ఆర్థిక ఫలితాలు, ఎఫ్‌అండ్‌వో ఎఫెక్ట్‌!

Analysts assessment of financial results, F and O effect - Sakshi

27న ఏప్రిల్‌ డెరివేటివ్స్‌ ముగింపు

ఇకపై క్యూ4 ఫలితాల సీజన్‌ స్పీడ్‌

మార్కెట్ల ట్రెండ్‌పై విశ్లేషకుల అంచనా  

న్యూఢిల్లీ: దేశీ స్టాక్‌ మార్కెట్లపై ఈ వారం ప్రధానంగా రెండు అంశాలు ప్రభావం చూపనున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఏప్రిల్‌ నెల డెరివేటివ్‌ సిరీస్‌ గడువు గురువారం(27న) ముగియనుంది. అంటే ఏప్రిల్‌ నెల ఫ్యూచర్‌ అండ్‌ ఆప్షన్స్‌ కాంట్రాక్టుల గడువు తీరనుంది. దీంతో ట్రేడర్లు తమ పొజిషన్లను మే నెలకు రోలోవర్‌ చేసుకునే అవకాశముంది. మరోపక్క ఇప్పటికే ప్రారంభమైన క్యూ4(జనవరి–మార్చి) త్రైమాసిక ఫలితాల సీజన్‌ ఊపందుకోనుంది.

గత ఆర్థిక సంవత్సరం(2022–23) చివరి త్రైమాసిక ఫలితాలతోపాటు.. పూర్తి ఏడాది పనితీరును సైతం దేశీ కార్పొరేట్‌ దిగ్గజాలు వరుస గా వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే ఐటీ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ ఫలితాలు ప్రకటించగా.. డైవర్సిఫైడ్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్, ప్రయివేట్‌ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్, యస్‌ బ్యాంక్‌ వారాంతాన పనితీరును వెల్లడించాయి. దీంతో సోమవారం(24న) రిలయ న్స్‌ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్‌ కౌంటర్లపై ఫలి తాల ప్రభావం కనిపించనున్నట్లు మార్కెట్‌ నిపుణు లు తెలియజేశారు. వెరసి మార్కెట్లు ఆటుపోట్లను చవిచూసే వీలున్నట్లు నిపుణులు భావిస్తున్నారు.  

ఫలితాల జోరు
ఈ వారం మరిన్ని కంపెనీలు గతేడాది చివరి త్రైమాసిక ఫలితాలను ప్రకటించనున్నాయి. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్, పెర్సిస్టెంట్‌ సిస్టమ్స్‌ ఈ నెల 24న, బజాజ్‌ ఆటో, నెస్లే ఇండియా, టాటా కన్జూమర్‌ ప్రొడక్టŠస్‌ 25న, బజాజ్‌ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఇన్సూరెన్స్, ఇండస్‌ టవర్స్, ఎల్‌అండ్‌టీ టెక్నాలజీ సర్వీసెస్, మారుతీ సుజుకీ, ఒరాకిల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సాఫ్ట్‌వేర్, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ 26న ఫలితాలు వెల్లడించనున్నాయి. ఈ బాటలో ఇతర దిగ్గజాలు ఏసీసీ, యాక్సిస్‌ బ్యాంక్, బజాజ్‌ ఫిన్‌సర్వ్, బజాజ్‌ హోల్డింగ్స్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్, హిందుస్తాన్‌ యూనిలీవర్, ఎల్‌టీఐ మైండ్‌ట్రీ, టెక్‌ మహీంద్రా, విప్రో 27న, ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌ హోల్డింగ్స్, ఎంఅండ్‌ఎం ఫైనాన్షియల్‌ సర్వీసెస్, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ 28న క్యూ4తోపాటు.. పూర్తి ఏడాదికి పనితీరును తెలియజేయనున్నాయి.  

ఇతర అంశాలూ కీలకమే
నెలల తరబడి రష్యా– ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం కొ నసాగుతుండటం, అమెరికా, యూరప్‌లలో బ్యాంకింగ్‌ ఆందోళనలు, ఆర్థిక మాంద్యంపై ఆందోళనలు వంటి అంశాల నేపథ్యంలో ప్రపంచ స్టాక్‌ మార్కెట్లలో నెలకొనే ట్రెండ్‌ దేశీయంగానూ ప్రభావం చూపనుంది. దీనికితోడు ఇటీవల డాలరుకు పోటీ గా చైనా యువాన్‌ తదితర కరెన్సీలపై పలు దేశాలు దృష్టి సారిస్తున్నాయి. ఇటీవల డాలరుతో మారకంలో రూపాయి కొంతమేర రికవరీ సాధించినప్పటికీ తీవ్ర ఆటుపోట్లను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. మరోవైపు ముడిచమురు ధరలకు సైతం ప్రాధాన్యత ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.  

విదేశీ అంశాలకూ ప్రాధాన్యం
దేశీయంగా సెంటిమెంటును ప్రభావితం చేయగల విదేశీ అంశాల విషయానికి వస్తే.. మార్చి నెలకు మన్నికైన వస్తువుల ఆర్డర్ల గణాంకాలను ఈ నెల 26న యూఎస్‌ విడుదల చేయనుంది. మార్చి నెలకు చైనా పారిశ్రామికోత్పత్తి గణాంకాలు ఈ నెల 27న వెల్లడికానున్నాయి. బ్యాంక్‌ ఆఫ్‌ జపాన్‌(బీవోజే) వడ్డీ రేట్లపై నిర్ణయాలను 28న ప్రకటించనుంది. ఇప్పటికే అనుసరిస్తున్న సరళతర విధానాలనే బీవోజే మరోసారి అవలంబించే వీలున్నట్లు బ్యాంకింగ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.  

గత వారమిలా..
ఆటుపోట్ల మధ్య దేశీ స్టాక్‌ మార్కెట్లు గత వారం స్వల్ప నష్టాలతో ముగిశాయి. అయితే బీఎస్‌ఈ మిడ్, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు నామమాత్రంగా బలపడ్డాయి. గత వారం సెన్సెక్స్‌ 776 పాయింట్లు క్షీణించి 59,655 వద్ద స్థిరపడగా.. నిఫ్టీ 204 పాయింట్లు తక్కువగా 17,624 వద్ద ముగిసింది. బీఎస్‌ఈ మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.5 శాతం లాభంతో 24,845 వద్ద, స్మాల్‌ క్యాప్‌ 0.3 శాతం పుంజుకుని 28,234 వద్ద నిలిచాయి.

ఎఫ్‌పీఐల పెట్టుబడులు
దేశీ మార్కెట్లను ప్రభావితం చేయగల విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) కొత్త ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి నెల(ఏప్రిల్‌)లో ఇప్పటివరకూ నికరంగా రూ. 8,643 కోట్లు ఇన్వెస్ట్‌ చేశారు. గత నెల(మార్చి)లోనూ ఎఫ్‌పీఐలు నికరంగా రూ. 7,936 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేసిన విషయం విదితమే. ఇందుకు ప్రధానంగా అదానీ గ్రూప్‌ కంపెనీలలో యూఎస్‌ సంస్థ జీక్యూజీ పార్ట్‌నర్స్‌ రూ. 7,936 కోట్లు ఇన్వెస్ట్‌ చేయడం దోహదపడింది. ఈ నెల తొలి రెండు వారాలలో ఎఫ్‌పీఐలు ఫైనాన్షియల్‌ రంగ స్టాక్స్‌లో రూ. 4,410 కోట్లు ఇన్వెస్ట్‌ చేయడం గమనార్హం! అయితే గతేడాది(2022–23) ఎఫ్‌పీఐలు దేశీ స్టాక్‌ మార్కెట్ల నుంచి నికరంగా రూ. 37,631 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందుకు ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల పెంపు, రష్యా– ఉక్రెయిన్‌ యుద్ధ భయాలు, ఆర్థిక అనిశ్చితులు వంటి అంశాలు ప్రభావం చూపాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top