తు చేసింది. అదే ఏడాది విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) 12.4 శాతం వృద్ధి చెందినట్టు పేర్కొంది. ప్రస్తుతమున్న విదేశీ మారకం నిల్వలు 11 నెలల దిగుమతి అవసరాలకు సరిపోతాయని తెలిపింది. అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వాణిజ్య విధానాల్లో మార్పులను (టారిఫ్‌లు) ప్రస్తావిస్తూ.. అలాంటి తరుణంలోనూ 2024–25లో డిసెంబర్ (క్యూ3) త్రైమాసికంలో జీడీపీ వృద్ధి కోలుకోవడాన్ని ఈ నివేదిక గుర్తు చేసింది. ప్రైవేటు వినియోగం పుంజుకోవడం, కీలక వస్తు ఎగుమతులు పెరగడం మేలు చేసినట్టు తెలిపింది. ‘‘బలమైన వ్యవసాయ కార్యకలాపాలు గ్రామీణ డిమాండ్‌కు మద్దతునిస్తాయి. 2024–25 చివరి త్రైమాసికంలోనూ ఆర్థిక కార్యకలాపాలు పుంజుకున్నట్టు ముఖ్యమైన సంకేతాలు సూచిస్తున్నాయి’’అని వివరించింది.
ఇదీ చదవండి: ‘ఆర్థిక సేవలకు నియంత్రణలు అడ్డు కారాదు’
ఎగుమతులు మెరుగుపడడం, ప్రభుత్వ మూలధన వ్యయాలను పెంచడం ఇందుకు మద్దతునిస్తాయని అభిప్రాయపడింది. సేవల రంగం పనితీరు సైతం బలంగా ఉన్నట్టు తెలిపింది. అంతర్జాతీయంగా అనిశి్చతులు ఉన్నప్పటికీ 2024–25లో 6.5 శాతం వృద్ధి నమోదవుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. వృద్ధి రేటు సెప్టెంబర్ త్రైమాసికంలో నమోదైన 5.6 శాతం నుంచి డిసెంబర్ క్వార్టర్‌లో 6.2 శాతానికి పెరగడాన్ని గుర్తు చేసింది. ద్రవ్య స్థిరీకరణ, సంక్షేమం, వృద్ధి పరంగా ఆర్థిక వ్యవస్థలో చక్కని సమతుల్యత కొనసాగుతున్నట్టు ఈ నివేదిక తెలిపింది.