విచారణ జరగాలి.. రికవరీ చేయాలి ! | - | Sakshi
Sakshi News home page

విచారణ జరగాలి.. రికవరీ చేయాలి !

Nov 27 2026 1:02 AM | Updated on Nov 27 2026 1:02 AM

అక్రిడిటేషన్‌ కార్డుల అమ్మకం

భారీగా జర్నలిస్టుల అక్రిడిటేషన్‌ కార్డుల అమ్మకం

కుటుంబ సభ్యుల పేరు మీద కార్డుకు దరఖాస్తు

కార్లు, భోజనాల విషయంలో దొంగ బిల్లులు

డీపీఆర్‌ఓ అజ్గర్‌ అవినీతి ఆరోపణలపై విచారణకు డిమాండ్‌

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: లైంగిక వేధింపులు, అవినీతి ఆరోపణల్లో నిండాకూరుకుపోయిన అజ్గర్‌ అక్రమాల చిట్ట ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తోంది. అధికార హోదాను అడ్డుగా పెట్టుకుని అక్రమంగా రూ. కోటి సంపాదించినట్టు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో డీపీఆర్‌ఓ హోదాలో అజ్గర్‌ పెట్టిన వివిధ బిల్లులపై విచారణ చేపట్టి, అవినీతికి పాల్పడినట్టు తేలితే, అతని జీతభత్యాల నుంచి రికవరీ చేయాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు.

అర్హులకు అన్యాయం

వర్కింగ్‌ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే డిమాండ్‌ రాష్ట్ర వ్యాప్తంగా బలంగా వినిపిస్తోంది. మీకు ఇంటి స్థలం రావాలంటే అక్రిడిటేషన్‌ కార్డు కావాలి. కార్డు రావాలంటే నాకు కాసులు ముట్టజెప్పాలని నేరుగానే బేరం మాట్లాడుకున్న విషయాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. బేరసారాల ఫలితంగా అన్ని అర్హతలు ఉన్న మీడియా సంస్థలు, జర్నలిస్టులకు రావాల్సిన కార్డులకు కోతలు విధించి సరైన అర్హతలు లేని వారికి జర్నలిస్టు గుర్తింపు కార్డులను జారీ చేసినట్టు తెలుస్తోంది.

అక్రిడిటేషన్‌ కార్డుల అమ్మకాల్లో రూ.లక్షలు?

అక్రిడిటేషన్‌ కార్డుల అమ్మకాల్లో రూ.లక్షలు సంపాదించిన డీపీఆర్వో ఇంటి స్థలం కొట్టేసేందుకు సైతం పాచికలు విసిరాడు. సొంత కుటుంబ సభ్యురాలి పేరుమీద ఓ చిన్న పత్రిక తరఫున అక్రిడిటేషన్‌ కోసం గృహిణిగా ఉన్న మహిళను సబ్‌ ఎడిటర్‌గా పేర్కొంటూ దరఖాస్తు చేయించినట్టు తెలుస్తోంది. కార్డు జారీ చేయడమే ఆలస్యమనే దశలో విషయం బయటకు పొక్కడం, పత్రికల్లో వార్తలు రావడంతో వెంటనే దరఖాస్తును వెనక్కి తీసుకున్న వైనం చూసి, ఆ శాఖకు చెందిన సిబ్బంది ముక్కున వేలేసుకున్నారు.

చేతివాటం

జిల్లాలో వివిధ ప్రాంతాల్లో సీఎం, మంత్రులు పర్యటించినప్పుడు ఆ ప్రదేశానికి విలేకరులను తీసుకెళ్లే బాధ్యత డీపీఆర్‌ఓది. అందుకోసం రెంట్‌కు వాహనాలను సమకూర్చుతారు. ఈ క్రమంలో రెండు కార్లు అద్దెకు తీసుకుని, నాలుగు కార్లు తీసుకున్నట్లు పలుమార్లు దొంగ బిల్లులు పెట్టినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఓసారి బిల్లు మంజూరు కాగానే సదరు ట్రావెల్స్‌ ఓనర్‌, ఈఎంఐలకు ఆ డబ్బులు కట్‌ అయ్యాయి. ఆ దొంగ బిల్లులకు సంబంధించిన డబ్బులు వసూలు చేసే క్రమంలో ఆ ట్రావెల్స్‌ కంపెనీ యజమానిని డీపీఆర్‌ఓ హోదాలో అజ్గర్‌ దుర్భాషలాడటంతో ఈ విషయం వెలుగు చూసింది.

ప్లేట్లు ఖాళీ.. బిల్లులు ఫుల్లు

పౌర సంబంధాల శాఖ తరఫున ప్రెస్‌మీట్లు, వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ సమయంలో టీ, టిఫిన్లు, భోజనాలు కూడా పెడుతుంటారు. దీన్ని అవకాశంగా మార్చుకుని భోజనాలు, టీ, టిఫిన్లు పెట్టకుండానే వేల రూపాయలు బిల్లులు కాజేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఐడీఓసీలో జరిగే కార్యక్రమాలకు సరఫరా చేసే ఓ కేటరింగ్‌ కంపెనీ తాము చేసిన పనికి సంబంధించి రూ.20 వేల బిల్లును సమర్పించగా.. దాన్ని తిరస్కరించి రూ.80 వేలకు బిల్లు పెట్టాలని, వచ్చినదాంట్లో ఫిఫ్టీ 50 షేర్‌ అంటూ డీపీఆర్‌ఓ సూచించినట్టు ఆరోపణలు వస్తున్నాయి. తాము రెగ్యులర్‌గా ఇక్కడ సేవలు అందిస్తున్నామని, అలాంటి తప్పుడు పనులు చేసి తమ పేరు చెడగొట్టుకోబోమని, సదరు కేటరింగ్‌ యజమాని బదులివ్వగా.. ఇప్పటి వరకు అతని బిల్లు మంజూరు కాని వైనం బయటకు వచ్చింది. ఆరోపణలపై వివరణ కోసం ప్రయత్నించగా డీపీఆర్‌ఓ అజ్గర్‌ అందుబాటులోకి రాలేదు.

వర్కింగ్‌ జర్నలిస్టులకు ప్రభుత్వం తరఫున ఇచ్చే అక్రిడిటేషన్‌ కార్డుల జారీ సందర్భంగా జిల్లా పౌర సంబంధాల అధికారి (డీపీఆర్‌ఓ)అజ్గర్‌ హుస్సేన్‌ అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కేవలం 22 మండలాలు ఉన్న జిల్లాలో ఏకంగా 900 అక్రిడిటేషన్‌ కార్డులు జారీ కావడంతో వెనుక ఆయన అవినీతి బాగోతం ఉన్నట్టు విమర్శలు వస్తున్నాయి. జిల్లా అక్రిడిటేషన్‌ కమిటీ తొలి సమావేశంలో 590 కార్డులకు అంగీకారం రాగా, కమిటీ నిర్ణయాన్ని మీరి 730 వరకు కార్డులు జారీ చేసినట్టు తెలుస్తోంది. కేవలం రెండు సార్లే అక్రిడిటేషన్‌ కమిటీ సమావేశాలు నిర్వహించి, మూడు సార్లు నిర్వహించినట్టు రికార్డుల్లో పేర్కొన్న వైనం తాజాగా వెలుగు చూసింది. ఆఖరికి కార్డుల ప్రింటింగ్‌ విషయంలోనూ లాలూచీ పడినట్టు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement