పాల్వంచరూరల్: కిన్నెరసానిలోని మత్స్య విత్తన కేంద్రంలో పెంచుతున్న చేప పిల్లలు మొత్తం మృత్యువాతపడ్డాయి. మండల పరిధి కిన్నెరసానిలోని ప్రభుత్వ మత్స్య విత్తన ఉత్పత్తి కేంద్రంలో అధికారులు 8 లక్షల స్పాన్(గుడ్లు) తీసుకొచ్చి చేప పిల్లలను పెంచారు. గత ఆగస్టులో రెండు ట్యాంక్‌ల్లో రెండు విడుతలుగా వీటిని వదిలారు. పిల్లలు 35 నుంచి 45 మిల్లీమీటర్లు పెరిగిన తర్వాత ప్రాథమిక గిరిజన మత్స్యపారిశ్రామిక సహకార సంఘాల పరిధిలో ఉన్న చెరువుల్లో పంపిణీ చేయాల్సి ఉంది. నీటి తొట్లలో స్పాన్ పోసిన తర్వాత 45 రోజులకు మించి ఉంచకూడదు. కానీ చేప పిల్లలు పోసి 90 రోజులైంది. దీంతో మేతలేక, ఎల్‌నినో నేపథ్యంలో మారిన వాతావరణ పరిస్థితుల్లో మొత్తం 8 లక్షల చేప పిల్లలు మృతి చెందాయని మత్స్యకారులు చెబుతున్నారు. మత్య్సశాఖ అధికారులు నిర్లక్ష్యంతో సొసైటీలకు పంపిణీ చేయలేదని, అందుకే చేప పిల్లలు మృతి చెందాయని ఆరోపిస్తున్నారు. లక్ష పిల్లలకు రూ. 25 వేల చొప్పున వెచ్చించారని, మొత్తం రూ. 2 లక్షల ప్రజాధనం వృథాగా మారిందని పేర్కొంటున్నారు.
సొంతంగా చేప పిల్లలను కొనుగోలు చేస్తున్న మత్స్యకారులు
ఈసారి చెరువుల్లో ఉచిత చేపపిల్లల పంపిణీ కోసం నిరీక్షించిన మత్స్యకారులు ప్రభుత్వంపై ఆశలు వదులుకున్నారు. సొంత డబ్బులను ఖర్చుచేసుకుని ఇతర ప్రాంతాల నుంచి చేప పిల్లలను తెచ్చుకుని చెరువులో పోసుకుంటున్నట్లు మత్స్యకారులు తెలిపారు. కాగా, ఈ విషయమై జిల్లా మత్స్యశాఖ అధికారి శివప్రసాద్‌ను వివరణ కోరగా.. మొత్తం చేప పిల్లలు మృతి చెందలేదని తెలిపారు.
కిన్నెరసానిలో వదిలిన మత్స్యశాఖ అధికారులు


