ఆ ఒక్క వాక్యమే లేకుంటే.. ఆర్థిక సంస్కరణలు ఆగేవే?

30 Years Of Economic Reforms PV And Manmohan Singh Did Wonders - Sakshi

ఓ వైపు పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం.. మరోవైపు అడుగంటిపోయిన విదేశీ మారక ద్రవ్యం. దేశ దిగుమతి అవసరాలు తీరాలంటే బంగారం తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి. అయితే ఆ క్షణంలో ప్రధానీ పీవీ నరసింహారావు, ఆర్థిక మంత్రి మన్మోహన్‌సింగ్‌లు ఎంతో ధైర్యంగా 1991 జులై 24న ఆర్థిక సంస్కరణల అమలు చేయబోతున్నట్టు బడ్జెట్‌లో తెలిపారు. నేటితో ఆర్థిక సంస్కరణలకు 30 ఏళ్లు పూర్తయ్యాయి. 

కఠినమైన కాలం
1991లో ఇండియా ఆర్థికంగా కుదేలైన సమయం. ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో ఇంటర్నెషనల్‌ మానిటరీ ఫండ్‌ (ఐఎంఎఫ్‌) సాయాన్ని భారత ప్రభుత్వం కోరింది. దీనికి సంబంధించిన అగ్రిమెంట్‌లో చాలా కఠిన నిబంధనలను ఐఎంఎఫ్‌ పొందు పరిచింది. ఒక్క అక్షర ముక్క కూడా మార్చడానికి వీలు లేదన్నట్టుగా ఐఎంఎఫ్‌ భీష్మించుకుని కూర్చుంది. చివరకు అగ్రిమెంట్‌లో లేబర్‌ అన్న చోట LOBOR అంటూ అమెరికన్‌ పద్దతిలో రాస్తే కనీసం మన పరిస్థితులకు తగ్గట్టు LOBOUR గా అయినా మార్చాలంటూ కోరింది భారత ప్రభుత్వం. కనీసం స్పెల్లింగ్‌ మార్చే స్థితిలో కూడా అప్పటి భారత ప్రభుత్వం లేదు. అలాంటి స్థితి నుంచి ట్రిపుల్‌ బిలియన్‌ డాలర్ల ఆర్ధిక వ్యవస్థగా ఎదిగింది.

దీనికి బీజం వేసిన ఇద్దరు వ్యక్తులు పీవీ నరసింహారావు, మన్మోహన్‌సింగ్‌లు. అయితే ఆర్థిక సంస్కరణలకు అమలు సమయంలో నెలకొన్న పరిస్థితులు ఏంటీ ? పీవీ, మన్మోహన్‌ ద్వయం ఎలా మార్కెట్‌ని ఓపెన్‌ చేశారనే వివరాలను అప్పుడు పీవీకి సహాయకుడిగా ఉన్న మాజీ కేంద్ర మంత్రి జైరాం రమేశ్‌, ఆఫ్‌ లయన్‌ పేరుతో పీవీ బయోగ్రఫీ రాసిన వినయ్‌ సీతాపతిలు ఇటీవల జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ వివరాలు మీకోసం..

రూపాయి విలువ తగ్గింపు
1991 జున్‌ 21న ప్రధానిగా పీవీ నరసింహరావు, ఆర్థిక మంత్రిగా మన్మోహన్‌సింగ్‌లు ప్రమాణ స్వీకారం చేశారు. బాధ్యతలు చేపట్టిందే ఆలస్యం ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే పనిలో పడ్డారు. అందులో భాగంగా జూన్‌ చివరి వారంలోనే రూపాయి విలువ తగ్గించాలంటూ ఆర్థిక మంత్రి మన్మోహన్‌సింగ్‌ ప్రతిపాదించారు. ఈ  విషయంలో పీవీ నరసింహారావు, మన్మోహన్‌సింగ్‌ల మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తాయి. రూపాయి విలువ తగ్గిస్తే రాజకీయంగా ఇబ్బందులు ఎదురవుతాయని పీవీ వాదన, గతంలో 1966లో ఇందిరాగాంధీ ఇదే ప్రయత్నం చేసి చేదు ఫలితాలు చూశారు. అయితే విలువ తగ్గిస్తేనే మార్కెట్‌ పుంజుకుంటుందనేది మన్మోహన్‌ సింగ్‌ అభిప్రాయం. చివరకు రాజకీయ ఆటుపోట్లు తాను ఎదుర్కొంటానని చెబుతూ మన్మోహన్‌ సింగ్‌ నిర్ణయానికే ప్రధానీ పీవీ మద్దతు ఇచ్చారు.

అభిప్రాయ బేధాలు
రూపాయి విలువ తగ్గింపును రెండు అంచెల్లో ప్రవేశపెట్టనేది మన్మోహన్‌ సింగ్‌ వ్యూహం. ఒక్కసారి తగ్గింపుకే ప్రతిపక్షాలు గగ్గొలు పెడుతుంటే రెండు సార్లు తగ్గించడం ఎందుకంటూ పీవీ అభ్యంతరం వ్యక్తం చేశారు. మొదటిసారి తగ్గింపు మార్కెట్‌ను పరీక్షించేందుకని, ఆ ఫలితాలను బట్టి అసలైన నిర్ణయం రెండోసారి అంటూ మన్మోహన్‌ వివరణ ఇచ్చారు. అయినా సరే పీవీ సంతృప్తి చెందలేదు. ఆర్బీఐ అధికారులకు ఫోన్‌ చేసి రూపాయి విలువ తగ్గించవద్దంటూ కోరారు. అయితే అప్పటికే రూపాయి విలువ తగ్గిస్తున్నట్టు మార్కెట్‌కి చెప్పేశామంటూ అటు నుంచి బదులు వచ్చింది. ఫలితంగా అయిష్టంగానే మన్మోహన్‌ సింగ్‌ వ్యూహానికి పీవీ మద్దతు పలకాల్సి వచ్చింది. ఇలా  ప్రధాని, ఆర్థిక మంత్రిల మధ్య అభిప్రాయ బేధాలతోనే ఆర్థిక సంస్కరణలకు అడుగులు పడ్డాయి. 

మరో రెండు నిర్ణయాలు
రూపాయి విలువ తగ్గించడంతోనే ఈ ద్వయం ఆగిపోలేదు. 1991 జులై మొదటి వారంలో కొత్త ట్రేడ్‌ పాలసీని తీసుకువచ్చారు. దీని ప్రకారం ఎగుమతులను హేతుబద్ధీకరించడంతో పాటు ప్రోత్సహకాలు పెంచారు. అనంతరం ఇండస్ట్రియల్‌ పాలసీని ప్రవేశపెట్టారు. ఇందులో అప్పటి వరకు పారిశ్రామికవేత్తలను వేధిస్తూ వచ్చిన బ్యూరోక్రసీలో ఉండే రెడ్‌టెపిజానికి అడ్డుకట్ట వేశారు. దీంతో లైసెన్సులు త్వరగా వచ్చేలా మార్పులు చేసి, విదేశీ పెట్టుబడులకు అవకాశం కల్పించారు. విదేశీ ఎగుమతులు, దిగుమతులు సరళీకృతం చేశారు. 

ముందుమాటతో 
ఆర్థిక సం‍స్కరణలను వామపక్షాలు ముందు నుంచి తప్పుపడుతూనే ఉన్నాయి. అయితే ఇండస్ట్రియల్‌ పాలసీ, ట్రేడ్‌ పాలసీలకు సంబంధించి స్వపక్షం నుంచే పీవీకి సవాల్‌ ఎదురైంది. కేబినెట్‌ మంత్రులు, కాంగ్రెస్‌​ పార్టీ నేతలెవరు పీవీకి అండగా నిలవలేదు. ముసాయిదా డ్రాఫ్ట్‌లని రిజెక్ట్‌ చేశారు. దీంతో నెల రోజులుగా పడ్డ కష్టమంతా వృథా అయ్యే పరిస్థితి నెలకొంది. చివరకు ‘పరిస్థితులకు తగ్గట్టుగా ఈ చట్టంలో మార్పులు చేర్పులకు అవకాశం ఉంది’ అంటూ ముందు మాటను చేర్చారు. డ్రాఫ్ట్‌లో ఒక్క అక్షరం కూడా మార్చలేదు. కానీ ఈ ఒక్క ముందుమాటతో అప్పటి వరకు ముసాయిదాను వ్యతిరేకించిన మంత్రులంతా శభాష్‌ అంటూ ప్రధాని పీవీ, ఆర్థికమంత్రి మన్మోహన్‌ సింగ్‌లను మెచ్చుకున్నారు. అలా గండం గట్టెక్కి పార్లమెంటు ముందుకు వచ్చాయి ఆర్థిక సంస్కరణలు.

పీవీ నేర్పు
ఆర్థిక సంస్కరణల అమలును ఎప్పటిలాగే విపక్షాలు తప్పు పట్టాయి. పీవీపై తీవ్రమైన దాడి చేశాయి. పార్టీ నేతల నుంచి ఆశించిన సహకారం రాలేదు. ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానం ఇస్తూ వినాశకాలే సముత్‌ పన్నే.. అంటూ చెప్పిన సంస్కృత పద్యంతో బీజేపీ నేతలు పీవీని అర్థం చేసుకుని మాటల దాడి తగ్గించారు. ఆ తర్వాత పని సులువుగా జరిగిపోయింది. నిజానికి ‍ ప్రైవేటీకరణ అనే మాటను ఉపయోగించకుండానే ఎంతో నేర్పుగా పీవీ వ్యవహరించారు.

పీవీ చాణక్యం
పీవీ తన రాజకీయ జీవితంలో కేంద్రంలో రక్షణ, విదేశీ వ్యవహరాలు, మానవ వనరులు, ఆరోగ్యశాఖలను నిర్వహించారు. ఏపీకి ముఖ్యమంత్రిగా పని చేసినా తనదైన ముద్ర వేయలేకపోయారు. భూసంస్కరణలు మధ్యలో ఆగిపోతే జై ఆంధ్ర ఉద్యమ సెగలు చవిచూడాల్సి వచ్చింది. కానీ అనూహ్యంగా ప్రధాని పదవి చేపట్టిన పీవీ దేశంపై తన ముద్ర వేయగలిగారు. ఆర్థిక సంస్కరణల పితామహుడిగా నిలిచారు. అస్థిర ప్రభుత్వాలు నడుస్తున్న సమయంలో మైనార్టీ ప్రభుత్వంతో ఎవ్వరూ సాహసించలేని నిర్ణయాలను అమలు చేయగలిగారు. 

భవిష్యత్‌ దర్శనం
1991 జులై 24న పార్లమెంటులో బడ్జెట్‌ ప్రవేశపెడుతూ మన్మోహన్‌ సింగ్‌ చెప్పిన మాటలు వాస్తవ రూపం తీసుకున్నాయి.. ‘సరైన సమయం వచ్చినప్పుడు నూతన ఆలోచనలను ఏ శక్తి అడ్డుకోలేదు. ప్రపంచంలోనే ఇండియాను ఆర్థిక శక్తిగా నిలిపే చర్యలు తీసుకుంటున్నాం. అమలు చేయడమేది ముళ్ల బాట వంటిది. అయినా సరే ఆ పని చేసి తీరుతాం. ఈ పని చేసినందుకు భవిష్యత్తు తరాల వారు ఆర్థిక సంస్కరణల పితామహుడిగా పీవీ నరసింహరావుని గుర్తు పెట్టుకుంటారు’ అని తెలిపారు. ఈ రోజు దేశం మొత్తం పీవీ, మన్మోహన్‌ సింగ్‌లని స్మరించుకుంటోంది.  
- సాక్షి, వెబ్‌డెస్క్‌

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top