ఖమ్మంగాంధీచౌక్: వస్తు సేవల పన్ను(జీఎస్టీ) నిబంధనలను కేంద్ర ప్రభుత్వం మరింత సరళతరం చేసిందని సీజీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ పి.చంద్రశేఖర్ గౌడ్ తెలిపారు. నూతన నిబంధనలు వచ్చే ఏడాది ఏప్రిల్ 1నుంచి అమల్లోకి రానున్నాయని వెల్లడించారు. ఖమ్మంలో గురువారం జరిగిన ఉమ్మడి జిల్లా స్థాయి అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. వ్యాపారులపై భారం తగ్గించేలా జరిమానాల తగ్గింపు, ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ విస్తరణపై కేంద్రం దృష్టి సారించిందన్నారు. ప్రాసిక్యూషన్ పరిమితిని పెంచడంతో పాటు సాధారణ జరిమానాను తగ్గించినట్లు తెలిపారు. అంతేకాక సులభతరమైన జీఎస్టీ రిజిస్ట్రేషన్ విధానాన్ని ఆమోదించడంతో చిన్న వ్యాపారులు కూడా తేలికగా ఆన్‌లైన్‌లో వ్యాపారం చేసుకోవచ్చని చెప్పారు. సీజీఎస్టీ జిల్లా సూపరింటెండెంట్ నూతన్ కుమార్, ఖమ్మం టౌన్, కల్లూరు, కొత్తగూడెం, భద్రాచలం సూపరింటెండెంట్లు వంశీ, సాయిచౌహాన్, రాహుల్ కుమార్, దినేష్ నోయల్, ఫణిత్, టాక్స్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ సౌత్ రీజియన్ ప్రతినిధి ఉల్లిబోయిన సైదులుతో పాటు వివిధ సంస్థలు, అసోసియేషన్ల ప్రతినిధులు మహమ్మద్ అర్షద్, సునీల్ కుమార్, కురవెళ్ల ప్రవీణ్‌కుమార్, సోమ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
సీజీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్‌గౌడ్


