
విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్ భారీ విస్తరణ ప్రణాళికల్లో ఉంది. 2032 నాటికి 226 విమానాలను సమకూర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. వార్షికంగా సర్వీసుల సామర్థ్యాన్ని 25–30 శాతం మేర పెంచుకోవాలని నిర్దేశించుకుంది. కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అంకుర్ గోయల్ ఈ విషయాలు తెలిపారు.
2022 ఆగస్టులో ప్రారంభమైన ఆకాశ ఎయిర్ దేశీయంగా 23, అంతర్జాతీయంగా 5 గమ్యస్థానాలకు ఫ్లైట్లు నడుపుతోంది. కంపెనీ దగ్గర ప్రస్తుతం 30 బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలు ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో అయిదు కొత్త విమానాలు జత కానున్నాయి. త్వరలోనే వ్యయాలను మరింతగా తగ్గించుకుని, లాభాల్లోకి మళ్లగలమని అంకుర్ గోయల్ ధీమా వ్యక్తం చేశారు.
ఈ ఎయిర్‌లైన్ మార్చి 2025తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి ఆదాయంలో 49% పెరుగుదలను నమోదు చేసింది . పరిశ్రమ వ్యాప్తంగా ద్రవ్యోల్బణ ఒత్తిడి ఉన్నప్పటికీ, ఆకాశ ఎయిర్ ఏఎస్‌కే (అవెలబుల్ సీట్ కిలోమీటర్స్)కి యూనిట్ ఖర్చును (ఇంధనం మినహా) 7% తగ్గించగలిగింది. అయితే ఎబిటార్ (Ebitdar) మార్జిన్లు 50% పెరిగాయి. వడ్డీ, పన్నులు , తరుగుదల, రుణ విమోచన, అద్దె ఖర్చులు మినహాయించక ముందు ఆదాయాలను ఎబిటార్ సూచిస్తుంది. విమానయాన పరిశ్రమలో కార్యాచరణ పనితీరుకు కీలకమైన కొలమానంగా దీన్ని చూస్తారు.