ఐఫోన్ యూజర్లకు శుభవార్త : ఫ్రీ సెషన్లు

 Apple announces free virtual workshops for Indian users on photography - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం ఆపిల్ ఐఫోన్ యూజర్లకు శుభవార్త అందించింది. ముందుగా ప్రకటించినట్టుగానే సంగీతం, ఫోటోగ్రఫీ, ఆర్ట్ పై ఆసక్తి ఉన్నవారి కోసం ఉచిత వర్చువల్ సెషన్లను షురూ చేసింది. ఇటీవల  భారతదేశంలో  ఆపిల్ స్టోర్ ఆన్‌లైన్ ప్రారంభించిన ఆపిల్ తన ఐఫోన్‌ వినియోగదారులలో అప్ కమింగ్ కళాకారులకు ఈ సెషన్లలో ప్రత్యేక  శిక్షణ ఇవ్వనుంది.  ఈ వర్చువల్ సెషన్‌కు మీ ఐఫోన్ సిద్ధంగా ఉండండి అని ఆపిల్ పేర్కొంది. నవంబర్ 29 వరకు ఉచిత వర్చువల్ సెషన్లను ప్రకటించింది. ప్రముఖ స్థానిక ఫోటోగ్రాఫర్‌లు, ప్రసిద్ధ సంగీతకారులు వారి వారి విజయ గాథలను పంచుకుంటారు. ఈ ఆపిల్ ఈవెంట్‌ల కోసం నమోదు చేసుకున్న వినియోగదారులకు చిట్కాలు , సలహాలు అందిస్తారు. ఈ క్రమంలో ముందుగా ఫోటోగ్రఫీ సెషన్ల వివరాలను ఆపిల్ ప్రకటించింది. (ఆపిల్‌పై శాంసంగ్ సెటైర్లు)

ఫోటోగ్రఫీ సెషన్లు 
ఉచిత వర్చువల్ ఫోటోగ్రఫీ సెషన్లు అక్టోబర్ 22 నుండి ప్రారంభం. వీటిని ఫోటో ల్యాబ్ అంటారు.  ప్రధానంగా సిద్దార్థ జోషి, అవని రాయ్ వంటి ప్రముఖులు అక్టోబర్ 22, అక్టోబర్ 27 తేదీల్లో ఉదయం 7 నుండి 8 గంటల వరకు పాల్గొంటారు.  డీఎస్ఎల్ఆర్,  మిర్రర్‌లెస్ కెమెరాలను ఎలా ఉపయోగించాలో చెబుతారు. ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ చిట్కాలను  అందిస్తారు.  ప్రసిద్ధి చెందిన డాక్యుమెంటరీలను కూడా ప్రదర్శిస్తారు.

అక్టోబర్ 29 న, అనురాగ్ బెనర్జీ నాన్-ఫిక్షన్ ఫోటోగ్రఫీపై ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు, నవంబర్ 3 న, పోర్ట్రైట్ ఫోటోగ్రఫీపై  ప్రార్థనా సింగ్ ఒక సెషన్ తీసుకోనున్నారు. ఆపిల్ అక్టోబర్ 28, నవంబర్ 1, నవంబర్ 2 న ఐఫోన్లలో ఫోటోగ్రఫీపై మూడు సెషన్లను ఉంటాయి. నవంబర్ 5 న హషీమ్ బదాని నిర్వహించే ఫోటోగ్రాఫిక్ సెషన్ ఉంటుంది. ఇందులో తన ప్రాజెక్టుల  ప్లానింగ్,  పరిశోధనలను  వివరిస్తారు.  ఈ సెషన్లకు రిజిస్టర్ చేసు కోవాలంటే ఆపిల్ కంప్యూటర్, ల్యాప్‌టాప్, మొబైల్ లేదా టాబ్లెట్, ఇంటర్నెట్ కనెక్షన్, ఉచిత సిస్కో వెబెక్స్ సమావేశాల యాప్ ఉండాలి. అలాగే  యూజర్లు18 ఏళ్లలోపు వారైతే, తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షకులు ఆమోదం కావాలని ఆపిల్ వెల్లడించింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top