ప్రపంచ ఆటో తయారీ హబ్‌గా భారత్‌ | Sakshi
Sakshi News home page

ప్రపంచ ఆటో తయారీ హబ్‌గా భారత్‌

Published Wed, Mar 1 2023 12:50 AM

Aim To Make India A Global Automobile Manufacturing Hub - Sakshi

న్యూఢిల్లీ: భారత్‌ను ప్రపంచ ఆటో తయారీ కేంద్రం(హబ్‌)గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ తాజాగా వెల్లడించారు. సమీప భవిష్యత్‌లో దేశీ ఆటో పరిశ్రమ విలువ రూ. 15 లక్షల కోట్లకు చేరే అంచనాలున్నట్లు తెలియజేశారు. జైపూర్‌లో ఆటో రంగ దిగ్గజం టాటా మోటార్స్‌ ఏర్పాటు చేసిన వాహనాలను తుక్కుగా మార్చే(స్క్రాపింగ్‌) ప్లాంటును వర్చువల్‌గా ప్రారంభించిన గడ్కరీ ప్రస్తుతం ఆటో పరిశ్రమ దేశ జీడీపీలో 7.1 శాతం వాటాను సమకూరుస్తున్నట్లు పేర్కొన్నారు. రూ. 7.8 లక్షల కోట్ల  పరిమాణంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 4 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్నట్లు తెలియజేశారు. 2025కల్లా ఈ సంఖ్య 5 కోట్లను తాకనున్నట్లు అభిప్రాయపడ్డారు. జైపూర్‌లో టాటా మోటార్స్‌ వార్షికంగా 15,000 వాహన స్క్రాపింగ్‌ సామర్థ్యంతో తొలిసారి రిజిస్టర్డ్‌ ప్లాంటును ఏర్పాటు చేసింది.     

రూ. 15 లక్షల కోట్లకు..: గ్లోబల్‌ ఆటో తయారీ కేంద్రంగా భారత్‌ను నిలిపే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తున్నట్లు గడ్కరీ పేర్కొన్నారు. సమీప కాలంలో పరిశ్రమ పరిమాణాన్ని రూ. 15 లక్షల కోట్లకు చేర్చనున్నట్లు చెప్పారు. పాత, పనికిరాని వాహనాలను తొలగించడం ద్వారా స్క్రాపేజ్‌ పాలసీ దశలవారీగా పర్యావరణ అనుకూల కొత్త వాహనాలకు దారి చూపుతుందని వివరించారు. తుక్కుగా మార్చే తాజా విధానాల వల్ల వాహన డిమాండు ఊపందుకుంటుందని, రూ. 40,000 కోట్ల ఆదనపు జీఎస్‌టీ ఆదాయానికి వీలుంటుందని తెలిపారు.

Advertisement
 
Advertisement
 
Advertisement