Digital Rupee In India: క్రిప్టో కరెన్సీ అంటే అంత క్రేజ్‌ ఎందుకు?

Crypto Craze In India after digital rupee announcement - Sakshi

డిజిటల్‌ ఇండియా..డిజిటల్‌ ఎకానమీ...డిజిటల్‌ రుపీ. అంతా డిజిటల్‌. డిజిటల్‌ ఎకానమీకి ఊతమిచ్చేందుకు ఆర్‌బీఐ త్వరలోనే దేశీ డిజిటల్‌ కరెన్సీని లాంచ్‌  భారత్‌లో చేయనుంది.  ఇలాంటి  కీలక నిర్ణయం  తీసుకున్న అతిపెద్ద దేశంగా భారత్‌ నిలిచింది.  అసలు  క్రిప్టో కరెన్సీ అంటే ఏమిటి? క్రిప్టో కరెన్సికి ఎందుకంత  క్రేజ్‌? ఇక భవిష్యత్తు  అంతా క్రిప్టోకరెన్సీలదేనా?

క్రిప్టో కరెన్సీ  అంటే  డిజిటల్‌ రూపంలోనే కనిపించే  కరెన్సీ.  అంటే క్రిప్టో కరెన్సీ భౌతికంగా కనిపించదు బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ద్వారా  దీన్ని తయారు చేస్తారు.  ఇప్పుడున్న కరెన్సీలాగే చాలా దేశాల్లో వీటిని లావా దేవీలకు అనుమతి ఇస్తున్నారు. . బిట్‌కాయిన్లను మొట్టమొదటిసారి ఒక కరెన్సీగా వాణిజ్య లావాదేవీల కోసం ఉపయోగించింది 2010 మే 22వ తేదీన. ఫ్లోరిడాకు చెందిన లాస్జ్‌లో హాన్యే అనే ప్రోగ్రామర్.. 10,000 బిట్‌కాయిన్లు చెల్లించి రెండు పిజ్జాలు కొన్నాడు. అప్పుడు ఆ పది వేల బిట్‌కాయిన్ల విలువ సుమారు 47 డాలర్లు మాత్రమే. 2011 ఏప్రిల్‌లో 1 డాలరుగా ఉన్న బిట్‌కాయిన్ విలువ అదే ఏడాది  జూన్ నాటికి 32 డాలర్లకు పెరిగింది. మధ్యలో కొన్ని ఒడిదుడుకులొచ్చినా  2012 ఆగస్టు నాటికి 13.20 డాలర్లకు పెరిగింది. అయితే  బిట్‌ కాయిన్‌కు లభిస్తున్న  ఆదరణ నేపథ్యంలో బిట్‌కాయిన్‌తో పోటీగా డిజిటల్ కరెన్సీల తయారీ మొదలైంది.  క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్‌లు, ట్రేడింగ్‌ ఫ్లాట్‌ఫామ్స్‌, యాప్స్‌ చాలా అందుబాటులోకి వచ్చాయి. ఆ తరువాత 10,000 డాలర్లకు ఎగిసిన బిట్‌కాయిన్‌  2019లో​ 7,000 డాలర్లకు పడిపోయింది. అయితే  ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి సంక్షోభం, డిజిటల్‌ చెల్లింపులకు ప్రాధాన్యత పెరిగిన నేపథ్యంలో 2020లో బిట్‌కాయిన్ మళ్లీ దూసుకుపోయింది. 2021లో 70వేల డాలర్లు దాటేసి ఇన్వెస్టర్లను ఊరించడం మొదలు పెట్టింది. అయితే ఈ సంవత్సరం ప్రారంభం నుండి బిట్‌కాయిన్ 16శాతం పతనమై దాదాపు సగానికి పడిపోయింది.  2022  ఫిబ్రవరి 1 తరువాత  39వేల డాలర్ల దిగువకు చేరింది.  ఇంత ఒడిదుకుల మధ్య  ఉన్నా .. ఆదరణ మాత్రం  పెరుగుతూనే ఉంది.  (Happy Birthday Shekhar Kammula: శేఖర్‌ కమ్ముల గెలుచుకున్నది ఎన్ని ‘నంది’ అవార్డులో తెలుసా?)


  
తాజాగా  కేంద్రం కూడా డిజిటల్‌ కరెన్సీని లాంచ్‌ చేయనుంది.  ఏప్రిల్‌లో ప్రారంభమయ్యే 2022-23  ఆర్థిక సంవత్సరం నుంచి బ్లాక్‌చెయిన్, ఇతర టెక్నాలజీల ఆధారిత డిజిటల్‌ రూపీని ఆర్‌బీఐ ప్రవేశపెడుతుందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగంలో వెల్లడించారు. దీన్ని సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీ (సీబీడీసీ)గా వ్యవహరిస్తారు. రిజర్వ్‌ బ్యాంక్‌ దీన్ని జారీ చేస్తుంది. వర్చువల్ డిజిటల్ అసెట్స్ బదిలీ ఏ రూపంలో జరిగినా దానిపై 30 శాతం పన్ను విధిస్తామని కేంద్ర ఆర్థికమంత్రి తెలిపారు. అంటే భారత్‌లో ఇకపై క్రిప్టో కరెన్సీ కొనుగోళ్లు, అమ్మకాలు, బహుమతి రూపంలో బదిలీ.. ఇలా లావాదేవీ ఏ రూపంలో ఉన్నా 30 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అలాగే దేశంలో క్రిప్టో ట్రేడింగ్‌కు  అనుమతి ఉంటుందనేసంకేతాలందించారు. 

భౌతికంగా పేపర్‌ రూపంలో జారీ చేసే కరెన్సీ తరహాలోనే దీనికి కూడా ప్రభుత్వం నుంచి గుర్తింపు ఉంటుంది. దీన్ని అధికారిక పేపర్‌ కరెన్సీ రూపంలోకి మార్చుకోవచ్చు. బ్లాక్‌చెయిన్‌ టెక్నాలజీతో రూపొందించడం వల్ల లావాదేవీల విషయంలో పారదర్శకత ఉంటుంది. రిజర్వ్‌ బ్యాంక్‌ బ్యాలెన్స్‌ షీటులో కూడా దీనికి చోటు కల్పిస్తారు కాబట్టి చట్టబద్ధత ఉంటుంది.  అనుకున్నట్టుగా  ఇండియా  డిజిటల్‌  రుపీని లాంచ్‌చేస్తే అది ప్రపంచ రికార్డు  కానుంది. స్వీడన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌  ఈ తరహా 'ఈ-క్రోనా' వినియోగాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలిస్తుండగా, 2014 నుంచి చైనా పీపుల్స్‌ బ్యాంకు కూడా డిజిటల్‌కరెన్సీ వినియోగంపై కసరత్తు చేస్తోంది. గత రెండేళ్లుగా ప్రధాన నగరాల్లో డిజిటల్ యువాన్‌ను ట్రయల్ చేస్తోంది.  ముఖ్యంగా బీజింగ్ వింటర్ ఒలింపిక్స్‌కు హాజరయ్యే అథ్లెట్లు, అధికారులు, జర్నలిస్టులకు అందుబాటులో ఉన్న మూడు చెల్లింపు పద్ధతుల్లో ఇదొకటి.

అయితే సాధారణ లావాదేవీల వ్యయాలతో పోలిస్తే ఈ తరహా కరెన్సీలతో జరిపే లావాదేవీల వ్యయాలు తక్కువగా ఉండటంతో వీటి వైపు మొగ్గు చూపే వారి సంఖ్య పెరుగుతోంది. కొందరు దీన్ని ఇన్వెస్ట్‌మెంట్‌ సాధనంగా మదుపు చేస్తున్నారు. అయితే, ఈ తరహా అనధికారిక కరెన్సీల విలువ తీవ్ర హెచ్చుతగ్గులకు గురవుతుండటంతో నష్టపోతున్న వారి సంఖ్య కూడా గణనీయంగా ఉంటోంది. పైగా వీటికి చట్టబద్ధత లేకపోవడం మరో ప్రతికూలాంశం. దేశ భద్రత, ఆర్థిక స్థిరత్వంపైనా ప్రభావం చూపుతాయన్న కారణంతో ప్రైవేట్‌ క్రిప్టోకరెన్సీలను సెంట్రల్‌ బ్యాంకులు వ్యతిరేకిస్తున్నాయి. మార్కెట్‌ను ఎలా నియంత్రించాలనుకుంటోంది లాంటి విషయాలపై భారత ప్రభుత్వం ఎలాంటి రోడ్‌ మ్యాప్‌ తయారుచేస్తుందో చూడాలి.

బిట్‌కాయిన్ వంటి క్రిప్టోకరెన్సీల్లో పెట్టుబడులు పెడుతున్న భారతీయుల సంఖ్య దాదాపు రెండు కోట్లు ఉంటుందని అంచనా. మరోవైపు 2030 నాటికి ప్రపంచ కరెన్సీ చలామణిలో నాలుగో వంతు క్రిప్టోకరెన్సీలు ఉంటాయని ఆర్థిక నిపుణుల అంచనా. క్రిప్టోకరెన్సీ  యూజర్ల వివరాల గోప్యత,  నియంత్రణ,భద్రత లాంటి అంశాలపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సంప్రదాయ కరెన్సీలతో పోలిస్తే క్రిప్టో కరెన్సీలే  బెటర్‌అని టెక్‌ దిగ్గజాలు బిల్ గేట్స్, అల్ గోర్, రిచర్డ్ బ్రాన్సన్  తదితరులు ఇప్పటికే చెప్పారు.  మనీలాండరింగ్‌, టెర్రరిస్టు కార్యకలాపాలు, డార్క్‌నెట్‌ నేరాలు పెరిగిపోతాయని,  ప్రభుత్వ నియంత్రణ లేకపోతే ముప్పేనని వారెన్ బఫెట్, పాల్ క్రుగ్‌మన్, రిచర్డ్ షిల్లర్ వంటి ఆర్థికవేత్తలు హెచ్చరించిన సంగతి తెలిసిందే. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top