
ఇంటిని చూసి ఇల్లాలిని చూడాలంటారు పెద్దలు. కానీ, ఇల్లే ఇల్లాలి పేరు మీద ఉండాలంటారు నిపుణులు! రెండూ నిజమే. మొదటి దాని గురించి చర్చ అవసరం లేకపోయినా.. రెండో దాని గురించి మాత్రం అవసరమే. ఎందుకంటే ఇంటి ఓనర్ లేదా కో–ఓనర్ మహిళ అయితే ఎన్నో ప్రయోజనాలున్నాయి గనక! గృహ రుణం నుంచి మొదలు పెడితే వడ్డీ రాయితీ, ఆదాయ పన్ను మినహాయింపు, స్టాంప్ డ్యూటీ తగ్గింపు.. ఇలా ఎనెన్నో ప్రయోజనాలున్నాయి. అందుకే తెలివైన గృహ కొనుగోలుదారుడు ఇంటిని భార్య, తల్లి లేకపోతే అక్క, చెల్లి మొత్తమ్మీద మహిళ పేరు మీద కొనుగోలు చేస్తారని నిపుణులు చెబుతున్నారు.
– సాక్షి, సిటీబ్యూరో
స్టాంప్ డ్యూటీలో తగ్గింపు..
పలు రాష్ట్రాలు ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ల సమయంలో మహిళలకు స్టాంప్ డ్యూటీ రాయితీని అందిస్తున్నాయి. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మహిళలకు 1 శాతం రాయితీ ఉండేది. ప్రస్తుతం లేదు. ఢిల్లీలో ప్రాపర్టీ కొనుగోలుదారులకు మగవారికైతే ప్రాపర్టీ విలువలో 6 శాతం స్టాంప్ డ్యూటీ వసూలు చేస్తుండగా.. మహిళ ఓనరైతే 4 శాతం చెల్లించాల్సి ఉంటుంది. జమ్మూ అండ్ కశ్మీర్‌లో అయితే మహిళ ప్రాపర్టీ కొనుగోలుదారులకు స్టాంప్ డ్యూటీనే లేదు. ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లోనూ మహిళా ఓనర్లకు స్టాంప్ డ్యూటీ మినహాయింపులు ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో అయితే పట్టణ, గ్రామీణ ప్రాంతాల వర్గీకరణ ఆధారంగా కూడా స్టాంప్ డ్యూటీలో మినహాయింపు ఉంది.
ఐటీప్రయోజనాలు..
గృహ యజమాని లేదా సహ–యజమాని మహిళ అయితే ఆదాయ పన్ను మినహాయింపులు కూడా ఉన్నాయి. భార్యభర్తలు ఇద్దరూ ఉద్యోగులైతే ఇద్దరు వేర్వేరుగా అసలు, వడ్డీలపై ఐటీ తగ్గింపులను క్లయిమ్ చేసుకునే వీలుంది. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ ప్రకారం సహ దరఖాస్తుదారు ప్రిన్సిపల్ అమౌంట్‌పై ఏడాదికి రూ.1.5 లక్షల వరకు, చెల్లించిన వడ్డీపై రూ.2 లక్షల వరకు ప్రయోజనాన్ని పొందవచ్చు. అలాగే సెక్షన్ 80ఈఈ కింద ఇతర క్లెయిమ్‌లతో పాటు తొలిసారి గృహ యజమానురాలు మహిళ అయితే ప్రిన్సిపల్ అమౌంట్ మీద రూ.50 వేలు తగ్గింపు కూడా అందుతుంది.
అద్దె ఆదాయంపై కూడా..
మహిళలు ఆస్తిని విక్రయించేటప్పుడు క్యాపిటల్ గెయిన్ మినహాయింపులను కూడా పొందవచ్చు. అంతేకాకుండా ప్రాపర్టీని మహిళలు అద్దెకు ఇస్తే.. ఆమె రెండు రకాల తగ్గింపులకు క్లయిమ్ చేసుకోవచ్చు. అద్దెకు ఇచ్చిన ప్రాపర్టీపై ఏదైనా లోన్‌పై చెల్లించే వడ్డీపై పన్ను తగ్గింపుతో పాటు రెంటల్ ఆదాయంపై 30 శాతం స్టాండర్డ్ డిడెక్షన్ లభిస్తుంది. అయితే పన్ను ప్రయోజనాలను క్లెయిమ్ చేయాలంటే మహిళలకు ఆదాయ వనరులు ఉండాల్సిందే.
గృహ రుణ వడ్డీ రేట్ల తగ్గింపు..
బ్యాంక్‌లు, ఆర్థిక సంస్థలు మహిళలను విశ్వసనీయ రుణ గ్రహీతలుగా పరిగణిస్తుంటాయి. అందుకే స్థిరాస్తి రంగంలో మహిళా పెట్టుబడులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక రుణ కార్యక్రమాలను, స్కీమ్‌లను అందుబాటులోకి తీసుకొస్తుంటాయి. తక్కువ వడ్డీ రేట్లకు రుణాలను అందిస్తున్నాయి. ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ వంటి బ్యాంకులలో పురుష రుణ గ్రహీతలతో పోలిస్తే మహిళలకు హోమ్ లోన్ వడ్డీ రేట్లు 0.5 నుంచి 1 శాతం తక్కువగా ఉంటాయి.
ఈ శాతం తక్కువగా కనిపిస్తున్నప్పటికీ దీర్ఘకాలంలో డబ్బు, ఈఐఎంను ఆదా చేస్తుంది. ప్రధాన్‌మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) కింద లో ఇన్‌కం గ్రూప్(ఎల్‌ఐజీ) కేటగిరీ కింద మహిళలకు రూ.6 లక్షల రుణానికి 6.5 శాతం వడ్డీ రాయితీతో.. రూ.2.67 లక్షల వరకు సబ్సిడీని పొందవచ్చు. ఇన్‌కం సోర్స్ లేని మహిళలకు బ్యాంక్‌లు రుణాలను అందించవు.
వారసులకు బదిలీ సులువు..
మహిళ పేరిట ప్రాపర్టీ ఉంటే అది ఆమె ఎస్టేట్‌లో భాగమవుతుంది. ఎటువంటి చట్టపరమైన చిక్కులు లేకుండా ఆమె వారసులకు సులభంగా బదిలీ అవుతుంది. అయితే విడాకుల సమయంలో సేల్‌డీడ్ ఆధారంగా ఆస్తి కేటాయింపులు ఉంటాయి. ఏదైనా చట్టపరమైన వివాదాలు తలెత్తితే ఆస్తి మహిళ పేరు మీద ఉన్నప్పటికీ భర్త ఉమ్మడిగా బాధ్యత వహించాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment