ప్రాణాలు కాపాడుతున్న ఐఫోన్‌లు..అప్పుడు దూసుకొచ్చిన బుల్లెట్‌..ఇప్పుడు

Apple Iphone 14 Emergency Sos Via Satellite Feature Saves Stranded Man In Alaska - Sakshi

 ఐఫోన్‌ ఉక్రెయిన్‌ సైనికుడిని కాపాడిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే ఐఫోన్‌ ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తిని కాపాడింది. ఈ ఏడాది జులైలో ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యా సైన్యం తుపాకులతో దాడి చేసింది. ఈ దాడిలో ఉక్రెయిన్‌ సైనికుడి బ్యాగులో ఉన్న 2019 మోడల్‌ ఐఫోన్‌ 11ప్రోకు బులెట్‌ తగలడంతో సదరు సైనికుడు ప్రాణాలతో బయటపడ్డాడు. తాజాగా యాపిల్‌ ఐఫోన్‌ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఓ వ్యక్తి ప్రాణం నిలబెట్టింది. 

టెక్‌ దిగ్గజం యాపిల్‌ ఇటీవల ఐఓఎస్‌ 16.1 అప్‌డేట్‌ చేసింది. దీంతో ఐఫోన్‌-14 శాటిలైట్‌ ఫీచర్‌ వినియోగించుకునే సౌకర్యం ఏర్పడింది. ఈ ఫీచర్‌ సాయంతో వైఫై, ఇంటర్నెట్‌ సదుపాయం లేకుండా ప్రమాదంలో ఉన్న యూజర్లు తమ ప్రాణాల్ని కాపాడుకోవచ్చు. అలా శాటిలైట్‌ ఫీచర్‌తో మంచుతో కప్పబడిన అలాస్కా పర్వతాల్లో చిక్కుకున్న వ్యక్తి ప్రాణాలు పోకుండా సురక్షితంగా ప్రాణాల్ని కాపాడగలింది. 

అమెరికాలో స్నో మెషిన్‌ సాయంతో నూర్విక్ నుండి కోట్జెబ్యూకు ఓ వ్యక్తి ప్రయాణిస్తున్నాడు. మంచు ఎక్కువగా కురియడంతో ఓ ప్రాంతంలో చిక్కుకున్నాడు. చేతిలో ఫోన్‌ ఉంది. స్నేహితులకు సమాచారం ఇచ్చేందుకు ఫోన్‌ నెట్‌ వర్క్‌ , ఇంటర్నెట్‌,వైఫై ఇలా కనీస సదుపాయాలు లేవు. ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడింది. అప్పుడే అతనికి ఓ  మెరుపులాంటి ఐడియా వచ్చింది. వెంటనే ఐఫోన్‌14 లో శాటిలైట్‌ ఫీచర్‌ను ఆన్‌ చేసి అలాస్కా రక్షణా బలగాలకు సమాచారం అందించాడు.

ప్రాణాలు పోయే పరిస్థితిలో ఉన్నాయని, కాపాడమని కోరాడు. ఓ వ్యక్తి మంచులో చిక్కుకుపోయాడని అధికారులు అప్రమత్తం చేసిన వెంటనే, రెస్క్యూ టీమ్‌లను యాపిల్ షేర్ చేసిన ప్రదేశంలో మోహరించారు. ప్రమాదం అంచున ఉన్న బాధితుణ్ని కాపాడి అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. సకాలంలో ట్రీట్మెంట్‌ అందడంతో ప్రాణాలతో భయటపడినట్లు అధికారులు తెలిపారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top