సూపర్‌బజార్(కొత్తగూడెం)/పాల్వంచరూరల్: తరతరాలుగా అటవీ భూములను సాగు చేసుకుంటున్న గిరిజనులకు ఆర్వోఎఫ్‌ఆర్ పట్టాలు మంజూరు చేయాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సూచించారు. లక్ష్మీదేవిపల్లి మండలంలోని రేగళ్ల ఉమ్మడి పంచాయతీ పరిధిలోని రేగళ్ల, పెద్దతండా, హరియాతండా, దూదియాతండా, బావోజితండా, గట్టుమళ్ల గ్రామపంచాయతీల్లో గురువారం అటవీశాఖ అధికారులతో కలిసి పర్యటించారు. గిరిజన గ్రామాల్లో నెలకొన్న భూ, మౌలిక సదుపాయాల సమస్యలు పరిష్కరించాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. హరియతండా నుంచి కరకవాగు వరకు డబుల్ రోడ్డు విస్తరణకు, పాల్వంచలో అల్లూరి సెంటర్ నుంచి పాండురంగాపురం వరకు రహదారుల వెడల్పు పనులకు అటవీశాఖ అనుమతులు ఇవ్వాలని కోరారు. కొత్తగూడెం పట్టణ ప్రజల తాగునీటి అవసరాలు తీర్చే కిన్నెరసాని నూతన పైప్‌లైన్ నిర్మాణానికి రూ. 2.5 కిలోమీటర్ల మేర అటవీ అనుమతులు మంజూరు చేయాలని కోరారు. ప్రతిపాదిత రహదారులు, పైపులైన్ పనులు కిన్నెరసాని అభయారణ్యంఎకో సెన్స్‌టివ్ జోన్ పరిధిలోకి వస్తున్నా నేపథ్యంలో అవసరమైన చట్టబద్ధమైన అనుమతుల కోసం పరిశీలించినట్లు తెలిపారు. ప్రతిపాదనలకు అటవీశాఖ అధికారులు అంగీకరించారని చెప్పారు. అనంతరం డీఎఫ్‌ఓ మాట్లాడుతూ అభివృద్ధి పనుల కారణంగా వన్యప్రాణుల సహజ ఆవాసాలు, సంచార మార్గాలు, అటవీ వనరులు, జీవవైవిధ్యం ప్రతికూల ప్రభావం పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మేయర్ మూడ్ గణేష్, అధికారులు బాబు, కనకమ్మ, శ్రీనివాస్, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కే సాబీర్ పాషా, ముత్యాల విశ్వనాథం, రామకోటి, కోబల్, హరి, డాక్టర్ రవి, పూర్ణ, బాలాజీ, రమేష్, రాధాకృష్ణ పాల్గొన్నారు.
ఎమ్మెల్యే కూనంనేని


