జూలూరుపాడు: మండల ప్రజాపరిషత్ అభివృద్ధి కార్యాలయంలో గురువారం సీతారామ భూనిర్వాసిత రైతులతో అవార్డు సభ నిర్వహించారు. పాల్వంచ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, భూసేకరణ అధికారి కె.వెంకట్రావు అధ్యక్షతన సభ జరిపారు. పాపకొల్లు రెవెన్యూ పరిధిలో సీతారామ మెయిన్ కెనాల్ కింద 100 మంది రైతులు 155 ఎకరాల భూమి కోల్పోతుండగా, సభలో పేర్లు, వివరాలు వెల్లడించారు. ఎకరానికి రూ.13 లక్షలు నష్టపరిహారం చెల్లిస్తామని భూసేకరణ అధికారి ప్రకటించగా రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏన్కూర్ లింక్ కెనాల్ కింద భూములు కోల్పోయిన రైతులకు ఎకరానికి రూ.21 లక్షలు నష్టపరిహారం చెల్లించారని, తమకు ఎకరానికి రూ.40 లక్షలు పరిహారం చెల్లించాల్సిందేనని వినతి పత్రం అందజేశారు. 2016 సంవత్సరం నుంచి సీతారామ ప్రధాన కాలువకు ఇచ్చిన భూముల్లో పంటలు సాగు చేయలేదని, నష్టపరిహారం ఇవ్వకపోవడంతో తీవ్రంగా నష్టపోయామన్నారు. కాగా, సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని భూసేకరణ అధికారి తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ టి.శ్రీనివాస్, ఇరిగేషన్ ఈఈ మహేశ్వరరావు, డీఈ చంద్రశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు.
ఉద్యాన కళాశాలలో తరగతులు ప్రారంభం
అశ్వారావుపేటరూరల్: అశ్వారావుపేట ఉద్యాన కళాశాలలో గురువారం నుంచి ఉద్యాన విద్య తరగతులు ప్రారంభమయ్యాయి. ఉద్యాన పరిశోధనా స్థానం ఆవరణలో ఏర్పాటు చేసిన కళాశాలలో 2026–27 విద్యా సంవత్సారంలో బీఎస్సీ(ఆనర్స్) ఉద్యాన కోర్సులో 30 సీట్లు కేటాయించగా, ఇప్పటివరకు 11 మంది కళాశాలలో చేరారు. వారికి గురువారం ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించి తరగతులు ప్రారంభించారు. కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ మజ్జిగ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


