ఏబీ హెల్త్‌లో ‘అబుధాబి’ పెట్టుబడి

Abu Dhabi Investment Authority To Investment Aditya Birla Health Insurance - Sakshi

ముంబై: ఆదిత్య బిర్లా(ఏబీ) గ్రూప్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలో అబుధాబి ఇన్వెస్ట్‌మెంట్‌ అథారిటీ(ఏఐడీఏ) 10 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. ఇందుకు రూ. 665 కోట్లు వెచ్చించనుంది. ఇందుకు ఏబీ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ బోర్డుతోపాటు లిస్టెడ్‌ మాతృ సంస్థ ఏబీ క్యాపిటల్‌ అనుమతించాయి. తద్వారా ఆరోగ్య బీమా రంగ సంస్థ విలువను రూ. 6,650 కోట్లుగా మదింపు చేసినట్లు ఏబీ క్యాపిటల్‌ పేర్కొంది.

ఏబీ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ను ఆదిత్య బిర్లా గ్రూప్, దక్షిణాఫ్రికా సంస్థ మొమెంటమ్‌ మెట్రోపాలిటన్‌ హోల్డింగ్స్‌ సంయుక్తం (జేవీ)గా ఏర్పాటు చేశాయి. డీల్‌కు దేశీ బీమా నియంత్రణ సంస్థ (ఐఆర్‌డీఏ) అనుమతించవలసి ఉంది. వాటా విక్రయం తదుపరి జేవీలో ఏబీసీఎల్‌కు 45.91 శాతం, మొమెంటమ్‌ మెట్రోకు 44.10 శాతం చొప్పున వాటాలు ఉంటాయి.  ఆరోగ్య బీమాపట్ల అవగాహన పెరగడం, వృద్ధిలో ఉన్న ఆర్థిక వ్యవస్థ కారణంగా దేశీ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ విభాగం భారీగా విస్తరించేందుకు వీలున్నట్లు ఏఐడీఏ పేర్కొంది. ఇక తాము అనుసరిస్తున్న ప్రత్యేక బిజినెస్‌ విధానాల పటిష్టతను అడియా పెట్టుబడులు సూచిస్తున్నట్లు ఏబీసీఎల్‌ తెలియజేసింది. హెల్త్‌ ఇన్సూరెన్స్‌లో వాటా విక్రయ వార్తల నేపథ్యంలో ఏబీ క్యాపిటల్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 2 శాతం లాభంతో రూ. 111 వద్ద ముగిసింది.

చదవండి: బంఫర్‌ ఆఫర్‌: 15 వరకు ఏ మెట్రోస్టేషన్‌కైనా రూ.30

 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top