‘బెంజ్‌ టు బడ్జెట్‌ కారుకి పడిపోయిన అంబానీ బ్రదర్‌’

Anil Ambani Journey From Mercedes To Hyundai - Sakshi

కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు. అన్నది పెద్దలు చెప్పిన మాట. కానీ ఈ విషయంలో కొందరే విజేతలవుతుంటారు. పెట్రోల్ బంకులో కేవలం 300 రూపాయల జీతానికి పనిచేసిన ధీరూభాయ్ వేల కోట్లను సంపాదించి దిగ్గజ వ్యాపారవేత్తగా నిలిచారు. దేశంలోనే అతిపెద్దదైన రిలయన్స్ ఇండస్ట్రీని స్థాపించి అంబానీ వారసులకు బంగారు బాట పరిచారు. అయితే ఆయన వారసుల పరిస్థితి కొంచెం విచిత్రంగా ఉంటుంది.  
 
దీరుభాయ్‌ ఆయన పెద్ద కుమారుడు ముకేష్‌ దీరుభాయ్‌ అంబానీ ఆసియాలోనే అత్యంత ధనవంతుడు, చిన్న కుమారుడు అనిల్‌ దీరూభాయ్‌ అంబానీ ఒకప్పుడు ప్రపంచ ధనవంతుల జాబితాలో తొలి పది స్థానాల్లో ఉన్నారు. కానీ కాలం కలిసి రాక  పీకల్లోతు  అప్పుల్లో కూరుకుపోయారు. ముకేష్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మన దేశంలోనే ఎక్కువ మార్కెట్‌ విలువ ఉన్న కంపెనీ కాగా, అనిల్‌ అంబానీ సంస్థలు మాత్రం అప్పులు, కోర్టు కేసులు నడుస్తున్నాయి. వాటి నుంచి బయటపడేందుకు ఉన్న ఆస్తుల్ని అమ్మేస్తున్నారు. సాధారణ జీవితం గడుపుతున్నారు.  

తాజాగా, అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం అనంతరం తిరిగి తన ఇంటికి వచ్చే సమయంలో ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఓ సాదాసీదా హ్యుందాయ్‌ ఎలక్ట్రిక్‌ కార్లో తిరుగుతూ దర్శనమిచ్చారు. దీనిపై నెటిజన్లు అనిల్‌ అంబానీ గతం, వర్తమానాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ‘జర్నీ మెర్సిడెజ్‌ టూ హ్యుందాయ్‌’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. 

ఒకప్పుడు అపరకుబేరుల జాబితాలో ఉన్న అనిల్‌ అంబానీ ఓ వెలుగు వెలిగారు. ‘అంబానీ’ల స్టేటస్‌ ఏ మాత్రం తగ్గకుండా రేంజ్‌ రోవర్‌ మెర్సిడెజ్‌ బెంజ్‌ ఎస్‌-క్లాస్‌, రోల్స్‌ రాయిస్‌ రోల్స్ రాయిస్ ఫాంటమ్, లంబోర్ఘిని గల్లార్డోలో తిరిగే వారు. కానీ అదంతా గతం ఇప్పుడు బ్లాక్‌ కలర్‌ హ్యుందాయ్ ఐయోనిక్ 5లో ప్రయాణిస్తున్నారు.  

ఇక అనిల్‌ అంబానీ ప్రయాణిస్తున్న కారు రూ.44.95 లక్షల ప్రారంభ ధర (ఎక్స్-షోరూమ్) ప్రారంభం కాగా చివరికి రూ. 46.05 లక్షలకు (ఎక్స్-షోరూమ్) లభ్యమవుతుంది. ఈ కారు ప్రత్యేకతల విషయానికి వస్తే మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటారు 215 బీపీహెచ్‌ పవర్‌, 350 ఎన్‌ఎం టారిక్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఎలక్ట్రిక్ వాహనం 72.6కేడబ్ల్యూహెచ్‌ బ్యాటరీ ప్యాక్ 631 కిమీ రేంజ్‌ వరకు ఉంది. హ్యుందాయ్ వెబ్‌సైట్ ప్రకారం ఈ కారు కేవలం 18 నిమిషాల్లో 10 శాతం నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయగలదు. అదనంగా, 100 కి.మీ పరిధిని పొందడానికి కేవలం ఐదు నిమిషాలు మాత్రమే ఛార్జింగ్‌ పెడితే సరిపోతుంది.

whatsapp channel

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top