
దేశీయ రెండో అతిపెద్ద ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ క్యాంపస్ నియామకాలకు సన్నద్ధమవుతోంది. దాదాపు రెండేళ్ల తర్వాత కాలేజీ క్యాంపస్‌లకు వచ్చి విద్యార్థులను ఉద్యోగాల్లో నియమించుకోబోతోంది. ఈ మేరకు రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన ప్యానెల్ ఇంటర్వ్యూలలో పాల్గొనాలని తమ సీనియర్ సిబ్బందిని ఇన్ఫోసిస్ కోరింది.
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, విప్రోతో సహా ప్రధాన ఐటీ కంపెనీలు కోవిడ్ కారణంగా క్యాంపస్, లేటరల్ రిక్రూట్మెంట్లను తగ్గించాయి. ఇన్ఫోసిస్ అయితే ఫ్రెషర్ రిక్రూట్‌మెంట్‌లను బాగా తగ్గించేసింది. 2024 ఆర్థిక సంవత్సరంలో 11,900 మందిని మాత్రమే నియమించుకుంది. అంతకుముందు సంవత్సరంలో నియామకాల సంఖ్య 50,000తో పోల్చితే ఇది చాలా తక్కువ. ఈ సంఖ్య 2025 ఆర్థిక సంవత్సరంలో 15,000 కు పెరిగింది.
బెంగళూరుకు చెందిన ఐటీ సంస్థ మార్చి 2026 తో ముగిసే ఆర్థిక సంవత్సరానికి కంబైన్డ్ ఆఫ్, ఆన్-క్యాంపస్ కార్యక్రమాల ద్వారా 15,000-20,000 కొత్త నియామకాల లక్ష్యాన్ని పెట్టుకుంది. డిజిటల్ స్పెషలిస్ట్ ఇంజనీర్ల (డీఎస్ఈ) పేరుతో ఫ్రెషర్లను ఇన్ఫోసిస్ ఎంపిక చేయబోతోంది.
క్యాంపస్ ఇంటర్వ్యూల గురించి ఇన్ఫోసిస్ తొలిసారిగా మేనేజర్ స్థాయి అంతకంటే ఎక్కువ హోదా ఉన్న ఉద్యోగులకు మాస్ ఈ మెయిల్ కమ్యూనికేషన్ పంపింది. దీని ప్రకారం.. ఇన్ఫోసిస్ ప్రతినిధులు అభ్యర్థుల ప్రాథమిక ప్రోగ్రామింగ్ సామర్థ్యాలను, ఎంట్రీ లెవల్ డీఎస్ఈ స్థానాలకు అవసరమైన సమస్య పరిష్కార సామర్థ్యాలను అంచనా వేస్తారు.
ఇన్ఫోసిస్ క్యాంపస్ నియామాలు వచ్చే అక్టోబర్, నవంబర్ చివరి మధ్య షెడ్యూల్ చేసినట్లు తెలుస్తోంది. గతంలో కోవిడ్ మహమ్మారి సమయంలో కంపెనీ వర్చువల్ ఇంటర్వ్యూలను నిర్వహించింది.