ముక్కోటికి పకడ్బందీ ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

ముక్కోటికి పకడ్బందీ ఏర్పాట్లు

Nov 27 2026 1:08 AM | Updated on Nov 27 2026 1:08 AM

● డిసెంబర్‌ 10 నుంచి 30 వరకు అధ్యయనోత్సవాలు ● సన్నాహక సమావేశంలో కలెక్టర్‌ అంకిత్‌

రాజ్యాంగాన్ని పరిరక్షించాలి

● డిసెంబర్‌ 10 నుంచి 30 వరకు అధ్యయనోత్సవాలు ● సన్నాహక సమావేశంలో కలెక్టర్‌ అంకిత్‌

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో జరిగే ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ అంకిత్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. డిసెంబర్‌ 10 నుంచి 30వ తేదీ వరకు ముక్కోటి అధ్యయనోత్సవాలు జరుగుతాయని, 19న తెప్పోత్సవం, 20న ఉత్తర ద్వార దర్శనం ఉంటుందని వివరించారు. భద్రాచలం గ్రామ పంచాయతీ పరిధిని 15 జోన్లుగా విభజించి 16 మంది ఎంపీఓలు, 120 మంది పంచాయతీ కార్యదర్శులు, 300 మంది కార్మికులతో మూడు షిఫ్టులలో పారిశుద్ధ పనులు చేపట్టాలని, 26 ప్రాంతాల్లో చలివేంద్రాలు, 155 టాయిలెట్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.

గోదావరిలో నీటిమట్టం ఆరు అడుగులు ఉండేలా చూడాలి

తెప్పోత్సవం, పుణ్యస్నానాల దృష్ట్యా గోదావరిలో నీటి మట్టాన్ని 6 నుంచి 6.5 అడుగుల మేర స్థిరంగా ఉంచడంతోపాటు స్నానఘట్టాల వద్ద బారికేడింగ్‌, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని, గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలని సూచించారు. నిరంతరాయ విద్యుత్‌ సరఫరా చేయాలని, కరకట్ట, బ్రిడ్జి ప్రాంతాల్లో 250 ఫ్లడ్‌ లైట్లు, హంసవాహనం వద్ద, ప్రతి సెక్టార్‌లో ఫైర్‌ సేఫ్టీ సిబ్బంది, రెండు వాటర్‌ టెండర్లను సిద్ధంగా ఉంచాలని సూచించారు. ఆర్టీసీ ద్వారా 80 ప్రత్యేక బస్సులు నడపాలని, ఆటోలు, మ్యాజిక్‌ వాహనాలు అధిక చార్జీలు వసూలు చేయకుండా గరిష్ట ధరల పట్టికను ప్రదర్శించాలని ఆదేశించారు.

సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయాలి

హోటళ్లు, దుకాణాల్లో ఆహార నాణ్యత, ధరలను ఫుడ్‌ సేఫ్టీ, లీగల్‌ మెట్రాలజీ అధికారులు తనిఖీ చేయాలన్నారు. తప్పిపోయిన పిల్లలను తల్లిదండ్రులకు అప్పగించేందుకు మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక సహాయ కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. ఎస్పీ రోహిత్‌ రాజు మాట్లాడుతూ భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున పటిష్టమైన బందోబస్తు, ట్రాఫిక్‌ నియంత్రణ చర్యలు చేపడుతున్నామని తెలిపారు.

ఉత్తర ద్వారం ఎదుట 8 సెక్టార్లు

భద్రాచలం సబ్‌ కలెక్టర్‌ మృణాల్‌ శ్రేష్ట మాట్లాడుతూ ఉత్తర ద్వారం ఎదుట 8 సెక్టార్లను ఏర్పాటు చేస్తున్నామని, వీఐపీ, జ్యుడీషియల్‌, మీడియా గ్యాలరీలకు ప్రత్యేక బ్లాక్‌లు కేటాయిస్తున్నామని వివరించారు. ఆలయ అభివృద్ధి పనుల వల్ల సెక్టార్ల సామర్థ్యంలో స్వల్ప మార్పులు ఉన్నాయని, సామాన్య భక్తుల కోసం 75 శాతం టికెట్లను ఆన్‌లైన్‌ ద్వారా, 25 శాతం టికెట్లను స్థానిక భక్తులకు అందుబాటులో ఉంచి సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం, ఆలయ పరిసరాల్లోని 5 కౌంటర్ల ద్వారా విక్రయిస్తామని తెలిపారు. ఐటీడీఏ పీఓ రాహుల్‌, అదనపు కలెక్టర్లు వేణుగోపాల్‌, విద్యా చందన, భద్రాచలం సబ్‌ కలెక్టర్‌ మృణాల్‌ శ్రేష్ఠ డీఆర్వో పద్మావతి, దేవస్థానం ఈఓ దామోదర్‌ రావు, కొత్తగూడెం ఆర్డీవో మధు, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.

ప్రతి ఒక్కరూ రాజ్యాంగ పరిరక్షణకు కృషి చేయాలని కలెక్టర్‌ అంకిత్‌ అన్నారు. కలెక్టరేట్‌లో గురువారం భారత రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. రాజ్యాంగ పరిషత్‌ ముసాయిదా కమిటీ చైర్మన్‌ డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ చిత్రపటానికి కలెక్టర్‌ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వివిధ శాఖల అధికారులు, సిబ్బందితో రాజ్యాంగ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం వంటి ప్రాథమిక హక్కులను కల్పించిందని తెలిపారు. రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య స్ఫూర్తిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని అన్నారు. అదనపు కలెక్టర్‌ విద్యా చందన, జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, డీపీఓ అనూష పాల్గొన్నారు.

టీజీఓస్‌ ఆధ్వర్యంలో కలెక్టర్‌కు సన్మానం

జపాన్‌ పర్యటన ముగించుకుని వచ్చిన కలెక్టర్‌ అంకిత్‌ను టీజీఓస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో గురువారం సన్మానించారు. జిల్లా అధ్యక్షుడు సంగం వెంకట పుల్లయ్య, జిల్లా సంక్షేమ శాఖ అధికారి తార, డీసీహెచ్‌ఎస్‌ రవిబాబు, టీజీఓస్‌ జిల్లా కార్యదర్శి ధనియాల వెంకటేశ్వర్లు, జిల్లా మహిళా అధ్యక్షురాలు ఎం.రాణి, బండి వెంకటేశ్వర్లు, జె శ్రీనివాస రావు, శిల్ప తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement